కందుకూరు: ఫార్మసిటీ ఏర్పాటుకు సంబంధించి సర్వే పనులు శనివారం ప్రారంభమయ్యాయి. ఇటీవల సీఎం కేసీఆర్ పలువురు ఫార్మా సంస్థల అధినేతలతో కలిసి కందుకూరు మండలం ముచ్చర్ల రెవెన్యూ పరిధిలో భూములను సందర్శించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జిల్లా సర్వే ఇన్ ల్యాండ్ రికార్డ్సు ఏడీ దేవరాజ్ ఆధ్వర్యంలో ఏడుగురు సర్వేయర్లు గల బృందం సర్వే నంబర్ 288లోని భూముల్లో సర్వే పనులు చేపట్టింది. ప్రభుత్వ రికార్డుల ప్రకారం ఆ సర్వే నంబర్‌లో 2,747.6 ఎకరాలకు గాను అసైన్డ్, పట్టా భూములుపోగా 2,139.34 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ప్రస్తుతం ఆ సర్వే నంబర్‌లోని భూముల సరిహద్దులను నిర్ణయించే పనిలో సర్వే బృందం నిమగ్నమైంది.