జిల్లాలో నష్టం రూ.323.4 కోట్లు
Published Sun, Nov 24 2013 3:06 AM | Last Updated on Sat, Sep 2 2017 12:54 AM
విజయనగరం కలెక్టరేట్, న్యూస్‌లైన్:గత నెలలో వారం రోజుల పాటు ఏకధాటిగా కురిసి బీభత్సం సృష్టించిన వర్షాలు... అదే స్థాయిలో నష్టాల ను కూడా మిగిల్చాయి. వర్షాలకు అప్పట్లో జిల్లా వ్యాప్తంగా రూ.113.60 కోట్ల నష్టం వాటిల్లినట్టు అధికారులు అంచనా వేశారు. అయితే ప్రస్తుతం పూర్తిస్థాయిలో అంచనాలు రూపొందించగా అది మూడు రెట్లు పెరిగి రూ.323.4 కోట్లకు చేరింది. జిల్లాలో ఇటీవల పర్యటించిన కేంద్రబృందానికి శాఖల వారీగా నష్టం వివరాలను అంద జేశారు. జిల్లాలో అన్నిశాఖలకు సంబంధించి రూ.323.4 కోట్ల మేర నష్టం ఏర్పడిందని, ఈ మొత్తాన్ని మంజూరు చేయాలని ప్రభుత్వానికి, ఆయా శాఖల ఉన్నతాధికారులకు నివేదించారు. 34 మండలాల్లో నష్టం ఏర్పడగా, వాటిలో 102గ్రామాల్లో నష్టం చాలా ఎక్కువగా ఉంది.
పంటనష్టం వివరాలు...
వర్ష బీభత్సం వల్ల 16,936 హెక్టార్లల్లో వరి దెబ్బతిన్నట్టు వ్యవసాయ శాఖ అధికారులు పేర్కొన్నారు. నష్టపరిహారం చెల్లించేందుకు రూ.16.17 కోట్లు అవసరమని నివేదించారు. 1,197.37 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం జరిగిందని, దీనికి గానూ రూ.1.27 కోట్లు అవసరమని పేర్కొన్నారు.
2,655 ఇళ్లకు నష్టం....
అధిక వర్షాలకు 2,655 ఇళ్లు దెబ్బతిన్నాయి. వీటిలో పక్కా ఇళ్లు 18 పూర్తిగా, 31 ఇళ్లు తీవ్రంగా దెబ్బతిన్నాయి. అలాగే పూరిళ్లు 67 పూర్తిగా, 259 తీవ్రంగా దెబ్బతిన్నాయి. పాక్షికంగా 2,068 ఇళ్లు దెబ్బతిన్నట్టు నివేదించారు. అలాగే గుడిసెలు 175 దెబ్బతిన్నాయి. ఇవి కాక మరో 37 ఇళ్లు పాడైనట్టు గుర్తించారు. వీటికి పరిహారం చెల్లించేందుకు రూ.76 లక్షలు అవసరమని పేర్కొన్నారు.నలుగురు మృతి చెంద గా వారిలో ముగ్గురికి పరిహారం అందజేయాలని పేర్కొన్నా రు. 600 పశువులు మృత్యువాత పడ్డాయని వీటి యజమానులకు పరిహారం చెల్లించేందుకు రూ.90 లక్షలు అవసరమని నివేదించారు. 11 పునరావాస కేంద్రాలు నిర్వహించి 896 మందికి పునరావసం కల్పించినట్టు పేర్కొన్నారు.
రోడ్లకు భారీ నష్టం
భారీ వర్షాలు ఆర్‌అండ్‌బీ శాఖకు పెద్ద నష్టమే మిగిల్చాయి. 169.10 కిలోమీటర్ల మేర రోడ్లు పాడయ్యాయి. 10 కల్వర్టు లు, 89 సీడీ వర్కులు దెబ్బతిన్నాయి. వీటికి పూర్తిస్థాయిలో మరమ్మతులు చేయడానికి రూ.113.72 కోట్లు అవసరమని నివేదించారు. అలాగే ఐటీడీఏకు చెందిన 87 రోడ్లు పాడవ గా వీటి మరమ్మతుల కోసం రూ.8.91కోట్లు అవసరమని నివేదించారు. పంచాయతీరాజ్‌కు చెందిన 204కిలోమీటర్ల మేర రోడ్లు దెబ్బతిన్నట్లు అధికారులు గుర్తించారు.అలాగే 73సీడీ వర్కులు, 75 భవనాలు దెబ్బతిన్నాయి. ఈ పనులు చేపట్టడానికిగానూ రూ.92.40 కోట్లు అవసరమని ప్రతిపాదించారు.
మున్సిపాల్టీల్లో
మున్సిపాల్టీల్లో 20.28 కిలోమీటర్ల మేర రోడ్లు, 10 కిలో మీటర్ల మేర డ్రైన్లు, మూడు మంచినీటి పథకాలు, 1,060 వీధిలైట్లు, తొమ్మిది మున్సిపల్ పాఠశాలలు, కమ్యూనిటీ హాళ్లు దెబ్బతిన్నట్లు గుర్తించారు. వీటి మరమ్మతుకు రూ.10.47 కోట్లు అవసరమని నివేదించారు. మైనర్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు సంబంధించి చెరువులు, మదుములు వంటివి 994 దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు చేయడానకి రూ 60.30 కోట్లు అవసరమని పేర్కొన్నారు.
గ్రామీణ నీటిసరఫరా విభాగం...
గ్రామీణ నీటిసరఫరా విభాగానికి సంబంధించి 181 పథకాలు దెబ్బతిన్నాయి. వీటికి మరమ్మతులు చేయడానికి రూ. 10.71 కోట్లు అవసరమని ప్రతిపాదనలు పంపారు. 81 వలలు, 40 చేపల చెరువులు, 30 టన్నుల చేపలు పాడైపోయాయి. వీటి నష్టం రూ.14.2 లక్షలుగా గుర్తించారు. అలాగే చేప పిల్లల కేంద్రంలో వేసిన పిల్లలు చనిపోవడం , కార్యాలయ భవనం శిథిలం కావడంతో రూ.58.8లక్షల నష్టం ఏర్పడిందని పేర్కొన్నారు. భారీ వర్షాల సమయంలో మందులు సరఫరా చేయడానికి రూ.97 వేలు ఖర్చు చేసి నట్లు పేర్కొన్నారు. విద్యుత్ శాఖకు సంబంధించి 165 ట్రాన్స్‌ఫార్మర్లు, 172 విద్యుత్ స్తంభాలు దెబ్బతిన్నాయి వీటి మరమ్మతులకు రూ.87.39లక్షలు అవసరమని నివేదించారు.
Advertisement
Advertisement