వినియోగించని భూములు స్వాధీనం
ఇప్పటికే 400 పారిశ్రామిక ఎకరాలు వెనక్కి: జూపల్లి
♦ 15 సెజ్‌లకు నోటీసుల జారీ టీఎస్-ఐపాస్ దేశానికే తలమానికం
♦ ఇప్పటికే 35 వేల కోట్ల పెట్టుబడులు
♦ 1.31 లక్షల మందికి ఉపాధి దొరికిందని సభలో మంత్రి ప్రకటన
సాక్షి, హైదరాబాద్: పరిశ్రమలు, ఎస్‌ఈజెడ్‌ల ఏర్పాటుకు గత ప్రభుత్వాలు ఇచ్చిన భూములను లక్ష్యం కోసం వినియోగించకుండా ఉంచితే.. వాటిని స్వాధీనం చేసుకుంటామని పరిశ్రమల శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు పేర్కొన్నారు. ఇప్పటికే ఆ ప్రక్రియ మొదలైందని తెలంగాణ వ్యాప్తంగా 400 ఎకరాలను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. రాష్ట్రంలో 43 ఎస్‌ఈజెడ్‌లకు గతంలో భూములు కేటాయించగా.. 28 మాత్రమే నిర్వహణలో ఉన్నాయన్నారు.
మిగతావాటికి నోటీసులు జారీ చేశామని, వాటి విషయంలో త్వరలో చర్యలు తీసుకుంటామన్నారు. 2014 జూన్ నుంచి ఇప్పటి వరకు తమ ప్రభుత్వం 258 పారిశ్రామిక యూనిట్లకు 269 ఎకరాలను మాత్రమే కేటాయించిందన్నారు. టీఎస్-ఐపాస్ విధానం ద్వారా అనుమతించిన పరిశ్రమలు, వచ్చిన పెట్టుబడులు, ఉపాధి పొందినవారి వివరాలు చెప్పాలంటూ ఆదివారం శాసనసభ ప్రశ్నోత్తరాల సమయంలో గంగుల కమలాకర్, గువ్వల బాలరాజు, చింతా ప్రభాకర్, జీవన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి, వివేకానంద, రాజేందర్‌రెడ్డి, రామ్మోహన్‌రెడ్డి, మాధవరెడ్డి, వంశీచందర్‌రెడ్డి, చిన్నారెడ్డి, రవీంద్రకుమార్ తదితర సభ్యులు అడిగిన ప్రశ్నలు, అనుబంధ ప్రశ్నలకు ఆయన సుదీర్ఘ సమాధానం చెప్పారు. పారిశ్రామిక రంగంలో దేశానికే తలమానికంగా ఆదర్శంగా నిలిచేలా తెలంగాణను తీర్చిదిద్దుతున్నట్టు ఆయన వెల్లడించారు.
‘విద్యుత్’ ధర్నాలు ఇప్పుడు లేవు
కరెంటు కోసం ఇందిరాపార్కు వద్ద పారిశ్రామికవేత్తలు ధర్నా చేసే పరిస్థితి ఇప్పుడు లేదని, ఎక్కడా కోతలు లేకపోతుండటంతో సంతోషంగా ఉన్నారన్నారు. టీఎస్-ఐపాస్ పారిశ్రామిక విధానం కింద గత సంవత్సరం జనవరి నుంచి తాజా మార్చి 15 నాటికి 2,019 యూనిట్లు ఏర్పడ్డాయని, వాటి రూపంలో రూ.34,914 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 1,31,589 మందికి ఉపాధి కలిగిందని సభకు జూపల్లి వివరించారు. భూముల కేటాయింపులో చైనా విధానాన్ని అనుసరిస్తున్నట్టు చెబుతున్నారని, అయితే చైనా భూ యాజమాన్య హక్కులు ప్రభుత్వం వద్దే ఉంటాయని, ఇక్కడ ఎందుకు అమలు చేయటం లేదని టీడీపీ సభ్యుడు రేవంత్‌రెడ్డి... ప్రపంచ బ్యాంకు అందజేసిన ‘ఈజ్ ఆఫ్ డూయింగ్’ నివేదికలో ఆంధ్రప్రదేశ్ రెండో స్థానంలో ఉంటే తెలంగాణ 13వ స్థానంలో ఎందుకు నిలిచిందని కాంగ్రెస్ సభ్యుడు వంశీచందర్‌రెడ్డి ప్రశ్నించారు. పద్దులపై చర్చ సందర్భంలో వివరంగా సమాధానం వస్తుందంటూ స్పీకర్ మధుసూదనాచారి పేర్కొనడంతో మంత్రి వాటికి సమాధానం చెప్పలేదు.
పాత కార్మికులకే అవకాశం
పెద్దపెద్ద సంస్థల్లో 80 శాతం ఉద్యోగాలను స్థానికులకే ఇవ్వాలనే నిబంధనను కచ్చితంగా అమలు చేస్తున్నామని, ఖాయిలా పరిశ్రమలను పునరుద్ధరిస్తే పాత కార్మికులకే అవకాశం ఇవ్వాలనే విధానాన్ని కూడా అవలంబిస్తున్నామని చెప్పారు. టీఎస్-ఐపాస్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేస్తే 20 ప్రభుత్వ విభాగాలకు సంబంధించిన ప్రక్రియలను ప్రభుత్వమే పూర్తి చేయించి పక్షం రోజుల్లో పరిశ్రమలకు అనుమతి ఇస్తోందని, ఒకవేళ ఆలస్యం జరిగితే అనుమతి వచ్చినట్టుగానే భావించి పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేలా దాన్ని రూపొందించామన్నారు. తెలంగాణ అనుసరిస్తున్న విధానం చూసి స్వయంగా మన ప్రధాని మోదీ కూడా అభినందించారని సభ దృష్టికి తెచ్చారు. రాయితీలను మొబైల్ యాప్ ద్వారా పొందే వెసులుబాటు కూడా కల్పించామన్నారు.