Shrimp ponds
-
రొయ్య రైతుకు జగన్ సర్కారు భరోసా
సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులను ఆదుకొనేందుకు జగన్ సర్కార్ సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న యూనిట్ విద్యుత్ చార్జీని రూ.1.50కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం జీఓఆర్టీ నంబర్ 70 విడుదల చేసింది. దీనివల్ల రొయ్యల చెరువులు సాగు చేస్తున్న రైతుల విద్యుత్ చార్జీలు మరింత తగ్గనున్నాయి. జిల్లా పరిధిలో వేటపాలెం, కొత్తపట్నం, ఒంగోలు రూరల్, సింగరాయకొండ, టంగుటూరు, చినగంజాం, చీరాల, ఉలవపాడు, గుడ్లూరు, నాగులుప్పలపాడు, జరుగుమల్లి మండలాల్లో 28 వేల ఎకరాల్లో రైతులు రొయ్యల సాగు చేస్తున్నారు. వీటి పరిధిలో 2,530 కేటగిరి–3 విద్యుత్ సర్వీసులున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం రొయ్యల చెరువుల విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ.3.86 చొప్పన నాలుగేళ్లపాటు వసూలు చేసింది. ఎన్నికలకు ముందుకు వైఎస్.జగన్ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన తర్వాత యూనిట్ చార్జి రూ.2కు తగ్గించింది. దీనివల్ల ఒక పంట కాలానికి రూ.60 వేలు విద్యుత్ చార్జి కట్టాల్సి వస్తోంది. జగన్ సర్కార్ యూనిట్‌కు మరో 50 పైసలు తగ్గించడం వల్ల ఒక్కో ఎకరాకు నాలుగు నెలల పంట కాలానికి విద్యుత్ చార్జి రూ.45 వేలకు తగ్గుతోంది. దీనివల్ల ఒక పంట కాలానికి రూ.15 వేలు తగ్గనున్నాయి. ఈ లెక్కన జిల్లాలో 28 వేల ఎకరాలలో ఉన్న రొయ్యల చెరువుల సాగుకు ఒక పంటకు రూ.42 కోట్ల విద్యుత్ చార్జీలు తగ్గనున్నాయి. ఈ లెక్కన రొయ్య రైతులకు ఒక పంటకు రూ.42 కోట్లు మిగిలినట్లే లెక్క. దీంతో రొయ్య రైతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది. జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం : 28,000 ఎకరాలు వీటి పరిధిలో కేటగిరి–3 విద్యుత్ సర్వీసులు సంఖ్య: 2,530 చార్జీల తగ్గింపుతో ఒక పంట కాలానికి తగ్గనున్న భారం : రూ.42 కోట్లు మాట నిలబెట్టుకున్న జగన్.. అసలే రొయ్యకు గిట్టుబాటు ధర లేక రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితిలో వైఎస్ జగన్ సర్కార్ విద్యుత్ చార్జి భారం తగ్గించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఆక్వా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏడాది క్రితం వరకూ రొయ్యల చెరువుల విద్యుత్ చార్జీలు యూనిట్‌కు రూ.3.86 గా ఉంది. విద్యుత్ చార్జీ భారం తగ్గించాలని రైతాంగం నెత్తీ నోరు బాదుకున్నా నాలుగేళ్లపాటు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో భారం భరించలేక చాలామంది రైతులు రొయ్యల సాగుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. దీంతో జిల్లాలో రొయ్యల సాగు మరింతగా తగ్గింది. రైతులు పలుమార్లు చార్జీలు తగ్గించాలని కోరారు. అప్పట్లో చంద్రబాబు పట్టించుకోక పోవడంతో అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విద్యుత్ చార్జీలు తగ్గించాలని రైతులు కోరారు. వారి సమస్యలను పరిశీలించిన వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే యూనిట్ విద్యుత్ చార్జీలను రూ.1.50కి తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు చార్జీలు తగ్గిస్తూ జీఓ జారీ చేసి హామీని నెరవేర్చారు. సీఎం జగన్ మాట నిలబెట్టుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది. -
అక్రమ చెరువుల దందా
సాక్షి, భీమవరం(పశ్చిమ గోదావరి) : జిల్లాలో తాగునీటి కాలుష్యానికి మూలకారణమైన రొయ్యల చెరువుల తవ్వకం యథేచ్ఛగా సాగిపోతూనే ఉంది. అనుమతులు లేనిదే చెరువులు తవ్వితే కఠినచర్యలు తీసుకుంటామని రెవెన్యూ, మత్స్యశాఖాధికారులు హెచ్చరిస్తున్నా చెరువుల తవ్వకం ఆగకపోవడం వెనుక కొంతమంది అధికారుల మామూళ్ల వసూళ్లు, రాజకీయ నాయకుల ఒత్తిడే కారణంగా చెబుతున్నారు. జిల్లాలో గత ఏడాది కాలంగా చెరువుల తవ్వకానికి అనుమతులివ్వడం లేదు. ఇటీవల కాళ్ల మండలంలో చెరువుల తవ్వకం ప్రారంభం కాగా అక్కడి ఎమ్మెల్యే మంతెన రామరాజు అధికారులపై కన్నెర్ర చేశారు. జిల్లాలో రొయ్యల సాగుకు అనుమతులు తక్కువే జిల్లాలో తీరప్రాంతంలో తప్ప మరెక్కడా రొయ్యల సాగుకు అనుమతులు లేవు. వరిసాగుతో రైతులకు తీవ్ర నష్టాలు, కష్టాలు తప్పకపోవడంతో నెమ్మదిగా రొయ్యల సాగు చేపట్టారు. ముందుగా నరసాపురం, మొగల్తూరు, భీమవరం, కాళ్ల, ఆకివీడు వంటి మండలాల్లో ప్రారంభమైన రొయ్యల సాగు క్రమేణా జిల్లా అంతటా చేపలు, రొయ్యల సాగు విస్తరించింది. సుమారు లక్షా 50 వేల ఎకరాల్లో ఆక్వా సాగుచేస్తుండగా దాదాపు 50 వేల ఎకరాలకు పైగా రొయ్యల సాగు చేస్తున్నట్లు అనధికారిక అంచనా. రొయ్యలు, చేపల చెరువుల్లోని కలుషిత నీరు డ్రయిన్లలోకి వెళ్లే అవకాశం లేకున్నా.. యథేచ్ఛగా చెరువులు తవ్వి ఆక్వా సాగు చేపట్టి నీటిని పంట కాలువల్లోకి వదలడం వల్ల తాగునీరు కలుషితమవుతోంది. అంతేగాకుండా రొయ్యల సాగుకు బోర్ల సాయంతో ఉప్పునీటిని ఉపయోగించడం వల్ల భూగర్భజలాలు ఉప్పగా మారి డెల్టా ప్రాంతంలో తాగునీటి కష్టాలు ఏర్పడుతున్నాయి. గతంలో అనేక గ్రామాల్లో తాగునీటి అవసరాలకు బోరు నీటిని ఉపయోగించుకోగా నేడు అలాంటి అవకాశం లేకుండా పోయింది. రొయ్యల సాగుకు తోడు వాటిని స్టోరేజ్ చేయడానికి ఎక్కడికక్కడ స్టోరేజీలు ఏర్పాటుచేయడం, రొయ్యలను కెమికల్స్‌తో శుభ్రం చేసిన నీటిని కాలువల్లోని వదలడం వల్ల నీటి కాలుష్యంతోపాటు వాతావరణ కాలుష్యం కూడా ఏర్పడుతోంది. చేపల సాగంటూ చెరువులు తవ్వి రొయ్యలు సాగు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ముడుపుల మత్తులో అధికారులు చర్యల తీసుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తున్నాయి. రొయ్యల సాగు వల్ల డెల్టా ప్రాంతం ఉప్పునీటి కయ్యగా మారిపోయే ప్రమాదం ఉందని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రొయ్యల సాగు కారణంగా పక్కనున్న సారవంతమైన భూములు కూడా వరిసాగుకు పనిచేయడం లేదంటూ అనేకమంది రైతులు జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో చెరువుల తవ్వకానికి అనుమతులు నిలిపివేశారు. అయితే కాళ్ల మండలంలో చెరువుల తవ్వకాల విషయం బయటపడింది. గతంలో చేపల చెరువుల పేరుతో రొయ్యలు సాగుచేస్తున్న రైతులపై కూడా చర్యలు తీసుకోవాలని, అనుమతులు లేని ప్రాంతంలో రొయ్యల సాగును నిలుపుదల చేయాలని వరి పండించే రైతులు కోరుతున్నారు. -
రొయ్యల చెరువులపై చర్యలు చేపట్టాలి
సాక్షి, పోడూరు: పెనుమంట్ర మండలం పొలమూరు గ్రామ శివారు చెన్నాడచెరువు ఎస్సీకాలనీ సమీపంలో రొయ్యల చెరువుల నుంచి వదిలిన మురుగునీటితో కాలనీ ప్రాంతం ముంపునకు గురవుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చెన్నాడచెరువు ఎస్సీ కాలనీలో సుమారు 100 కుటుంబాలు నివసిస్తున్నాయి. ఆ సమీపంలో అనుమతులు లేకుండా రొయ్యల చెరువులు తవ్వి సాగు చేస్తున్నారు. ఆ చెరువుల నుంచి వదిలే మురుగు నీటితో తమ ప్రాంతం నీట మునిగి నరకయాతన పడుతున్నామని ఆ ప్రాంత ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రసాయనాలతో కూడిన మురుగునీటి వల్ల తీవ్ర అనారోగ్యం పాలవుతున్నామని, ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నామని వాపోతున్నారు. ఈ దుస్థితిపై తాము అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా స్థాయిలో అధికారులు స్పందించి రొయ్యల చెరువులపై చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ ప్రాంతంలో పూర్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు కొన్ని ఖాళీగా ఉన్నాయనీ, వాటిని అర్హులైన పేదలకు పంపిణీ చేయాలని సూచిస్తున్నారు. -
బాబోయ్.. రొయ్య
పశ్చిమగోదావరి, భీవువరం: డాలర్లు కురిపించిన రొయ్యల సాగు ప్రస్తుతం నష్టాల్లో సాగుతోంది. వైరస్ తాకిడితో రైతులు వరుసగా నష్టాలను చవిచూస్తున్నారు. అక్కడక్కడ కొంతమంది రైతులకు మంచి దిగుబడి వచ్చినా ధరల్లో నిలకడ లేకపోవడంతో సాగు నిరాశాజనకంగా ఉంది. చేపల సాగు ఆశాజనకంగా ఉండడంతో కొంతమంది రైతులు రొయ్యల చెరువుల్ని చేపల చెరువులుగా మారుస్తున్నారు. అయితే కొందరికి ఆక్వా సాగుపై మోజు తగ్గకపోవడంతో రైతులు అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు ప్రయత్నిస్తూ లక్షల రూపాయల పెట్టుబడి పెడుతున్నారు. గతంలో భీమవరం కేంద్రంగా సుమారు వెయ్యి కోట్ల రూపాయలకు పైగా ఎగుమతులు జరిగేవి. ప్రస్తుతం ఎగుమతులు గణనీయంగా పడిపోయాయని చెబుతున్నారు. మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేయాలి వరి, పొగాకు తదితర పంటలకోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేసింది. ఈ కమిటీ ద్వారా వరి రైతులకు సబ్సిడీపై యంత్ర పరికరాల పంపిణీ, రుణాల మంజూరు వంటి అనేక కార్యక్రమాలు అమలు చేస్తోంది. అయితే కోట్ల రూపాయల విదేశీ మారకద్రవ్యం ఆర్జించిపెట్టే ఆక్వా రంగానికి ఎక్కడా ప్రోత్సాహం లేదు. ప్రభుత్వానికి సెస్సుల రూపంలో ఏటా ఆక్వా రైతులు కోట్ల రూపాయలు చెల్లిస్తున్నారు. అయినా వీరికి ఎలాంటి సౌకర్యాలు అందడం లేదు. కోల్డ్ స్టోరేజీలు లేవు. వరిలో రైతులకు నాణ్యమైన విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వమే మార్కెట్ కమిటీలు, వ్యవసాయశాఖ ద్వారా పంపిణీ చేస్తోంది. ఆక్వాలో సీడ్ వ్యాపారమంతా దళారుల గుప్పెట్లోనే జరుగుతోంది. రాష్ట్రం మెుత్తంమీద ఒకట్రెండు సీడ్ కేంద్రాలు ఉన్నా అవి రైతులకు ఉపయోగపడటంలేదు. సుమారు వంద వరకూ సీడ్ కేంద్రాలు ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో ఉన్నట్లు అంచనా. వీటి ద్వారా ఉత్పత్తి అవుతున్న పిల్లల్లో నాణ్యత ఉండటంలేదు. వైరస్ తదితర కారణాల వల్ల నెలరోజుల్లోపే పిల్లలు చెరువుల్లో తేలిపోతున్నాయి. రైతుల్ని నిండా ముంచుతున్న ప్రైవేటు హేచరీలపై ఎలాంటి నిఘా లేదు. అదృష్టాన్ని నమ్ముకుని రైతులు సీడ్ కొంటున్నారు. ప్రభుత్వమే నాణ్యమైన రొయ్య సీడ్ సరఫరా చేస్తే రైతుల కష్టాలు కొంతవరకు గట్టెక్కుతాయి. అంత కష్టపడి రొయ్యలు సాగుచేస్తే రైతులకు సరైన గిట్టుబాటు ధర అందడంలేదు. ధాన్యం, జొన్న, గోధుమలు వంటి ఆహారపంటలకు ప్రభుత్వమే ధర నిర్ణయించి రైతులకు అందేలా చూస్తుంది. ఆక్వా విషయంలో ధర నిర్ణయం దళారుల చేతుల్లో ఉంది. ధరలేనప్పుడు పట్టుబడికి వచ్చిన రొయ్యల్ని దాచుకునే సౌకర్యం జిల్లాలో లేదు. కనీసం ఒక్క కోల్డ్ స్టోరేజీ కూడా నిర్మించలేదు. ఇక ఆక్వా మందుల పేరుతో మార్కెట్లోకి విచ్చలవిడిగా వచ్చిపడుతున్న ఉత్పత్తులపై అధికారుల నియంత్రణ కొరవడింది. కంపెనీలు తెలివిగా ఫీడ్ సప్లిమెంట్స్ రూపంలో మందులను కూడా విడుదల చేస్తున్నాయి. దీనివల్ల రైతులకు నష్టం జరిగినా ప్రభుత్వానికి ఫిర్యాదు చేసుకునే అవకాశం ఉండటం లేదు. డ్రగ్ ఇన్స్పెక్టర్లు దాడి చేసేందుకు చట్టంలో సరైన సెక్షన్ లేదు. ఆకర్షణీయ ప్రకటనలతో నాణ్యత లేని మేతను కొన్ని కంపెనీలు సరఫరా చేస్తున్నాయి. ఉపయోగంలేని ఎంపెడా ఆక్వా రైతులకు ఎంపెడా వల్ల ఒరిగిందేమీ లేదు. వైరస్ పరీక్ష కేంద్రాల్లో నీటి సాంద్రత నిర్ధారించే పరికరాలు అందుబాటులో ఉండడం లేదు. ఎంపెడా వద్ద ఉన్నా అవి రైతులందరికీ పూర్తిస్థాయిలో ఉపయోగపడటంలేదు. చాలామంది రైతులు ప్రైవేటు కేంద్రాలపై ఆధారపడుతున్నారు. ఈ కేంద్రాల్లో కొన్ని బోగస్ రిపోర్టులు ఇస్తూ సీడ్, ఫీడ్ కంపెనీలకు అనుకూలంగా పనిచేస్తున్నాయన్న ఆరోపణలు వినవస్తున్నాయి. ఆక్వా చెరువుల్లోంచి వదిలివేసిన మురుగునీరు ప్రత్యేకంగా బయటకు వెళ్లే మార్గాలు లేవు. ఫలితంగా వైరస్ అదుపులోకి రావడంలేదు. ఈసారైనా పంట దక్కకపోతుందా? అని ఆశచావని రైతు అధిక వడ్డీలకు అప్పు తెచ్చి సాగు చేస్తున్నాడు. ఆక్వా రైతులకు కూడా ప్రత్యేకంగా మార్కెట్ కమిటీలు ఏర్పాటు చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. -
దగాపడ్డ గిరిపుత్రులు
కూటికోసం... కూలికోసం... వలస వెళ్లిన గిరిపుత్రులకు ఎంత కష్టం... ఎంత నష్టం. ఐదు నెలలు ఎండనకా... వాననకా... కష్టపడిన ఆ యువతకు రిక్తహస్తమే మిగిలింది. పని ఇప్పిస్తానని చెప్పి తీసుకెళ్లి వారి శ్రమ దోపిడీ చేసిన ఏజెంట్ తీరుపై వారంతా మండిపడుతున్నారు. తమకు న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. గుమ్మలక్ష్మీపురం(కురుపాం): పొట్టకూటికోసం వలస పనుల కెళ్లిన తమచే పనిచేయించుకున్న ఏజెంట్ తమకు రావాల్సిన కూలి సొమ్మును ఎగ్గొట్టాడంటూ గుమ్మలక్ష్మీపురం మండలం జర్న పంచాయతీ చినవంకధార, బబ్బిడి, అచ్చబ, వాడపుట్టి గ్రామాలకు చెందిన 22 మంది గిరిజన యువతీ యువకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులు కె.సోమేష్, సోములు, సిద్ధు, జగన్, శ్రీహరి, గణేష్, భాస్కరరావు, క్రిష్ణ, కె.రోజా, కె.శాంతి, సన్యాసి, ఎన్.మధు తదితరులు శనివారం ఏపీ గిరిజన సంఘం జిల్లా కార్యదర్శి కోలక అవినాష్, మండల కార్యదర్శి మండంగి శ్రీనివాస్‌లతో కలిసి ఎల్విన్‌పేటలో విలేకర్లతో మాట్లాడారు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన సతీష్ అనే ఓ వ్యక్తి(ఏజెంట్) రోజుకు రూ.270లు చొప్పున కూలి వచ్చేలా పని ఇప్పిస్తానని తమను ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వెలగపూడి గ్రామంలో ఉన్న సంధ్య కంపెనీ సైట్స్(హేచరీస్)కు గత ఏడాది సెప్టెంబర్ 6న తీసుకెళ్లాడని చెప్పారు. అప్పటి నుంచి తమచే పగలు, రాత్రిళ్లు కూడా రొయ్యల కంపెనీలో పనులు చేయించుకున్నారని చెప్పారు. అయితే వచ్చి చాలా రోజులైనందున స్వగ్రామాలకు వెళ్లి తల్లిదండ్రులు, కుటుంబీకులను చూసి వస్తామనీ కూలి సొమ్ములు ఇవ్వాలని ఏజెంట్ సతీష్‌ను అడగ్గా... ఒక్కొక్కరికి కేవలం రూ.8వేలు వంతున మాత్రమే అందజేసారని తెలిపారు. తమకు ఒక్కొక్కరికి రూ.40లు పైబడి ఇవ్వాల్సి ఉండగా రూ.8వేలే ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించగా, మళ్లీ వస్తేనే మిగతా డబ్బు చెల్లిస్తానని చెప్పాడని వారంతా వాపోయారు. చేసేది లేక వారం రోజుల క్రితం ఏజెంట్, కంపెనీ ప్రతినిధులకు చెప్పకుండా స్వగ్రామాలకు వచ్చామని, తమతో పాటు పనులకు వచ్చిన కె.త్రినాథ్, శ్యాం, కిరణ్, సంజయ్ అనే మరో నలుగురు అక్కడే ఉండిపోయారని చెప్పారు. తమతో సుమారు ఐదు నెలల పాటు పనిచేయించుకొని కూలి సొమ్ము ఇవ్వకుండా ఏజెంట్ అన్యాయం చేసాడని, దీనిపై గిరిజన సంఘం నాయకులకు తెలపగా వారితో పాటు ఎల్విన్‌పేట పోలీస్ స్టేషన్‌కు వచ్చామన్నారు. ఈ మేరకు వారంతా ఎల్విన్‌పేట ఎస్సై కె.కిరణ్ కుమార్ నాయుడును కలసి సమస్యను వివరించి న్యాయం చేయాలని కోరారు. స్పందించిన ఎస్సై రొయ్యల చెరువు యజమానులతో పాటు ఏజెంట్ సతీష్‌తో ఫోన్లో మాట్లాడి బాధితులకు మిగతా సొమ్ము తక్షణమే చెల్లించాలని, లేకుంటే తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
ఆక్వా మంటలు
పిఠాపురం: పచ్చని పంట పొలాలు తెల్లారేసరికి రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి. ఏ అనుమతులతో పని లేకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు చెరువులు తవ్వుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. పంట పొలాల మధ్య చెరువులు తవ్వడం వల్ల చవుడుబారి పనికిరాకుండా పోతున్నాయని వాపోతూ ఆందోళనకు దిగినా పట్టించుకునే వారే లేరని రైతులు మండిపడుతున్నారు. కొత్తపల్లి మండలం రమణక్కపేట, నాగులాపల్లి గ్రామాల మధ్యలో గత నెల రోజులుగా పొక్లైన్లతో చెరువుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సంబంధితాధికారులకు భారీగా ముడుపులు ముడుతుండడంతో అటువైపు కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. వ్యవసాయం కనుమరుగు కానుందా..? కాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలి (కేఎస్ఈజెడ్) కోసం కొత్తపల్లి, తొండంగి మండలాల్లో సుమారు 10 వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లి మండలం తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో వరి పంట పొలాలు సుమారు 2 వేల ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిపై ఆధారపడి 4 వేల మంది రైతులు, 10 వేల మంది వ్యవసాయ కూలీలు, పరోక్షంగా మరో 10 వేల మంది వ్యాపారులు, ఇతర వర్గాలు జీవిస్తున్నారు. ఉన్న కొద్ది పంట పొలాలను సాగుచేసుకుని జీవిస్తున్న వీరిపై రొయ్యల చెరువుల తవ్వకాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయంటున్నారు. ప్రస్తుతం వందల ఎకరాల పంట పొలాల మధ్యచెరువులు తవ్వడం వల్ల కలుషిత జలాలు విడుదలై చుట్టుపక్కల పొలాలు పనికిరాకుండాపోతాయని రైతులు వాపోతున్నారు. అత్యంత వ్యవసాయాధారమైన ఇక్కడి పంట కాలువ పెదేరులో ఈ కలుషిత జలాలు కలవడంతో అన్ని పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికార పార్టీ నేతల అరాచకం.. రైతుల అభివృద్ధే తమ ధ్యేయమంటూ ప్రకటనలు గుప్పించే అధికార పార్టీ నేతలు ప్రత్యక్షంగా వ్యవసాయాన్ని నాశనం చేస్తూ వాటిపై ఆధారపడి జీవిస్తున్న తమ పొట్టకొడుతున్నారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి పంట పొలాలపై కన్నేసిన కాకినాడ రూరల్ ప్రాంతానికి చెందిన ఓ అధికార పార్టీ నేత ఆ పొలాలను లీజు పేరుతో తన సొంతం చేసుకుని ఆ పార్టీ నేతల అండదండలతో ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా రొయ్యల చెరువులు తవ్వకాలు చేపట్టినట్టు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు. చెరువులు తవ్వాలంటే... వ్యవసాయ భూముల్లో ఎటువంటి రొయ్యల చెరువులు తవ్వకూడదనే ఖచ్చితమైన నిబంధన ఉంది. చెరువులు ఒకవేళ తవ్వాల్సి వస్తే రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పొల్యూషన్, భూగర్భ, మత్స్యశాఖ వంటి 22 శాఖల అనుమతులు తీసుకోవాలి. అయితే ఇక్కడ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా చెరువుల తవ్వకాలు చేపడుతున్నా సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. ‘తమ పొలాల మధ్య అక్రమ చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయని, వాటి వల్ల తమ పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులకు స్థానిక రైతులు ఫిర్యాదు చేసినా అరణ్య రోదనవుతుందేతప్ప సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఇప్పటికే సుమారు 150 ఎకరాల్లో తవ్వకాల కోసం పచ్చని చెట్లను కూల్చేశారని, పొలాల గట్లను తీసేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే జోక్యంచేసుకొని అక్రమ చెరువుల తవ్వకాలను నిలిపివేసి ... తమ పొలాలకు రక్షణ కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిసింది. మాకేం సంబంధం... ఈ విషయంపై కొత్తపల్లి తహసీల్దారు రత్నకుమారిని వివరణ కోరగా ఏదైనా కట్టడం కడితే తప్ప వ్యవసాయ భూముల్లో ఏమి చేసుకున్నా మాకు సంబంధం లేదు. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు. -
ఏరొయ్యలో ఏ"మందో"..!
భీమవరం టౌన్ : లొట్టలేసుకుని తినే రొయ్యల్లో ఏ ‘మందో’ తెలియదు. రొయ్యల్లో యాంటీ బయోటిక్స్ మనకు తెలియకుండా శరీరంలోకి ప్రవేశిస్తున్నా గుర్తించే వ్యవస్థ లేదు. జిల్లాలో ఆక్వా సాగులో యాంటీ బయోటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తూ వేలాది టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నా పట్టించుకునే వారు లేరు. ప్రజారోగ్యంతో చెలగాటమాడే మందులను తయారు చేసే సంస్థలపై చర్యలు లేవు. నిషేధిత యాంటీయోటిక్స్ గురించి అవగాహన లేని రైతులు దుకాణాల నుంచి వాటిని ద్రావణం, పొడి రూపంలో తెచ్చి చెరువుల్లో వినియోగిస్తున్నారు. ఇలా ఉత్పత్తి అయిన రొయ్యలు విదేశాలకు ఎగుమతి కాగా అక్కడ అవశేషాలను గుర్తించి తిరిగి పంపుతున్నారు. ఇలా ‘పశ్చిమ’ రొయ్యలను విదేశాలు తిరిగి వెనక్కి పంపడం కొత్తేమికాకపోయినా ఈ ఏడాది అమెరికా, యూరోపియన్ దేశాలు తిరస్కరించిన రొయ్యల కంటైనర్లలో 11 జిల్లాకు చెందినవి కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో కంటైనర్లు తిరిగి వచ్చినా ఒకేసారి ఇంత సంఖ్యలో ఎన్నడూ జరగలేదు. దశాబ్దన్నర క్రితం ఆస్ట్రేలియా మన రొయ్యల్లో యాంటీబయోటిక్స్ అవశేషాలను గుర్తించి ఇప్పటికీ దిగుమతి చేసుకోవడం లేదు. యాంటీబయోటిక్స్ అంటే.. యాంటీ బయోటిక్స్ అంటే కొన్ని జాతుల సూక్ష్మజీవులతో వాటి జీవన ప్రక్రియ ఆధారంగా తయారుచేసే రసాయనిక పదార్థాలు. మిగిలిన సూక్ష్మజీవుల పెరుగుదల ప్రక్రియను ఇవి నియంత్రిస్తాయి. వాటి ప్రభావం 21 రోజుల వరకూ ఉంటుంది. ప్రస్తుతం ఉంటున్న యాం టీబయోటిక్స్ ప్రభావం అంతకు మించి చూపుతోంది. యాంటీబయోటిక్స్ వాడిన రొయ్యలను తినడం ద్వారా అవి మానవ శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది. రోగాలు తప్పవు క్లోరామ్ఫెనికాల్, ప్యూరాజోలిడాన్ తదితర మందుల వల్ల ఆప్లాస్టిక్ ఎనీమియా తరహా వ్యాధులు వస్తాయి. జీర్ణకోశంలో ఇబ్బందులు, ఎముక మూలుగులో రక్తం తయారీ నిలిచిపోతోంది. క్రమంగా రక్తహీనతకు గురవుతాం. నిషేధిత యాంటీబయోటిక్స్ శరీరంలో ఉండటం వల్లన మరే మందులు పనిచేయవు. చివరకు క్యాన్సర్‌కు దారి తీస్తుందని వైద్య నిపుణులు ఇప్పటికే గుర్తించారు. దీంతో 20 రకాల యాంటీ బయోటిక్స్‌ను ఆక్వా సాగులో నిషేధించారు. పరిజ్ఞానం.. అంతంతమాత్రం రొయ్యల ఉత్పిత్తిలో యాంటీబయోటిక్స్ అవశేషాలను గుర్తించే పరిజ్ఞానం అంతంతమాత్రంగా ఉంది. పట్టుబడికి ముందు ఫ్రీ హార్వెస్ట్ టెస్ట్ (పీహెచ్‌టీ) చేస్తారు. ఎంపెడా ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏడు చోట్ల ఇటువంటి ప్రయోగశాలలున్నాయి. భీమవరం ఒకటి, నెల్లూరులో (లిక్విడ్ క్రొమిటోగ్రఫీ మాస్ స్పెక్ట్రోమెట్రిక్) ఒకటి ప్రయోగశాలలు ఉన్నాయి. అనుమతి లేకుండా.. రొయ్యలకు మేలు చేసేందుకు నీటిలో, మేతలో, చెరువు నేలలో వాడే ప్రోబయోటిక్స్ ఉన్నాయి. ఈ పేరు చెప్పి యాంటీబయోటిక్స్ కలిపిన వాటి అమ్మకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సరైన ప్రమాణాలు పా టించకుండా హేచరీల్లో రొయ్య పిల్లల ఉత్పత్తి వల్ల కూడా యాంటీ బయోటిక్ అవశేషాలు కనిపిస్తున్నాయి. పొలాల్లో పురుగుమందుల వాడకంతో వ్యర్థ జలాలు పంట కాలువలు, బోదెల్లోకి ప్రవేశించడం, ఆ నీరు రొ య్యల చెరువులకు మళ్లించడం వల్ల కూడా యాంటీ బయోటిక్స్ అవశేషాలు కనిపిస్తున్నట్టు గుర్తించారు. 20 రకాలపై నిషేధం ఆక్వా ఉత్పత్తుల పెంపకంలో వాడకంపై నిషేధం ఉన్న యాంటీబయోటిక్స్ మందులు, రసాయనాలు ఇవి క్లోరామ్ ఫెనికాల్ ∙నెట్రోప్యూరాన్స్, ప్యూరాజోలిడాన్, నెట్రోప్యూరాజోన్, ప్యూరాల్టోడాన్, నెట్రో ప్యూరాన్టాయిన్, ప్యూరైల్ప్యూరామైడ్, నెప్యూరటల్, నెపురోగ్జిమ్, నైఫర్ప్రజైన్, వాటి నుంచి వచ్చే ఉత్పాదనలు నియోమైసిన్ నాలిడిక్సిక్ ఆసిన్ సల్ఫా మిథాక్వోజిల్ అరిస్టాలోకియా జాతి మొక్కల నుంచి తయారు చేసిన మందులు క్లోరోఫాం క్లోర్ప్రోమజైన్ కోల్చిసిన్ డాప్సోన్ డైమిట్రీ డాజోల్ మెట్రోనిడాజోల్ రోనిడాజోల్ ఇప్రాని డాజోల్ ఇతర నైట్రోమిడాజోల్స్ క్లెన్ బ్యుటరాల్ డైఇథైల్ స్టిల్ బిన్స్టిరాల్ æ సల్ఫోనమైడ్ (అనుమతించబడని సల్ఫాడైమిథాక్సిన్, సల్ఫాబ్రోమో మిథాజైన్, సల్ఫా ఇథాక్సి, పైరిడాజైన్) ఫ్లోరిక్వినోలోన్స్ గ్లైకోపిప్టిడ్స్ -
తీరం కబ్జా
ఉలవపాడు: సాగర తీరం కబ్జా కోరల్లో చిక్కుకుపోయింది. బడాబాబుల చేతుల్లో పడి రొయ్యల చెరువులుగా మారిపోయింది. పొరుగు జిల్లా నుంచి వచ్చి మరీ ఇక్కడి తీరంలో వ్యాపారం సాగిస్తున్నా రెవెన్యూ అధికారులు కిమ్మనడం లేదు. మండల పరిధిలోని కరేడు కొత్త పల్లెపాలెం తీరప్రాంతంలో బకింగ్ హామ్ కెనాల్‌కు, సముద్రానికి మధ్యలోని సుమారు 125 ఎకరాలు ఆక్రమించి రొయ్యల చెరువులు వేసి వ్యాపారం చేస్తున్నారు. సముద్రం ఆనుకుని ఈ చెరువులు ఏర్పాటు చేయడం గమనార్హం. ఆక్రమణ జరిగిందిలా... కరేడు కొత్త పల్లెపాలెం గ్రామస్తులను రొయ్యల వ్యాపారులు మంచి చేసుకున్నారు. తాము ఆ భూమిలో రొయ్యల చెరువులు నిర్మిస్తామని, దానికి ప్రతిఫలంగా ఎకరానికి ఏడాదికి రూ.10 వేలు చొప్పున గ్రామానికి ఇస్తామని ఆశచూపారు. ప్రభుత్వ పొలాల వలన తమకు ఆదాయం వస్తుందని గ్రామస్తులు సంతోషించారు. నగదు చెల్లించి గ్రామస్తుల నుంచి వ్యతిరేకత రాకుండా చేసుకున్న వ్యాపారులు దాదాపు 5 నెలల నుంచి రొయ్యల చెరువులు సాగు చేస్తున్నారు. అయినా రెవెన్యూ అధికారులు ఏమాత్రం పట్టించుకోకపోగా అక్రమార్కులకు అండగా నిలవడంతో వారి వ్యాపారం మూడు పువ్వులు, ఆరు కాయలుగా సాగుతోంది. అధికారుల అండతోనే... అధికారుల అండతోనే ఇక్కడ రొయ్యల చెరువులు వేయగలిగారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ముందుగా వచ్చిన తహశీల్దార్‌తో మాట్లాడి తమ వ్యాపారానికి అడ్డు లేకుండా చేసుకున్నారు. గ్రామస్తుల సహకారం కూడా ఉండడంతో ఒక పంటను అమ్మారు. వెనామీ రొయ్యలను పెంచి కేజీ 300 రూపాయల చొప్పున అమ్మి వ్యాపారం చేసుకుంటున్నారు. ఇక్కడి వ్యాపారులంతా పొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు చెందిన వారు. 80 కి.మీ ల దూరం నుంచి వచ్చి ఇక్కడ వ్యాపారం చేస్తున్నారంటే ఎంత మేరకు లాభాలు వస్తున్నాయో ఇట్టే అర్థమవుతుంది. జనరేటర్లతోనే నిర్వహణ... ప్రభుత్వ స్థలాలు ఆక్రమించి ఏర్పాటు చేసిన రొయ్యల చెరువులకు విద్యుత్ శాఖాధికారులు విద్యుత్ సౌకర్యం కల్పించలేదు. పట్టా భూములకు మాత్రమే ఇస్తామని తేల్చి చెప్పారు. దీని కోసం చాలా పాట్లు పడ్డారు కానీ ఉపయోగం లేకుండా పోయింది. తహశీల్దార్ ధ్రువీకరణ పత్రం అందిస్తేనే విద్యుత్ కనెక్షన్ ఇస్తామని చెప్పడంతో ప్రయత్నించి విఫలమయ్యారు. కానీ చెరువుల నిర్వహణ మాత్రం ఆగలేదు. జనరేటర్లతో బోర్లను ఏర్పాటు చేసి రొయ్యల చెరువులు నిర్వహిస్తున్నారు. కొంత నీరు సముద్రం నుంచి కూడా పంపింగ్ చేసి చెరువులకు పెడుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం మామూళ్ల మత్తులో తమకేమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో బకింగ్‌హామ్ కెనాల్, సముద్రం మధ్య భాగాన్ని ఎంతో విలువైనదిగా చూసేవారు. బకింగ్‌హామ్ కెనాల్ ద్వారా భారీ ఓడలు కూడా వెళ్లేవి. ప్రభుత్వం మళ్లీ ఈ కెనాల్ అభివృద్ధి చేయాలని చూస్తున్న తరుణంలోనూ ఆక్రమణలను అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరం. ఈ విషయమై తహశీల్దార్ శ్రీశిల్పను సాక్షి వివరణ కోరగా ‘వంద ఎకరాలకుపైగా ఆక్రమణకు గురైందా..అవునా..నేను సోమవారం ఉదయం వచ్చి మాట్లాడతాను’ అని చెప్పారు. -
అంతా మా ఇష్టం..
రామచంద్రపురం, న్యూస్‌లైన్ : అధిక లాభాలు పండించుకోవాలనే కొంత మంది బడాబాబుల దురాశ.. పసిడి సిరులను పండించే నేలతల్లికి తూట్లు పొడుస్తోంది. రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇటీవల కొందరు.. నిబంధనలను తుంగలో తొక్కి.. రైతులకు అధిక శిస్తు ఆశ చూపి.. పచ్చని పంటలు పండే పంట పొలాలను విచ్చలవిడిగా.. రాత్రికి రాత్రే రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. దీనివల్ల తమ పొలాలు దెబ్బ తింటాయని చుట్టుపక్కల రైతులు ఆందోళన చెందుతున్నారు. రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇటీవల అనధికార రొయ్యల చెరువుల తవ్వకాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్క రామచంద్రపురం నియోజకవర్గంలోనే వందలాది ఎకరాల పంట పొలాలు రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి. డివిజన్ పరిధిలోని కె.గంగవరం, రామచంద్రపురం, కాజులూరు, మండపేట, రాయవరం మండలాల్లోని రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకూ లీజు మొత్తం చెల్లించి, ఆ భూములను రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. ఈవిధంగా కొంతమంది బడాబాబులు నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కి.. వందలాది ఎకరాల పంట పొలాలను పదేళ్ల నుంచి 20 ఏళ్లకు లీజుకు తీసుకుని చెరువులుగా మార్చేస్తున్నారు. వ్యవసాయం ద్వారా పంటలు బాగా పండితే రైతుకు ఎకరానికి రూ.30 వేలు మాత్రమే శిస్తు వస్తుంది. అదే రొయ్యల చెరువులకు లీజుకు ఇస్తే ఏడాదికి సుమారు రూ.50 వేలు పైగానే దక్కుతోంది. దీంతో రైతులు కూడా తమ పొలాలను చెరువులకు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. పొంచి ఉన్న ప్రమాదం పంట పొలాల మధ్య చెరువులు తవ్వడం వల్ల చుట్టుపక్కల పొలాలపై ఆ ప్రభావం పడే అవకాశముంది. ఇష్టానుసారం చెరువులు తవ్వి భారీగా గట్లు వెయ్యడం వల్ల.. వర్షాలు అధికంగా కురిసే సమయంలో పంట పొలాల్లోని నీరు త్వరగా దిగేందుకు ఆస్కారం ఉండదు. దీనివల్ల రోజుల తరబడి పొలాలు ముంపులో చిక్కుకునే ప్రమాదం ఉంటుందని పరిసర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలాగే చెరువులు తవ్వుతున్న పొలాలు భవిష్యత్తులో చౌడుబారి పంటలు పండించేందుకు పనికి రావని వారంటున్నారు. మరోపక్క రొయ్యల చెరువుల్లో రసాయనాలు వాడడం వల్ల వాటి పక్కన ఉన్న డ్రెయిన్లు, నీటిపారుదల కాలువలు కాలుష్యం బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న చెరువుల తవ్వకాన్ని తక్షణం నిలుపు చేయాలని అధికారులను పరిసర పొలాల రైతులు కోరుతున్నారు. అధిక లాభాల కోసమే.. ఎకరం పంట పొలాన్ని రొయ్యల చెరువుగా మారిస్తే మొదటిసారి సుమారు రూ 6లక్షల పెట్టుబడి అవుతుంది. రొయ్యల రేటు బాగుంటే మొదటి పంటలోనే సుమారు రూ.10 లక్షల వరకూ ఆదాయం వస్తుంది. అంటే ఒక్క పంటలోనే సుమారు రూ.4 లక్షల వరకూ లాభం వస్తుందన్నమాట. ఇలా ఏడాదికి రెండు లేదా మూడు పంటలు కూడా వేస్తారు. మొదటిసారి పెట్టుబడి ఎక్కువగా ఉన్నా అ తరువాత నుంచి పెట్టేది తక్కువగానే ఉంటుంది. ఇంతగా లాభాలు వస్తున్నందువల్లనే పంట పొలాలను రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారని తెలుస్తోంది. కఠిన చర్యలు తీసుకుంటాం ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అనధికారంగా తవ్వుతున్న చెరువులపై ఫిర్యాదులందాయి. అనుమతులు లేకుండా పంట భూములను చెరువులుగా తవ్వుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రామచంద్రపురం మండలంలో కొన్నిచోట్ల అనధికార తవ్వకాలను నిలుపు చేశాం. జిల్లా కమిటీ అనుమతులు తప్పని సరిగా ఉండాలి. లేకుంటే చర్యలు తప్పవు. - కె.సుబ్బారావు, ఆర్డీఓ, రామచంద్రపురం ఇవీ నిబంధనలు నిబంధనల ప్రకారం అవసరమైన అనుమతులు లేకుండా పంట పొలాలను చెరువులుగా మార్చరాదు. అలా మార్చే పక్షంలో చెరువు చుట్టూ మూడు మీటర్ల స్థలం విడిచిపెట్టాలి. ఆ చెరువుల్లోని నీరు బయటకు పోయేవిధంగా వారి స్థలాల్లోనే కాలువలు తవ్వాలి. పంట కాలువలు, ప్రభుత్వ డ్రైనేజీల్లోనికి ఆ చెరువుల్లోని నీటిని వదలరాదు. ప్రభుత్వ భూములు ఆక్రమించరాదు. చుట్టుపక్కల పంట భూములకు ఎటువంటి ప్రమాదమూ వాటిల్లకూడదు. చేపలు, రొయ్యల చెరువుల తవ్వకానికి కలెక్టర్ నేతృత్వంలో వివిధ శాఖలతో ఏర్పాటు చేసిన కమిటీ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. మండల, డివిజన్ స్థాయిలో అనుమతులు పొందిన అనంతరం చివరిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తారు. చెరువులు తవ్వే ప్రాంతాలను సంబంధిత ఆర్డీఓ, వ్యవసాయ, మత్స్య, నీటిపారుదల, భూగర్భ నీటివనరుల అధికారుల బృందం చెరువులు తవ్వే ప్రదేశాలను పరిశీలించాలి. వారి నివేదిక ఆధారంగా కలెక్టర్ అనుమతి మంజూరు చేస్తారు. ఆ తరువాత మాత్రమే పంట పొలాలను చెరువులుగా మార్చాలి. కానీ రామచంద్రపురం డివిజన్లో ఎటువంటి అనుమతులూ లేకుండానే విచ్చలవిడిగా చెరువులను తవ్వుతున్నారు. -
అక్రమ చెరువుల తవ్వకాలపై కొరడా
భీమవరం, న్యూస్‌లైన్ : అక్రమంగా చేపలు, రొయ్యల చెరువులు తవ్వి సాగు చేస్తున్న వారిపై చర్యలకు రంగం సిద్ధమవుతోంది. ముందుగా వారికి అధికారులు నోటీసులు జారీ చేస్తున్నారు. అనంతరం జరిమానాతో పాటు చెరువులు ధ్వంసం చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఎటువంటి అనుమతి లేకుండా చేపల చెరువులు తవ్వి సాగుచేస్తున్న వారిని గుర్తించే పనిలో మత్స్య, రెవెన్యూ శాఖ అధికార యంత్రాంగం నిమగ్నమైంది. జిల్లాలో దాదాపు 15 వేల ఎకరాల్లో చేపలు, రొయ్యల అక్రమసాగు జరుగుతున్నట్లు అధికారులు గుర్తించారు. ఈ చెరువుల రైతులందరికి ముందుగా నోటీసులు జారీ చేసే కార్యక్రమం ప్రారంభించారు. కొత్తగా ఎటువంటి అనుమతి లేకుండా చేపల చెరువులు తవ్వుతున్న వారిని గుర్తించి చెరువులకు గండికొట్టడంతో పాటు వారిపై క్రిమినల్ కేసులు నమోదుచేస్తున్నారు. రెండు రోజులుగా కాళ్ల, పెనుమంట్ర, గణపవరం మండలాల్లో అక్రమ చెరువుల తవ్వకాలపై అధికారులు దాడులు చేసి పొక్లెన్‌లను స్వాధీనం చేసుకుని తవ్వకందారులపై క్రిమినల్ కేసులు పెట్టారు. గ్రామాల్లో అనుమతులు లేకుండా చేపల చెరువులు తవ్వకూడదని ఇప్పటికే అధికారులు టాంటాంలు వేయిం చారు. అనుమతులు లేకుండా తవ్వకాలు సాగి స్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిస్తున్నారు. ముందుగా నోటీసులు, జరిమానా.. జిల్లాలోని అక్రమ చేపల చెరువుల భరతం ప ట్టేందుకు కలెక్టర్ సిద్ధార్థజైన్ అధ్వర్యంలో అధికార యంత్రాంగం సంసిద్ధమవుతోంది. ముం దుగా నోటీసులు జారీ చేస్తున్నారు. అనంతరం ఎకరానికి రూ.5 వేలు జరిమానా విధించనున్నట్టు అధికారులు తెలిపారు. నిబంధనలను పాటించకుండా చెరువులు సాగు చేస్తున్నారన్న దానిపై ముందు జరిమానా విధించి ఆ తర్వాత చెరువులకు గండి కొట్టి ధ్వంసం చేయనున్నట్టు మత్స్యశాఖ భీమవరం ఉప సంచాలకులు లాల్ మహ్మద్ పేర్కొన్నారు. ఇప్పటికే ఈ దశగా చర్యలు చేపట్టినట్టు చెప్పారు. కాళ్ల, భీమవరం, మొగల్తూరు, ఆకివీడు, నర్సాపురం మండలాల్లో అత్యధికంగా అనధికారికంగా చెరువులు సాగు చేస్తున్నట్టు తెలిపారు. అనుమతి లేకుండా సాగవుతున్న చెరువులకు అధికారులు దరఖాస్తుచేసుకునేందుకు గతేడాది జూన్ 15 వరకు అవకాశం ఇచ్చారు. కొంతమంది ఈ సమయంలో రెన్యువల్ చేయించుకున్నారు. ఇక అవకాశం లేదని అధికారులు తెలిపారు.