గుర్రంపోడు, న్యూస్‌లైన్ : దేశీయ పరిజ్ఞానం.. తక్కువనీటి వినియోగంతో ఎక్కువ విస్తీర్ణంలో పంటలు సాగు చేయవచ్చన్న ప్రధాన లక్ష్యంతో ఏఎమ్మార్పీ పరిధిలో ఐదేళ్ల క్రితం చేపట్టిన తుంపరసేద్యం పనులకు గ్రహణం పట్టింది.మైక్రోఇరిగేషన్, విద్యుత్, నీటిపారుదల శాఖల అధికారుల మధ్య సమన్వయంలేక దీని పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ప్రతీ ఖరీఫ్‌లో అధికారులు హడావుడి చేయడం ఆ తరువాత పట్టించుకోకపోవడం పరిపాటిగా మారింది. పైలట్ ప్రాజెక్టంటూ ఖర్చు చేసిన రూ. 16 కోట్ల నిధులు వృథా అయ్యేలా ఉన్నా అధికారుల్లో చలనం లేదు. సాధారణంగా కాల్వల కింద సాగయ్యే వరితో పోల్చితే తక్కువ నీటితో ఎక్కువ విస్తీర్ణంలో ఆరుతడి పంటలు సాగుచేయవచ్చనే ఉద్దేశంతో 2008లో రూ.19.6 కోట్లతో ఏఎమ్మార్పీ డిస్ట్రిబ్యూటరీలు 16,17ల పరిధిలో 5,500 ఎకరాల్లో తుంపర సేద్యం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ప్రభుత్వమే ఉచితంగా పది ఎకరాలకు ఒకటి చొప్పున సంపును నిర్మించాలని అలాగే కరెంటు మోటారు, స్పింకర్ల పరికరాలు ఇవ్వాలని నిర్ణయించింది.
ఒక్క ఎకరాకు రూ. 40వేలు ఖర్చు చేసేలా ఏర్పాట్లు చేసి పనులు మొదలు పెట్టింది. అయితే మైక్రో ఇరిగేషన్, విద్యుత్, నీటిపారుదల శాఖ అధికారుల మధ్య సమన్వయంలేక పనులు నత్తనడకన కొనసాగుతున్నాయి. ఇప్పటి వరకు 500 సంపులకుగాను 400 సంపులు తవ్వి, 100 మోటార్లను పంపిణీ చేశారు. కానీ స్పింక్లర్ల పైపులు, పరికరాలు ఇవ్వకపోవడంలో సూక్ష్మసేద్యం ప్రాజెక్టు అటకెక్కింది. సంపులు శిథిలమై కరెంటు లైన్లు, ట్రాన్స్‌ఫార్మర్లు చోరీకి గురవుతున్నాయి. రూ.5కోట్లతో ఏర్పాటు చేసిన విద్యుత్ సరఫరా లేని లైన్లు తరుచూ చోరీకి గురవుతున్నాయి.
బీడుగా భూములు
మండలంలో ఏఎమ్మార్పీకి సంబంధించి మైనర్లు, పంటకాల్వలు ఉన్నాయి. వీటి ద్వారా నీరు పంటపొలాలకు చేరుతుంది. అయితే డీ-16,17 లలో తుంపర సేద్యం విధానాన్ని చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించడం వల్ల కాల్వలు తవ్వలేదు. మండలంలోని తెరాటిగూడెం. పల్లిపహాడ్, మొసంగి గ్రామాల పరిధిలో 2200 ఎకరాలు సూక్ష్మసేద్యం పరిధిలోకి వస్తాయి. ఈ భూములు ఇటు తుంపరసేద్యానికి, అటు పంటకాల్వలకు నోచుకోక బీళ్లుగా మారుతున్నాయి. ఈ ప్రాజెక్టు తమ పాలిట శాపంగా మారిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
కాల్వలు తవ్వాలి : రామగిరి చంద్రశేఖర్‌రావు, రైతు సంఘం నాయకుడు
తుంపరసేద్యమో, పంటకాల్వలో ఏదో ఒకటైనా పూర్తి చేయాలని కోరుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. రెండింటినీ ఇస్తామని అప్పట్లో అధికారులు హామీ ఇస్తేనే సూక్ష్మసేద్యానికి అంగీకరించాం. కనీసం కాలిన టాన్స్‌ఫార్మర్లకు మరమ్మతులు చేయిం చుకునే పరిస్థితి లేదు. ఈఖరీఫ్‌లోనైనా ముందుగా పంటకాల్వలు తవ్వాలి.
రూ.16కోట్లు తుంపర పాలు
Published Wed, May 14 2014 2:37 AM | Last Updated on Sat, Sep 2 2017 7:19 AM
Advertisement
Advertisement