AP CM YS Jagan Review Meeting On Horticulture, Micro Irrigation: Check Details - Sakshi
Sakshi News home page

అగ్రికల్చర్‌ విద్యార్థులు ఆర్బీకేల్లో నెల రోజులు పని చేయాలి: సీఎం జగన్‌

Published Fri, Aug 13 2021 12:48 PM | Last Updated on Fri, Aug 13 2021 9:22 PM

CM YS Jagan Review On Horticulture And Micro Irrigation - Sakshi

సాక్షి, అమరావతి: హార్టికల్చర్,సెరికల్చర్‌,వ్యవసాయ అనుబంధశాఖలపై వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుక్రవారం తాడేపల్లిలోని క్యాంప్‌ కార్యాలయంలో సమీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ మాట్లాడుతూ.. ‘‘ఉద్యాన రంగంలో రైతులు ఆదాయాన్ని పెంచే వ్యూహాలను అమలు చేయాలి. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, విజ్ఞానాన్ని రైతులకు అందించడం కోసం జాతీయంగా, అంతర్జాతీయంగా నైపుణ్య సంస్థలు, యూనివర్సిటీల సహకారం తీసుకోవాలి. నిరంతర పరిశోధనలు, పరస్పర సమాచార మార్పిడి ద్వారా అధ్యయనం, ప్రయోగాలు కొనసాగాలి. ఎప్పటికప్పుడు వస్తున్న కొత్త వంగడాలు, సాగులో సమస్యల పరిష్కారం, ఫుడ్‌ప్రాసెసింగ్‌ రంగంలో కొత్త టెక్నాలజీ, ప్రాసెసింగ్‌కు అనుకూలమైన రకాల సాగే లక్ష్యంగా ఈ పరిశోధనలు ఉండాలని’’ అధికారులకు దిశానిర్దేశం చేశారు. 

కర్నూలులో ఉల్లి సాగుపై ఫోకస్‌ పెట్టండి
‘‘కర్నూలు జిల్లాలో మంచి మార్కెట్‌ అవకాశాలున్న ఉల్లి సాగుపై ఫోకస్‌ పెట్టండి. నాణ్యమైన మంచి రకం ఉల్లి సాగయ్యేలా చూడండి. ఫుడ్‌ ప్రాసెసింగ్‌కు అనుకూలంగా ఉన్న వెరైటీలు సాగయ్యేలా చూడాలి. టమోటను రోడ్డుమీద వేయడం, ధరలేక పొలంలోనే రైతులు ఉల్లిపంటను వదిలేసే పరిస్ధితి కనిపించకూడదు. దీనికోసం సరైన పరిష్కారాలను చూపాలి’’ అని సీఎం జగన్‌ అధికారులను ఆదేశించారు. 

ఫ్రూట్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా ఏపీ
ఉద్యానపంటల్లో గరిష్ట సాగుతో ఏపీ ప్రూట్‌ బౌల్‌ ఆఫ్‌ ఇండియాగా పేరు పొందిందని అధికారులు సీఎం జగన్‌కు తెలిపారు. కొబ్బరి, అరటి, బొప్పాయి, మిరప, టమోట, ఉల్లి, బత్తాయి పంటల సాగుపై సీఎంకు వివరాలందించారు. వీటి సాగుపై ప్రత్యేక దృష్టి సారించాలని సీఎం జగన్‌ సూచించారు. కొబ్బరి, బొప్పాయి, టమోట సాగులోనూ, ఉత్పాదకతలోనూ దేశంలోనే ఏపీ ప్రథమ స్థానంలో నిల్చిందని అధికారులు తెలిపారు. మిరప పంట విస్తీర్ణం పెంచడంతో పాటు ప్రాసెసింగ్‌పైనా దృష్టి పెట్టాలన్నారు సీఎం జగన్‌. టిష్యూ కల్చర్‌ విధానంలో అరటిసాగు చేపడుతున్నామన్నారు. పుడ్‌ ప్రాసెసింగ్‌లో భాగంగా 25 పార్లమెంటు నియోజకవర్గాల్లో వివిధ వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్‌ యూనిట్ల నిర్మాణ పనులు మొదలు కావాలని సీఎం జగన్‌ అదేశించారు. అక్టోబరు నుంచి దశలవారీగా నిర్మాణ పనులు ప్రారంభమవుతాయని అధికారులు తెలిపారు.

కొబ్బరికి మంచి ధర వచ్చేలా చూడాలి
కొబ్బరికి కూడా మంచి ధర వచ్చేలా చూడాలని.. కొబ్బరిమీద నిరంతరం పరిశోధనలు చేయాలని హార్టికల్చర్‌ విశ్వవిద్యాలయం వీసీని సీఎం జగన్‌ ఆదేశించారు. కొబ్బరిసాగులో ఎదురవుతున్న సమస్యల మీద నిరంతరం పరిశోధనలు కొనసాగాలని.. అవసరమైతే అత్యుత్తమ సంస్థల సహకారం కూడా తీసుకోవాలని సీఎం ఆదేశించారు. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలతో సహకారం, సమాచార మార్పిడి నిరంతరం కొనసాగాలని తెలిపారు. దీనివల్ల మంచి వంగడాలను పెట్టడంతోపాటు సాగులో వస్తున్న సమస్యలకు మంచి పరిష్కారాలు లభిస్తాయన్నారు. వీటితోపాటు ప్రాసెసింగ్‌ రంగంలో వస్తున్న సాంకేతిక పరిజ్ఞానంపైనా ఎప్పటికప్పుడు అధ్యయనాలు జరగాలన్న సీఎం.. వీటికి అనుగుణంగా సాగులో మార్పులు, అనుకూలమైన వంగడాలను సాగుచేసేలా తగిన చర్యలు తీసుకునే అవకాశం లభిస్తుందని తెలిపారు. 

‘‘రైతుభరోసా కేంద్రాలకు వచ్చినప్పుడు రైతులు వ్యక్తం చేస్తున్న సందేహాలను నివృత్తి చేసేలా వ్యవస్థ ఉండాలి. ఆర్బీకేల్లో ఉండే అగ్రికల్చర్‌ అసిస్టెంట్లు ఆ సందేహాలను తీర్చేలా ఉండాలి. దీనివల్ల రైతులకు, అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌లకు మధ్య మంచి వాతావరణం ఉంటుంది.. అనుకున్న ఫలితాలను సాధించగలుగుతాము. ఈ విషయంలో జవాబుదారీతనం ఉండాలి. అగ్రికల్చర్‌ విద్యార్థులు తప్పనిసరిగా ఆర్బీకేల్లో కనీసం నెలరోజులపాటు పనిచేసేలా నిబంధన పెట్టాలి. దీనివల్ల వాటి పనితీరు, కార్యక్రమాలపై వారికి అవగాహన, పరిజ్ఞానం వస్తాయని’’ సీఎం జగన్‌ తెలిపారు. 

అధిక ఆదాయాన్నిచ్చే పంటల సాగువైపు రైతులను ప్రోత్సిహించాలని అధికారులకు సీఎం జగన్ నిర్దేశించారు. బోర్లు కింద వరిసాగు, సుబాబుల్, పొగాకు, చెరకు, మొక్కజొన్న వంటి పంటల సాగుని క్రమంగా తగ్గించి, ఉద్యానపంటలసాగు వైపు మొగ్గుచూపేలా రైతులను మోటివేట్‌ చేస్తున్నామని అధికారులు తెలిపారు. 2020–21లో ఈ విధంగా 1 లక్షా 42వేల 565 ఎకరాల్లో అదనంగా ఉద్యానపంటలు సాగు చేపట్టినట్లు తెలిపారు అధికారులు. ఈ యేడాది 1,51,742 ఎకరాల్లో ఉద్యాన పంటల అదనపు సాగు లక్ష్యం నిర్దేశించుకున్నామన్నారు అధికారులు. పువ్వుల (ప్లోరీకల్చర్‌) రైతుల విషయంలో సరైన మార్కెటింగ్‌ అవకాశాలు, వాటి ప్రాసెసింగ్‌పైనా దృష్టిపెట్టాలని సీఎం జగన్‌ ఆదేశించారు. 

ఏపీఎంఐపీ పైనా సీఎం సమీక్ష
‘‘తుంపరసేద్యం, బిందుసేద్యం పరికరాల మంజూరులో పారదర్శకతకు పెద్దపీట వేయాలి. ఆర్బీకేల ద్వారా లబ్ధిదారుల ఎంపిక ఉండాలి. రివర్స్‌ టెండరింగ్‌కు వెల్లడం ద్వారా కూడా రేట్లు గణనీయంగా తగ్గుతాయి. నాణ్యమైన పరికరాలు మంచి రేట్లకు ప్రభుత్వానికి, రైతులకు అందుబాటులోకి వస్తాయి. అవినీతికి తావులేని విధానంలో రైతులకు పరికరాలు అందుబాటులోకి తీసుకురావాలి’’ అన్నారు సీఎం జగన్‌.

సెరికల్చర్‌ సాగు– ప్రోత్సాహం
సెరికల్చర్‌ సాగు విధానం, ఉత్పాదకతపై అధికారులు సీఎం జగన్‌కు వివరాలందించారు. పట్టుగూళ్ల విక్రయాల్లో ఇ– ఆక్షన్‌ విధానం తీసుకొచ్చామని తెలిపారు అధికారులు. దీనివల్ల దేశవ్యాప్తంగా వ్యాపారులు కొనుగోలుచేస్తున్నారని, రైతులకు ధరలు వస్తున్నాయని తెలిపారు. 1250కి పైగా ఆర్బీకేల పరిధిలో పట్టుపురుగులు పెంచుతున్న రైతులు ఉన్నారన్నారు. వీటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలన్న సీఎం.. సెరికల్చర్‌ సాగు ప్రోత్సాహకానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని.. రైతులకు షెడ్ల నిర్మాణంపై దృష్టిపెట్టాలని.. తద్వారా చిన్న రైతులను సెరికల్చర్‌ సాగులో ప్రోత్సహించినట్టవుతుందన్నారు.

ఈ సమీక్షా సమావేశంలో వ్యవసాయ, సహకార, మార్కెటింగ్, పుడ్‌ ప్రాసెసింగ్‌ శాఖ మంత్రి కురసాల కన్నబాబు, వ్యవసాయ, సహాకార, పశుసంవర్ధక, పాడిపరిశ్రామభివృద్ధిశాఖ స్పెషల్‌ సీఎస్‌ పూనం మాలకొండయ్య, హార్చికల్చర్‌ కమిషనర్‌ ఎస్‌ ఎస్‌ శ్రీధర్, ఏపీ విత్తనాభివృద్ధి సంస్ధ వీసీ అండ్‌ ఎండీ డాక్టర్‌ జి శేఖర్‌ బాబు, ఏపీ పుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ సీఈఓ ఎల్‌ శ్రీధర్‌రెడ్డి, ఏపీ మైక్రో ఇరిగేషన్‌ ప్రాజెక్టు పీఓ డాక్టర్‌ హరినాథ్‌ రెడ్డి, వైయస్సార్‌ హార్టికల్చర్‌ యూనివర్సిటీ వీసీ డాక్టర్‌ టి జానకిరామ్, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement