120 రోజుల పత్తి‘యుగాంక్‌’! | Yugank to be equal with hybrid production | Sakshi
Sakshi News home page

120 రోజుల పత్తి‘యుగాంక్‌’!

Published Tue, Mar 21 2017 3:42 AM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

120 రోజుల పత్తి‘యుగాంక్‌’! - Sakshi

120 రోజుల పత్తి‘యుగాంక్‌’!

నాగపూర్‌లోని సి.ఐ.సి.ఆర్‌.అద్భుత ఆవిష్కరణ
4 నెలల్లోనే పూర్తి దిగుబడినిచ్చే  ‘యుగాంక్‌’ పత్తి వంగడాలు
పత్తి సాగు కాలంతోపాటు సగానికి తగ్గనున్న ఖర్చుl
మెట్ట పొలాల్లో వర్షాధార సేద్యానికి బాగా అనువైనది
వత్తుగా విత్తుకుంటే హైబ్రిడ్‌తో దీటుగా దిగుబడి
పత్తి తర్వాత రెండో పంటగా అపరాల సాగుకు వీలు


మెట్ట పొలాల్లో వర్షాధారంగా పత్తిని సాగు చేసే రైతుల కష్టాలు తీర్చే అద్భుతమైన స్వల్పకాలిక పత్తి వంగడాన్ని నాగపూర్‌లోని కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సి.ఐ.సి.ఆర్‌.) శాస్త్రవేత్తలు రూపొందించారు. 100–120 రోజుల్లో పూర్తి దిగుబడినివ్వడం దీని విశిష్టత. పత్తి సాగులో రైతులకు శాపంగా మారిన అనేక సంక్లిష్ట సమస్యలకు ‘యుగాంక్‌’ అనే ఈ స్వల్పకాలిక అపూర్వ పత్తి వంగడాలు చక్కని పరిష్కారమని డాక్టర్‌ కేశవ్‌ క్రాంతి ‘సాక్షి’కి తెలిపారు. వరంగల్‌ జిల్లా కాజీపేట ఆయన స్వస్థలం. సి.ఐ.సి.ఆర్‌. డైరెక్టర్‌గా మొన్నటి వరకు సేవలందించిన ఆయన వారం క్రితం స్వచ్ఛంద పదవీ విరమణ చేశారు. వాషింగ్టన్‌లోని అంతర్జాతీయ పత్తి సలహా మండలి (ఐ.సి.ఎ.సి.)లో సాంకేతిక విభాగం అధిపతిగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. ‘సాక్షి సాగుబడి’కి ఇచ్చిన టెలిఫోన్‌ ఇంటర్వ్యూలో  ‘యుగాంక్‌’ పత్తి వంగడాలకు సంబంధించిన విషయాలను వెల్లడించారు.

తొమ్మిదేళ్ల కృషి ఫలితం
కర్ణాటకలోని ధార్వాడ్‌ వ్యవసాయ విశ్వవిద్యాలయం, నాగపూర్‌ సి.ఐ.సి.ఆర్‌. సంయుక్త కృషితో ‘యుగాంక్‌’ పత్తి వంగడం రూపుదాల్చింది. ధార్వాడ్‌కు చెందిన సీనియర్‌ పత్తి ప్రజనన శాస్త్రవేత్త డా. ఎస్‌.ఎస్‌. పాటిల్‌ అందించిన బేసిక్‌ మెటీరియల్‌తో నాగపూర్‌ సి.ఐ.సి.ఆర్‌.లో పరిశోధన విజయవంతమైంది. డా. క్రాంతి పర్యవేక్షణలో యువ శాస్త్రవేత్త డా. హెచ్‌.బి. సంతోష్‌ గత తొమ్మిదేళ్లుగా కొనసాగించిన పరిశోధనల ఫలితంగా ఎట్టకేలకు స్వల్పకాలిక పత్తి వంగడాలు సిద్ధమయ్యాయి. డా. పాటిల్‌ కుమారుడు ‘యుగాంక్‌’ అకాల మరణం చెందడంతో అతని పేరును ఈ వంగడాలకు పెట్టారు.

ప్రతి ఏటా విత్తనాలు కొనాల్సిన పని లేదు
తిరిగివాడుకోదగిన (నాన్‌ బీటీ) సూటి రకంతో పాటు.. శనగపచ్చ పురుగును తట్టుకునే సామర్థ్యం కలిగిన (నాన్‌ హైబ్రిడ్‌) బీటీ సూటి రకాన్ని కూడా అందుబాటులోకి తేనున్నట్లు తెలిపారు. ఈ రెండు రకాల విత్తనాలనూ తాము పండించిన పత్తిలో నుంచి తీసి దాచుకొని, తర్వాత సంవత్సరం రైతులు వాడుకోవచ్చు. ఇప్పటి మాదిరిగా ప్రతి ఏటా కంపెనీల నుంచి కొనాల్సిన అవసరం ఉండదు. ప్రపంచ దేశాల్లో ఎక్కడా లేని విధంగా మన దేశంలోనే  6–8 నెలల పాటు సాగు చేయాల్సిన హైబ్రిడ్‌ బీటీ పత్తి రకాలు సాగులో ఉన్నాయని.. రైతులను అష్టకష్టాలు పెడుతున్న ఈ రకాలకు స్వస్తి చెప్పాల్సిన సమయం రానే వచ్చిందని డా. క్రాంతి ఉద్వేగభరిత స్వరంతో అన్నారు.

పూత,కాత దశలోనే నీరు,పోషకాల అవసరం ఎక్కువ
ఇప్పుడు మన రైతులు పండిస్తున్న బీటీ హైబ్రిడ్‌ పత్తి రకాల పంటకాలం 170–240 రోజుల (6 నుంచి 8 నెలలు) వరకు ఉంది. ఆస్ట్రేలియా, చైనాల్లో 150 రోజుల వరకు ఉంది. వర్షాకాలం పూర్తయ్యి, మెట్ట భూములు బెట్టకొచ్చే రోజుల్లో పత్తి చేలు పూత, కాత దశలో ఉంటున్నాయి. నిజానికి నీరు, పోషకాలు 80–85% వరకు ఈ దశలోనే అవసరం. కానీ, అప్పటికే వర్షాకాలం ముగియడం వల్ల నీటి వసతి లేని పొలాల్లో పత్తి దిగుబడి తగ్గిపోతున్నది. స్వల్పకాలిక రకం సాగు చేస్తే వర్షాకాలంలోనే పూత, కాత వస్తుంది కాబట్టి మెట్ట సాగులో సమస్య ఉండదు.

నవంబర్‌ నాటికి పత్తి తీత పూర్తవుతుంది..
దీర్ఘకాలిక పత్తి పంటకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో నవంబర్‌ తర్వాతే గులాబి రంగు కాయతొలిచే పురుగు సోకుతుంది. అయితే, ఈ కొత్త వంగడం ‘యుగాంక్‌’ వేసుకుంటే నవంబర్‌ నాటికి పత్తి తీయటం కూడా పూర్తవుతుంది. కాబట్టి ఈ పురుగు బెడద నుంచి తప్పించుకోవచ్చు. రసంపీల్చే పురుగులు, ఇతర చీడపీడల బెడద కూడా తగ్గిపోతుంది.

ఖర్చు సగం తగ్గుతుంది..
హైబ్రిడ్‌ బీటీ పత్తి సాగుకు పంటకాలం 6–8 నెలలు. యుగాంక్‌ రకం పత్తి సాగు కాలం మూడున్నర నుంచి నాలుగు నెలలకు తగ్గిపోవడం వల్ల సాగు ఖర్చు ఇప్పటితో పోల్చితే సగానికన్నా ఎక్కువే తగ్గుతుందని డా. క్రాంతి తెలిపారు. ఎరువుల అవసరం తగ్గిపోతుంది. పురుగుమందులను ఒకటి, రెండుసార్లు పిచికారీ చేస్తే చాలు. మొత్తంగా పంట యాజమాన్యం చాలా సులభమవుతుంది. పత్తి పూర్తయ్యాక పప్పుధాన్య పంటలు వేసుకుంటే రైతుకు అదనపు ఆదాయంతోపాటు భూమి కూడా సారవంతమవుతుంది. తొలి వర్షాలకు కలుపును మొలవనిచ్చి, పీకేసిన తర్వాత పత్తిని విత్తుకుంటే కలుపు సమస్య తగ్గుతుంది. ఎరువుల అవసరం, ఖర్చు కూడా తగ్గిపోతుంది. జూలైలో విత్తుకుంటే నవంబర్‌ నాటికి పత్తి తీత కూడా పూర్తవుతుంది. పత్తి నాణ్యత కూడా చాలా బాగుంటుంది. ‘యుగాంక్‌’ పత్తి వంగడంతో రైతు స్థాయిలోనే విత్తనోత్పత్తి చేసుకోవడం కూడా సులువేనని డా. క్రాంతి అన్నారు. అందుకే ఈ వంగడం పత్తి సాగుకు సుస్థిరతనివ్వడంతోపాటు కొత్త దిశను నిర్దేశిస్తుందని భావించవచ్చు. పత్తి సాగులో ఉన్న మెట్ట ప్రాంతాల్లోనే ఎక్కువగా రైతుల ఆత్మహత్యలు జరుగుతున్న నేపథ్యంలో ఈ వంగడాలు రైతులకు ఊరటనిస్తాయనడంలో సందేహం లేదు.  
– పంతంగి రాంబాబు, సాగుబడి డెస్క్‌

పత్తి శాస్త్రవేత్తగా పాతికేళ్ల అనుభవంలో ఇది అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం!
 ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా మన దేశంలో వాడుతున్న దీర్ఘకాలిక బీటీ హైబ్రిడ్‌ పత్తి విత్తనాలకు ‘యుగాంక్‌’ పత్తి వంగడం సరైన ప్రత్యామ్నాయం. 9 ఏళ్లు కష్టపడి మన శాస్త్రవేత్తలు రూపొందించిన ‘యుగాంక్‌’ వంగడాలు 100 నుంచి 120 రోజుల్లోనే పూర్తిస్థాయి పత్తి దిగుబడినిస్తాయి. పత్తి సాగు చరిత్రను తిరగరాయగల అద్భుత ఆవిష్కరణ ఇది. వర్షాధారంగా మెట్ట పొలాల్లో పత్తి సాగు చేస్తున్న భారతీయ రైతులకు, ముఖ్యంగా మహారాష్ట్రలోని విదర్భ, తెలంగాణ రాష్ట్రాల్లో రెతులకు ఈ సరికొత్త పత్తి వంగడాలు గొప్ప వరం.

