కర్నూలు(అగ్రికల్చర్) : అకాల వర్షాలు రైతుల కష్టార్జితాన్ని నీటిపాలు చేశాయి. ఊహించని విధంగా పలు మండలాల్లో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురియడంతో వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి రేయింబవళ్లు శ్రమించి పండించిన పంటలు దెబ్బతినడంతో రైతుల ఆందోళన చెందుతున్నారు. కల్లందొడ్లలో మిరప ఆరబెట్టుకున్నారు. పంట నూర్పిళ్లు కూడా చురుగ్గా జరుగుతున్నాయి. పశుగ్రాసాలను వాములుగా వేస్తున్నారు. అయితే ఆదివారం రాత్రి కురిసిన వర్షం రైతులకు నష్టాలను మిగిల్చింది. పగిడ్యాలలో ఏకంగా 61 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు అయింది. కర్నూలులో 37, గూడూరులో 21.8, కల్లూరులో 15.8, వెల్దుర్తిలో 15.2, ఓర్వకల్లులో 13.6, శ్రీశైలంలో 12.8, గోనెగండ్లలో 15.6 మిల్లీమీటర్ల ప్రకారం వర్షాలు కురిసాయి.
ఈ వర్షాల వల్ల కల్లందొడ్లలో ఉన్న ఎండుమిర్చితో పాటు నూర్పిళ్లు చేస్తున్న వివిధ పంటలు తడిచిపోయాయి. ఎండుమిర్చి తడవడం వల్ల రంగు మారే ప్రమాదం ఏర్పడింది. ఇందువల్ల గిట్టుబాటు ధర లభించదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అకాల వర్షాల వల్ల జరిగిన పంట నష్టంపై వెంటనే వివరాలు పంపాలని జేడీఏ ఠాగూర్‌నాయక్ వ్యవసాయాధికారులను ఆదేశించారు.
అకాల వర్షంతో రాకపోకలకు అంతరాయం
నందికొట్కూరు: అకాల వర్షం వాహనాల రాకపోకలకు అంతరాయం కలగించింది. సోమవారం ఉదయం 6 గంటలకు వర్షం కురిసింది. దీంతో కర్నూలు-గుంటూరు ప్రధాన రహదారి వైపు వెళ్లే వాహనాలు కల్వర్టు నిర్మాణం పక్కన్న ఉన్న పొలం రస్తాలో ఇరుక్కపోయాయి. దీంతో దాదాపు రెండు గంటల పాటు రాకపోకలకు అంతరాయం కలిగింది. కొన్ని వాహనాలు ఉప్పల దడియా, మిడ్తూరు మీదుగా నందికొట్కూరు, ఆత్మకూరు, గుంటూరు వైపు వెళ్లాయి. విషయం తెలుసున్న ఎమ్మెల్యే, ఎంపీపీ, ఆర్ అండ్ బీ అధికారులు వాహనాలు ఇరుకున్న ప్రాంతాలను పరిశీలించారు. కల్వర్టు నిర్మాణ పనులు చేస్తున్న కాంట్రాక్టర్‌పై ఎమ్మెల్యే ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆర్ అండ్ బీ అధికారులు, కాంట్రాక్టర్ ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.
అకాల వర్షం... రైతుకు భారీ నష్టం
Published Tue, Mar 3 2015 3:33 AM | Last Updated on Mon, Oct 1 2018 2:00 PM
Advertisement