రొయ్యలకు వైరస్ సోకడంతో పట్టుబడి పడుతున్న దృశ్యం
పశ్చిమగోదావరి, భీవువరం: డాలర్లు కురిపించిన రొయ్యల సాగు ప్రస్తుతం నష్టాల్లో సాగుతోంది. వైరస్ తాకిడితో రైతులు వరుసగా నష్టాలను చవిచూస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది రైతులకు మంచి దిగుబడి వచ్చినా ధరల్లో నిలకడ లేకపోవడంతో సాగు నిరాశాజనకంగా ఉంది. చేపల సాగు ఆశాజనకంగా ఉండడంతో కొంతమంది రైతులు రొయ్యల చెరువుల్ని చేపల చెరువులుగా మారుస్తున్నారు. అయితే కొందరికి ఆక్వా సాగుపై మోజు తగ్గకపోవడంతో రైతులు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తూ లక్షల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. గతంలో భీమవరం కేంద్రంగా సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం ఎగుమతులు గణనీయంగా పడిపోయాయని చెబుతున్నారు.
మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేయాలి
వరి, పొగాకు తదితర పంటలకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ద్వారా వరి రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాల పంపిణీ, రుణాల మంజూరు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. అయితే కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆర్జించిపెట్టే ఆక్వా రంగానికి ఎక్కడా ప్రోత్సాహం లేదు. ప్రభుత్వానికి సెస్సుల రూపంలో ఏటా ఆక్వా రైతులు కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. అయినా వీరికి ఎలాంటి సౌకర్యాలు అందడం లేదు. కోల్డ్ స్టోరేజీలు లేవు. వరిలో రైతులకు నాణ్యమైన విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ కమిటీలు, వ్యవసాయశాఖ ద్వారా పంపిణీ చేస్తోంది. ఆక్వాలో సీడ్ వ్యాపారమంతా దళారుల గుప్పెట్లోనే జరుగుతోంది. రాష్ట్రం మెుత్తంమీద ఒకట్రెండు సీడ్ కేంద్రాలు ఉన్నా అవి రైతులకు ఉపయోగపడటంలేదు. సుమారు వంద వరకూ సీడ్ కేంద్రాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నట్లు అంచనా. వీటి ద్వారా ఉత్పత్తి అవుతున్న పిల్లల్లో నాణ్యత ఉండటంలేదు.
వైరస్ తదితర కారణాల వల్ల నెలరోజుల్లోపే పిల్లలు చెరువుల్లో తేలిపోతున్నాయి. రైతుల్ని నిండా ముంచుతున్న ప్రైవేటు హేచరీలపై ఎలాంటి నిఘా లేదు. అదృష్టాన్ని నమ్ముకుని రైతులు సీడ్ కొంటున్నారు. ప్రభుత్వమే నాణ్యమైన రొయ్య సీడ్ సరఫరా చేస్తే రైతుల కష్టాలు కొంతవరకు గట్టెక్కుతాయి. అంత కష్టపడి రొయ్యలు సాగుచేస్తే రైతులకు సరైన గిట్టుబాటు ధర అందడంలేదు. ధాన్యం, జొన్న, గోధుమలు వంటి ఆహారపంటలకు ప్రభుత్వమే ధర నిర్ణయించి రైతులకు అందేలా చూస్తుంది. ఆక్వా విషయంలో ధర నిర్ణయం దళారుల చేతుల్లో ఉంది. ధరలేనప్పుడు పట్టుబడికి వచ్చిన రొయ్యల్ని దాచుకునే సౌకర్యం జిల్లాలో లేదు. కనీసం ఒక్క కోల్డ్ స్టోరేజీ కూడా నిర్మించలేదు. ఇక ఆక్వా మందుల పేరుతో మార్కెట్‌లోకి విచ్చలవిడిగా వచ్చిపడుతున్న ఉత్పత్తులపై అధికారుల నియంత్రణ కొరవడింది. కంపెనీలు తెలివిగా ఫీడ్ సప్లిమెంట్స్ రూపంలో మందులను కూడా విడుదల చేస్తున్నాయి. దీనివల్ల రైతులకు నష్టం జరిగినా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉండటం లేదు. డ్రగ్ ఇన్స్‌పెక్టర్లు దాడి చేసేందుకు చట్టంలో సరైన సెక్షన్ లేదు. ఆకర్షణీయ ప్రకటనలతో నాణ్యత లేని మేతను కొన్ని కంపెనీలు సరఫరా చేస్తున్నాయి.
ఉపయోగంలేని ఎంపెడా
ఆక్వా రైతులకు ఎంపెడా వల్ల ఒరిగిందేమీ లేదు. వైరస్ పరీక్ష కేంద్రాల్లో నీటి సాంద్రత నిర్ధారించే పరికరాలు అందుబాటులో ఉండడం లేదు. ఎంపెడా వద్ద ఉన్నా అవి రైతులందరికీ పూర్తిస్థాయిలో ఉపయోగపడటంలేదు. చాలామంది రైతులు ప్రైవేటు కేంద్రాలపై ఆధారపడుతున్నారు. ఈ కేంద్రాల్లో కొన్ని బోగస్ రిపోర్టులు ఇస్తూ సీడ్, ఫీడ్ కంపెనీలకు అనుకూలంగా పనిచేస్తున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఆక్వా చెరువుల్లోంచి వదిలివేసిన మురుగునీరు ప్రత్యేకంగా బయటకు వెళ్లే మార్గాలు లేవు. ఫలితంగా వైరస్ అదుపులోకి రావడంలేదు. ఈసారైనా పంట దక్కకపోతుందా? అని ఆశచావని రైతు అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సాగు చేస్తున్నాడు. ఆక్వా రైతులకు కూడా ప్రత్యేకంగా మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది.
Comments
Please login to add a commentAdd a comment