సాక్షి, అమరావతి: రైతన్నకు ఇటు సాగు ఖర్చుల్లో ఆదాతోపాటు అటు అదనంగా ఆదాయం సమకూరే సూక్ష్మ సేద్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తోంది. ఏటా భారీగా నిధులు కేటాయిస్తూ రాయితీపై రైతులకు సూక్ష్మ సేద్యం పరికరాలను అందజేస్తోంది. గత సర్కారు పెట్టిన బకాయిలను సైతం చెల్లించింది. మైక్రో ఇరిగేషన్ పరికరాల సరఫరాదారులతో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఇప్పటికే సమావేశాన్ని నిర్వహించి టెండర్లు కూడా పిలవడంతో ఏప్రిల్‌లో పనులు వేగం పుంజుకోనున్నాయి.
ఈ ఏడాది అదనంగా లక్షన్నర హెక్టార్లలో
సూక్ష్మ సేద్యంతో అన్నదాతకు అన్ని విధాలా లాభమే. విలువైన ఎరువులు మొక్కకు నేరుగా అందడంతోపాటు నీటివృథా లేనందున కలుపు మొక్కల సమస్యకు ఇది విరుగుడు. మైక్రో ఇరిగేషన్ (సూక్ష్మసేద్యం)తో సాగువ్యయం తక్కువ కావడంతోపాటు రైతులకు అదనపు ఆదాయం లభిస్తోందని రాష్ట్ర సామాజిక, ఆర్థిక సర్వే నివేదిక విశ్లేషించింది. ఈ ఏడాది అదనంగా 1.50 లక్షల హెక్టార్లను మెక్రో ఇరిగేషన్ పరిధిలోకి తేవాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించింది. ఇందుకోసం రూ.1,190.11 కోట్లు వ్యయం చేయనుంది. ఇందులో రూ.961.86 కోట్లను ప్రభుత్వం సబ్సిడీ కింద భరించి సూక్ష్మ సేద్యం పరికరాలను రైతులకు రాయితీపై అందజేస్తుంది. రైతులు తమ వాటాగా రూ.228.25 కోట్లను చెల్లించాల్సి ఉంటుంది.
టాప్ పదిలో అనంత, కడప..
ప్రస్తుతం రాష్ట్రంలో 13.41 లక్షల హెక్టార్లలో మైక్రో ఇరిగేషన్ కింద సాగులో ఉంది. దీనికి అదనంగా 2022–23 ఆర్థిక ఏడాదిలో 1.50 లక్షల హెక్టార్లను సూక్ష్మ సేద్యం పరిధిలోకి తేవాలని నిర్ణయించారు. రాయలసీమతో పాటు నీటి ఎద్దడి ఉండే జిల్లాల్లో రైతులు డ్రిప్ ఇరిగేషన్ కింద పంటలు సాగు చేస్తున్నారు. 2019–20లో మైక్రో ఇరిగేషన్ సాగు విస్తీర్ణంలో దేశవ్యాప్తంగా రాష్ట్రం నాలుగో స్థానంలో ఉంది. మైక్రో ఇరిగేషన్‌లో దేశంలో పది జిల్లాలు అగ్రస్థానంలో ఉండగా రాష్ట్రం నుంచి అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాలు ఆ జాబితాలో ఉన్నాయి.
పెట్టుబడి తగ్గి అదనపు ఆదాయం
రైతులకు సబ్సిడీ కల్పించడం ద్వారా మైక్రో ఇరిగేషన్ సాగు విధానాన్ని పెద్ద ఎత్తున ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. సూక్ష్మ సేద్యంతో పెద్ద ఎత్తున నీటి ఆదాతో పాటు విద్యుత్, ఎరువులు వినియోగం భారీగా తగ్గనుంది. మైక్రో ఇరిగేషన్ విధానంలో సాగు చేయడం ద్వారా హెక్టార్‌కు రూ.21,500 పెట్టుబడి ఖర్చులు తగ్గడంతోపాటు హెక్టార్‌కు అదనంగా రూ.1,15,000 చొప్పున ఆదాయం లభిస్తుందని సామాజిక ఆర్థిక సర్వే విశ్లేషించింది.
ఆర్బీకేల ద్వారా లబ్ధిదారుల ఎంపిక
2022–23లో కొత్తగా 3.75 లక్షల ఎకరాల్లో సూక్ష్మసేద్యాన్ని విస్తరించేందుకు రూ.1,190.11 కోట్లతో కార్యాచరణ సిద్ధమైంది. దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల్లో సూక్ష్మ సేద్యంపై అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలపై అధ్యయనం చేస్తున్నాం. మరింత మెరుగ్గా రాష్ట్రంలో రైతులకు మేలు చేకూర్చేలా త్వరలో ఉన్నతాధికారుల సమావేశంలో విధివిధానాలను ఖరారు చేస్తాం. ఆర్బీకేల ద్వారా లబ్ధిదారుల ఎంపిక అత్యంత పారదర్శకంగా జరుగుతుంది. ఇప్పటికే ప్రతి ఆర్బీకేకి లాగిన్ ఐడీ ఇచ్చాం. ప్రత్యేకంగా యాప్ డిజైన్ చేశాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సంకల్పం మేరకు వంద శాతం గ్రౌండింగ్ చేసేందుకు కృషి చేస్తాం
– డాక్టర్ సీబీ హరనాథరెడ్డి, రాష్ట్ర సూక్ష్మ సాగునీటి పథకం పీవో
Comments
Please login to add a commentAdd a comment