సాక్షి, హైదరాబాద్: ప్రపంచంలోనే అతిపెద్ద ఫార్మా క్లస్టర్‌గా రూపుదిద్దుకుంటున్న ‘హైదరాబాద్ ఫార్మా సిటీ’లో స్థానికులకే ఉద్యోగావకాశాలు కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఐటీ, పరి శ్రమల శాఖ మంత్రి కె.తారకరామారావు శనివారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో ఆదేశాలు జారీ చేశారు. ఫార్మాసిటీ ఏర్పాటు కోసం భూమిని ఇస్తున్న వారిలో కనీసం కుటుంబంలో ఒకరికైనా ఉద్యోగం ఇచ్చే దిశగా కసరత్తు చేయాలని అధికారులకు సూచించారు. ఫార్మాసిటీ ఏర్పాటు వల్ల ప్రభావితమవుతున్న కుటుంబాల జాబితా తయారు చేయాలన్నారు. కుటుంబ సభ్యులు, వారి విద్యా, సాంకేతిక అర్హతలను మ్యాపింగ్ చేయాలని చెప్పారు. ఫార్మాసిటీలో మౌలిక వసతుల ఏర్పాటు పనుల్లో వేగం పెంచాలని ఆదేశించారు. (బస్సుకు రూట్ క్లియర్..!)
అవసరాల మేరకు శిక్షణ
ప్రభావిత కుటుంబాల్లో ఆర్హులైన వారికి ఫార్మా రంగానికి అవసరమైన శిక్షణ ఇచ్చేందుకు ‘తెలం గాణ అకాడమీ ఫర్ స్కిల్ అండ్ నాలెడ్జ్’(టాస్క్), ఇతర శిక్షణ సంస్థల సహకారం తీసుకోవాలని కేటీఆర్ సూచించారు. స్థానికులకు నైపుణ్య శిక్షణ కోసం ఫార్మాసిటీ పరిసర మండలాల్లో రెండు శిక్షణ కేంద్రాలను ఏర్పాటు చేస్తామన్నారు. ఫార్మా సిటీలో పెట్టుబడు లతో ముందుకు వచ్చే కంపెనీలతో కలిసి ఈ శిక్షణ కేంద్రాల ద్వారా అర్హులైన వారికి ఉద్యోగాలు ఇప్పిస్తామన్నారు. ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి, పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్ రంజన్, పరిశ్రమల శాఖ కమిషనర్ మాణిక్కరాజ్ కణ్ణన్, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నరసింహారెడ్డి, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లా కలెక్టర్లు పాల్గొన్నారు.
ఫార్మాసిటీలో స్థానికులకే ఉద్యోగాలు
Published Mon, Aug 24 2020 1:01 AM | Last Updated on Mon, Aug 24 2020 1:01 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment