ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫార్మా సిటీ | pharma city will built with world facilties | Sakshi
Sakshi News home page

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫార్మా సిటీ

Published Sat, Oct 10 2015 2:16 AM | Last Updated on Sun, Sep 3 2017 10:41 AM

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫార్మా సిటీ

ప్రపంచస్థాయి ప్రమాణాలతో ఫార్మా సిటీ

► ఈ నెలాఖరులోగా టీఎస్‌ఐఐసీకి 3,500 ఎకరాల అప్పగింత
► శ్రీశైలం రహదారి, ఔటర్ రోడ్డుతో అనుసంధానం
► చైనా ఫార్మాసిటీ తరహాలో రూపురేఖలు, ప్రణాళిక
► ముచ్చర్ల ఫార్మాసిటీపై అధికారులతో మంత్రి జూపల్లి సమీక్ష

 సాక్షి, హైదరాబాద్: పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రాన్ని ప్రథమ గమ్యస్థానంగా మార్చేలా ఫార్మాసిటీకి రూపకల్పన చేయాలని రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అధికారులకు సూచించారు. నిర్దేశిత వ్యవధిలో ప్రపంచ స్థాయి ప్రమాణాలతో ఫార్మాసిటీ స్థాపనకు అధికారులు సమన్వయంతో పనిచేయాల్సిందిగా ఆదేశించారు. చైనా ఫార్మాసిటీ తరహాలో ముచ్చర్ల ఫార్మాసిటీ రూపురేఖలు, ప్రణాళిక రూపొందించాల్సిందిగా సూచించారు. రంగారెడ్డి జిల్లా ముచ్చర్లలో ఏర్పాటుచేయ తలపెట్టిన ఫార్మాసిటీపై మంత్రి శుక్రవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు.

రంగారెడ్డి జిల్లా జాయింట్ కలెక్టర్ రజత్‌కుమార్, టీఎస్‌ఐఐసీ ఎండీ వెంకట నర్సింహారెడ్డితో పాటు రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాలకు చెందిన వివిధ శాఖల అధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఫార్మాసిటీకి 11 వేల ఎకరాల భూమి అవసరం కాగా, ఇప్పటి వరకు జరిగిన భూసేకరణ తీరుపై మంత్రి సమీక్షించారు. ప్రభుత్వ అసైన్డ్ భూములతో పాటు గతంలో దక్కన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లాండ్ హోల్డింగ్స్ లిమిటెడ్(దిల్)కు కేటాయించిన 3,500 ఎకరాల భూమిని ఈ నెలాఖరులోగా టీఎస్‌ఐఐసీకి అప్పగిస్తామని, ఆ తర్వాత పట్టా, అటవీ భూముల సేకరణపై దృష్టి సారిస్తామని రంగారెడ్డి జాయింట్ కలెక్టర్ చెప్పారు.

భూసేకరణ పూర్తయితేనే ఫార్మాసిటీ ప్రతిపాదన వేగంగా పట్టాలెక్కుతుందని మంత్రి జూపల్లి పేర్కొన్నారు. శ్రీశైలం జాతీయ రహదారితో ఫార్మాసిటీని అనుసంధానిస్తూ 200 ఫీట్ల వెడల్పుతో రోడ్డు నిర్మాణానికి తక్షణమే ప్రతిపాదనలు సిద్ధం చేయాలని రోడ్లు, భవనాలు, టీఎస్‌ఐఐసీ అధికారులను మంత్రి ఆదేశించారు. ఔటర్ రింగ్ రోడ్డుతో ఫార్మాసిటీని అనుసంధానించేలా ప్రత్యామ్నాయ మార్గాల నిర్మాణంపైనా దృష్టి సారించాలన్నారు. రోడ్డు నిర్మాణానికి సంబంధించి వారం రోజుల్లో పూర్తి స్థాయి నివేదిక(డీపీఆర్) అందజేయాలని సంబంధిత శాఖల అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. వాటర్ గ్రిడ్ ద్వారా ఫార్మాసిటీ నీటి అవసరాలు తీర్చేందుకు డీపీఆర్ రూపొందించాలని గ్రామీణ నీటి సరఫరా అధికారులకు సూచించారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement