సాక్షి, హైదరాబాద్: సూక్ష్మసేద్యం పరికరాలపై జీఎస్టీ తగ్గకపోవడం రైతులను నిరాశపర్చింది. 18 శాతం జీఎస్టీని కేంద్ర ప్రభుత్వం సడలించకపోవడంతో ఆ ప్రభావం రాష్ట్ర రైతాంగంపై పడనుంది. సూక్ష్మసేద్యాన్ని ప్రోత్సహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నడుంబిగించిన సంగతి తెలిసిందే. రైతుల నుంచి భారీగా డిమాండ్ ఉండటంతో నాబార్డు నుంచి రూ. వెయ్యి కోట్ల రుణాన్ని తీసుకుంది. ప్రభుత్వ ప్రయత్నాలపై జీఎస్టీ దెబ్బ తగిలిం దని ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి.
గతంలో సూక్ష్మసేద్యంపై ఐదు శాతం వ్యాట్ ఉంటే, దాన్ని రాష్ట్ర ప్రభుత్వం (రూ. 5 వేల వరకు) భరించేది. జీఎస్టీ వచ్చాక 18 శాతంలో అదే ఐదు శాతాన్ని భరించేందుకు రాష్ట్ర సర్కారు సంసిద్ధత వ్యక్తం చేసింది. మిగిలిన 13 శాతంలో నాలుగు శాతం మేర రేట్లు తగ్గించేందుకు కొన్ని కంపెనీలు ముందుకు వచ్చినట్లు ఉద్యానశాఖ వర్గాలు చెబుతున్నాయి. రైతులపై నికరంగా 9 శాతం భారం పడుతుందని అధికారులు చెబుతున్నారు. దాన్ని కూడా ప్రభుత్వమే భరించాలని కోరుతున్నారు.
ఎస్సీ, ఎస్టీలకు పథకం ఉచితం.. పన్ను భారం
ప్రభుత్వం సూక్ష్మసేద్యాన్ని ఎస్సీ, ఎస్టీలకు ఉచితంగా ఇస్తుంది. బీసీలకు 90, ఇతరులకు 80 శాతం వరకు సబ్సిడీ ఇస్తుంది. ఎకరా సూక్ష్మసేద్యానికి దాదాపు రూ. 25 వేల నుంచి రూ.30 వేల వరకు ఖర్చు కానుంది. ఎస్సీ, ఎస్టీలకు సూక్ష్మసేద్యం ఉచితమైనా, జీఎస్టీ వల్ల రూ.10 వేల వరకు వెచ్చించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 3.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మ సేద్యం కోసం రైతులు ఇప్పటికే దరఖాస్తు చేసుకున్నారు. వారిలో 80 వేల మందికి సూక్ష్మసేద్యం మంజూరు చేశారు.
జీఎస్టీ తగ్గలేదు: వెంకట్రామిరెడ్డి, కమిషనర్, ఉద్యానశాఖ
‘ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో సూక్ష్మసేద్యంపై భారాన్ని తగ్గిస్తారని అనుకున్నాం. కానీ తగ్గలేదు. కాబట్టి 18 శాతం వరకు భారం పడుతుంది. దీంట్లో రాష్ట్ర ప్రభుత్వం ఐదు శాతం భరిస్తుంది. మిగిలిన దాంట్లో నాలుగు శాతం వరకు కంపెనీలు రేట్లు తగ్గిస్తాయి. ఇవన్నీ పోగా 9 శాతం రైతులు భరించక తప్పదు.’ అని ఉద్యానశాఖ కమిషనర్ వెంకట్రామిరెడ్డి అన్నారు.
సూక్ష్మసేద్యంపై తగ్గని జీఎస్టీ
Published Mon, Nov 13 2017 2:27 AM | Last Updated on Mon, Nov 13 2017 2:27 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment