‘టెక్స్‌టైల్ పార్క్’కు కదలిక
చర్యలకు ఉపక్రమించిన సర్కారు
సూరత్‌కు ఉన్నతస్థాయి బృందం
ఎంపీ, ఎమ్మెల్యేలు, అధికారుల అధ్యయనం
ఆదేశించిన సీఎం కేసీఆర్
వరంగల్ : పారిశ్రామిక అభివృద్ధి పరంగా వరంగల్‌కు ప్రాధాన్యం ఇస్తామని ప్రకటించిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ దిశగా చర్యలకు ఉపక్రమించింది. వరంగల్‌లోని ప్రభుత్వ భూముల్లోనే టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి కేసీఆర్ సోమవారం అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ప్రతిపాదిత టెక్స్‌టైల్ పార్కులో అన్ని వస్త్ర ఉత్పత్తుల పరిశ్రమలు ఒకే చోట ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. టెక్స్‌టైల్ పరిశ్రమకు ప్రసిద్ధిగాంచిన సూరత్, షోలాపూర్, తిరుప్పూర్‌లో ఉన్నత స్థాయి బృందం పర్యటించి అధ్యయనం చేయాలని ఆదేశించారు. ప్రభుత్వ సలహాదారు బీవీ.పాపారావు, వరంగల్ ఎంపీ కడియం శ్రీహరి, వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్, పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డితోపాటు పలువురు ఉన్నతాధికారులతో ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. ఈ నెలాఖరులోగా అధ్యయనం చేసి నివేదిక ఇవ్వాలని ఈ బృందానికి సూచనలు చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనతో టెక్స్‌టైల్ పార్కు నిర్మాణ ప్రక్రియ మొదలైనట్లేనని జిల్లా పారిశ్రామికవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పత్తి పరిశ్రమలకు వరంగల్ అన్ని విధాలుగా అనువైన ప్రాంతంగా ఉంది.
నిజాం ప్రభుత్వ హయూంలోనే ఇక్కడ ఆజంజాహి టెక్స్‌టైల్ మిల్లు నిర్మించారు. ఈ పరిశ్రమ 10 వేల మంది కార్మికులకు ప్రత్యక్షంగా, మరో 10 వేల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించింది. జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో ఆజంజాహి బ్రాండ్ ఇమేజ్ సంపాదించింది. తర్వాత పరిస్థితుల్లో ఈ పరిశ్రమ మూతపడింది. ఈ పరిశ్రమ మూతపడిన కొన్నేళ్ల తర్వాత వరంగల్‌తోపాటు తెలంగాణ జిల్లాల్లో పత్తి సాగు విస్తీర్ణం, ఉత్పత్తి బాగా పెరుగుతూ వచ్చింది. పత్తి ఉత్పత్తిలో తెలంగాణ ప్రాంతం దేశంలోనే మూడో స్థానంలో నిలిచింది. 2013-14 పంట ఉత్పత్తిపై కాటన్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (సీసీఐ) తాజా నివేదికను వెల్లడించింది. ఈ సీజన్‌లో తెలంగాణలో 41,72,950 పత్తి బేళ్లు ఉత్పత్తి అయ్యాయి. మన రాష్ట్రానికి సంబంధించి పత్తి బేళ్ల (గింజ తీసిన పత్తి) ఉత్పత్తిలో ఆదిలాబాద్ ప్రథమ, వరంగల్ జిల్లా ద్వితీయ స్థానంలో ఉంది. ప్రస్తుతం జిల్లాలో 6.75 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తున్నారు. సగటున జిల్లాలోనే 9,09,450 బేళ్ల(1.70 కిలోలు) పత్తి ఉత్పత్తి అవుతోంది. మన జిల్లాతోపాటు కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల రైతులు వరంగల్ మార్కెట్‌కే పత్తిని తీసుకువస్తారు. ఇలా పత్తికి సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు అన్ని రకాలుగా వరంగల్ అనువైన ప్రాంతంగా ఉంది.
ప్రస్తుతం ఇలా...
జిల్లా కేంద్రం, పరిసర ప్రాంతాల్లో 16 కాటన్ టెక్నాలజీ మిషన్(టీఎంసీ) మిల్లులు, 60 వరకు టీఎంసీకాని జిన్నింగ్, ప్రెస్సింగ్ మిల్లులు, 40 సాధారణ జిన్నింగ్ మిల్లులు ఉన్నాయి. ఇక్కడ తయారైన పత్తి బేళ్లను తమిళనాడులోని కోయంబత్తూరు, సేలం, మధురైలోని స్పిన్నింగ్ మిల్లులకు వ్యాపారులు ఎగుమతి చేస్తున్నారు. అక్కడి మిలుల్లో పత్తి బేళ్లతో దారం(యార్న్) తయారు చేసి వస్త్ర పరిశ్రమలకు పంపిస్తారు. వరంగల్ జిల్లాలో రాష్ట్రంలోనే అతి పెద్ద వ్యవసాయ మార్కెట్(ఏనుమాముల) ఉంది. పత్తి పంట ఉత్పత్తి ఎక్కువగా ఉండే వరంగల్‌లో దారం(యార్న్) తయారు చేసే స్పిన్నింగ్ మిల్లులు... పత్తి గింజల నుంచి నూనె, చెక్క తీసే సాల్వెంట్ మిల్లులను నెలకొల్పితే ఇక్కడ ఉపాధి అవకాశాలు భారీగా పెరగనున్నాయి. టెక్స్‌టైల్ పార్కు అంటే వస్త్ర ఉత్పత్తి పరిశ్రమలు ఉంటాయి. ఉత్పత్తి చేసిన వస్త్ర ఉత్పత్తుల మార్కెటింగ్ చేసే అనుబంధ వాణిజ్య సంస్థలతో వరంగల్‌కు ప్రస్తుతం ఉన్న కష్టాలు తొలగిపోయే పరిస్థితి ఉండనుంది.