హైదరాబాద్‌కు మరిన్ని హంగులు
ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు
పెట్టుబడులకు ఆకర్షణీయమైన రాబడిపై హామీ
ప్రవాసి భారతీయ దివస్‌లో మంత్రి జూపల్లి
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్‌ను ప్రపంచస్థాయి నగరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను సిద్ధం చేస్తున్నట్లు రాష్ట్ర వాణిజ్య, పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. నగరానికి మరిన్ని హంగులు, అదనపు మౌలిక సౌకర్యాలను కల్పిస్తామని పేర్కొన్నారు. అమెరికాలోని లాస్ ఏంజెలిస్‌లో రెండోరోజు ఆదివారం జరిగిన తొమ్మిదో ప్రాంతీయ ప్రవాసి భారతీయ దివస్‌లో మంత్రి జూపల్లి మాట్లాడారు. తెలంగాణలో పారిశ్రామిక అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన చర్యలను వెల్లడించారు. ప్రస్తుతం హైదరాబాద్‌లో అంతర్జాతీయ విమానాశ్రయం, ఔటర్ రింగు రోడ్డు, మెట్రో రైలు తదితర ప్రపంచస్థాయి మౌలిక సౌకర్యాలున్నాయన్నారు. ఫార్మా, ఫిల్మ్ సిటీ, మెడికల్ డివెజైస్, ఫుడ్ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ తదితర రంగాల అభివృద్ధికి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు. రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలంటూ ప్రవాస భారతీయులను మంత్రి ఆహ్వానించారు.
‘మీరు పెట్టే పెట్టుబడులకు ఆకర్షణీయమైన రాబడి ఉండేలా ప్రభుత్వ విధానాలు ఉంటాయి.’ అని హామీ ఇచ్చారు. నైపుణ్యం కలిగిన మానవ వనరులతోపాటు తెలంగాణలో పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణం, మౌలిక సౌకర్యాలు ఉన్నాయని చెప్పారు. మాతృభూమి రుణం తీర్చుకునేందుకు ప్రస్తుతం దేశంలో, రాష్ట్రంలో అత్యంత అనువైన పరిస్థితులున్నాయని మంత్రి జూపల్లి అన్నారు. వేయి మందికి పైగా హాజరైన ఈ కార్యక్రమంలో విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్, శాన్‌ఫ్రాన్సిస్కోలో భారత కాన్సుల్ జనరల్ వెంకటేశన్ అశోక్, అమెరికాలో భారత రాయబారి అరుణ్.కె.సింగ్ తదితరులు పాల్గొన్నారు.