ఎన్నో విధాలుగా మేలైన ఇంత తక్కువ రోజుల్లో దిగుబడినిచ్చే పత్తి వంగడాలను రూపొందించగలమని నేను కలలో కూడా ఊహించలేదు. పత్తి శాస్త్రవేత్తగా నాకున్న పాతికేళ్ల పరిశోధనా అనుభవంలో ఇది అత్యంత ఉద్వేగభరితమైన ఘట్టం. ప్రపంచవ్యాప్తంగా పత్తి దిగుబడులు తగ్గిపోతుండడం పెద్ద సవాలు. బీటీ టెక్నాలజీ కొన్నాళ్లు పనిచేసింది. ఇప్పుడు బహుళజాతి కంపెనీల దగ్గర కూడా సమాధానాలు లేవు. అందుకే వాషింగ్టన్‌లోని ఐ.సి.ఎ.సి.లో సాంకేతిక విభాగం బాధ్యతలు చేపడుతున్నా. అక్కడున్నా మన పత్తి రైతులకు ఉపయోగపడే ‘యుగాంక్‌’ వంగడాలను గమనిస్తూనే ఉంటా.
– డా. కేశవ్‌ క్రాంతి,  సి.ఐ.సి.ఆర్‌.(నాగపూర్‌), పూర్వ సంచాలకులు, అంతర్జాతీయ పత్తి సలహా మండలి (ఐ.సి.ఎ.సి.) సాంకేతిక విభాగం అధిపతి, వాషింగ్టన్‌ krkranthi@gmail.com

రెండేళ్ల తర్వాతే రైతులకు..
తొమ్మిదేళ్లు కష్టపడి ‘యుగాంక్‌’ పత్తి వంగడాలను సంప్రదాయ పద్ధతుల్లోనే రూపొందించాం. మొక్క పొదలాగా కాకుండా తక్కువ స్థలంలో నిటారుగా పెరుగుతుంది. పొట్టిగా ఉంటుంది. మొక్కకు 20 వరకు పెద్ద కాయలు కాస్తాయి. మూడున్నర నుంచి 4 నెలల్లో పంట పూర్తవుతుంది. కాయలన్నీ దాదాపుగా ఒకేసారి పక్వానికి వస్తాయి. ఒకటి, రెండు సార్లు పత్తి తీస్తే చాలు. పెద్ద రైతులు యంత్రంతో పత్తి తీతకు అనుకూలంగా ఉంటుంది. ఈ విత్తనాలను ప్రతి ఏటా కొనాల్సిన అవసరం లేదు. ఒకసారి కొంటే, ఇతర రకాలతో కలిసిపోకుండా జాగ్రత్తపడితే, రైతులు కనీసం ఐదారేళ్లు తాము పండించిన పత్తిలో నుంచి తీసిన విత్తనాలను తిరిగి నిశ్చింతగా విత్తుకోవచ్చు. చేతితో ఉపయోగించే చిన్న యంత్రాలతో పత్తి నుంచి విత్తనాలు తీసుకోవచ్చు.

ఒక్కమాటలో చెప్పాలంటే  రైతుకు విత్తన స్వాతంత్య్రం లభిస్తుంది. ఖర్చు, సమయం ఆదా అవుతుంది. ప్రైవేటు బీటీ హైబ్రిడ్‌ పత్తి పంట కన్నా 5 రెట్లు ఎక్కువ వత్తుగా విత్తుకోవడానికి ఈ వంగడాలు అనుకూలమైనవి. కాబట్టి, పత్తి దిగుబడి అధికంగానే ఉంటుంది. యుగాంక్‌ వంగడాలను 60“30, 60“10 సెంటీమీటర్ల దూరంలో విత్తితే నాగపూర్‌లో దిగుబడి బాగుంది. వివిధ రాష్ట్రాల్లో దిగుబడి ఎలా వస్తుందో ప్రయోగాత్మకంగా సాగు చేయించబోతున్నాం. సాగు ఖర్చును, సమయాన్ని సగానికి సగం తగ్గించే ఈ విత్తనాలు రెండేళ్ల తర్వాతే రైతులకు అందుబాటులోకి వస్తాయి.
– డా. హెచ్‌.బి. సంతోష్,‘యుగాంక్‌’ పత్తి వంగడాల రూపశిల్పి,కేంద్రీయ పత్తి పరిశోధనా సంస్థ (సిఐసిఆర్‌), నాగపూర్, మహారాష్ట్ర

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement