ఏరొయ్యలో ఏ"మందో"..! | Antibiotics in shrimp ponds | Sakshi
Sakshi News home page

ఏరొయ్యలో ఏ"మందో"..!

Published Mon, Oct 23 2017 1:13 PM | Last Updated on Mon, Oct 23 2017 1:13 PM

Antibiotics in shrimp ponds

మత్స్యశాఖ అధికారులు ఏర్పాటుచేసిన బోర్డు

భీమవరం టౌన్‌ : లొట్టలేసుకుని తినే రొయ్యల్లో ఏ ‘మందో’ తెలియదు. రొయ్యల్లో యాంటీ బయోటిక్స్‌ మనకు తెలియకుండా శరీరంలోకి ప్రవేశిస్తున్నా గుర్తించే వ్యవస్థ లేదు. జిల్లాలో ఆక్వా సాగులో యాంటీ బయోటిక్స్‌ను విచ్చలవిడిగా వినియోగిస్తూ వేలాది టన్నుల రొయ్యలు ఉత్పత్తి చేసి విక్రయిస్తున్నా పట్టించుకునే వారు లేరు. ప్రజారోగ్యంతో చెలగాటమాడే మందులను తయారు చేసే సంస్థలపై చర్యలు లేవు. నిషేధిత యాంటీయోటిక్స్‌ గురించి అవగాహన లేని రైతులు దుకాణాల నుంచి వాటిని ద్రావణం, పొడి రూపంలో తెచ్చి చెరువుల్లో వినియోగిస్తున్నారు. ఇలా ఉత్పత్తి అయిన రొయ్యలు విదేశాలకు ఎగుమతి కాగా అక్కడ అవశేషాలను గుర్తించి తిరిగి పంపుతున్నారు. ఇలా ‘పశ్చిమ’ రొయ్యలను విదేశాలు తిరిగి వెనక్కి పంపడం కొత్తేమికాకపోయినా ఈ ఏడాది అమెరికా, యూరోపియన్‌ దేశాలు తిరస్కరించిన రొయ్యల కంటైనర్లలో 11 జిల్లాకు చెందినవి కావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో కంటైనర్లు తిరిగి వచ్చినా ఒకేసారి ఇంత సంఖ్యలో ఎన్నడూ జరగలేదు. దశాబ్దన్నర క్రితం ఆస్ట్రేలియా మన రొయ్యల్లో యాంటీబయోటిక్స్‌ అవశేషాలను గుర్తించి ఇప్పటికీ దిగుమతి చేసుకోవడం లేదు.

యాంటీబయోటిక్స్‌ అంటే..
యాంటీ బయోటిక్స్‌ అంటే కొన్ని జాతుల సూక్ష్మజీవులతో వాటి జీవన ప్రక్రియ ఆధారంగా తయారుచేసే రసాయనిక పదార్థాలు. మిగిలిన సూక్ష్మజీవుల పెరుగుదల ప్రక్రియను ఇవి నియంత్రిస్తాయి. వాటి ప్రభావం 21 రోజుల వరకూ ఉంటుంది. ప్రస్తుతం ఉంటున్న యాం టీబయోటిక్స్‌ ప్రభావం అంతకు మించి చూపుతోంది. యాంటీబయోటిక్స్‌ వాడిన రొయ్యలను తినడం ద్వారా అవి మానవ శరీరంలోకి ప్రవేశించే ప్రమాదం ఉంది.

రోగాలు తప్పవు
క్లోరామ్‌ఫెనికాల్, ప్యూరాజోలిడాన్‌ తదితర మందుల వల్ల ఆప్లాస్టిక్‌ ఎనీమియా తరహా వ్యాధులు వస్తాయి. జీర్ణకోశంలో ఇబ్బందులు, ఎముక మూలుగులో రక్తం తయారీ నిలిచిపోతోంది. క్రమంగా రక్తహీనతకు గురవుతాం. నిషేధిత యాంటీబయోటిక్స్‌ శరీరంలో ఉండటం వల్లన మరే మందులు పనిచేయవు. చివరకు క్యాన్సర్‌కు దారి తీస్తుందని వైద్య నిపుణులు ఇప్పటికే గుర్తించారు. దీంతో 20 రకాల యాంటీ బయోటిక్స్‌ను ఆక్వా సాగులో నిషేధించారు.

పరిజ్ఞానం.. అంతంతమాత్రం
రొయ్యల ఉత్పిత్తిలో యాంటీబయోటిక్స్‌ అవశేషాలను గుర్తించే పరిజ్ఞానం అంతంతమాత్రంగా ఉంది. పట్టుబడికి ముందు ఫ్రీ హార్వెస్ట్‌ టెస్ట్‌ (పీహెచ్‌టీ) చేస్తారు. ఎంపెడా ఆధ్వర్యంలో రాష్ట్రంలో ఏడు చోట్ల ఇటువంటి ప్రయోగశాలలున్నాయి. భీమవరం ఒకటి, నెల్లూరులో (లిక్విడ్‌ క్రొమిటోగ్రఫీ మాస్‌ స్పెక్ట్రోమెట్రిక్‌) ఒకటి ప్రయోగశాలలు ఉన్నాయి.

అనుమతి లేకుండా..
రొయ్యలకు మేలు చేసేందుకు నీటిలో, మేతలో, చెరువు నేలలో వాడే ప్రోబయోటిక్స్‌ ఉన్నాయి. ఈ పేరు చెప్పి యాంటీబయోటిక్స్‌ కలిపిన వాటి అమ్మకాలు సాగిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. సరైన ప్రమాణాలు పా టించకుండా హేచరీల్లో రొయ్య పిల్లల ఉత్పత్తి వల్ల కూడా యాంటీ బయోటిక్‌ అవశేషాలు కనిపిస్తున్నాయి.
పొలాల్లో పురుగుమందుల వాడకంతో వ్యర్థ జలాలు పంట కాలువలు, బోదెల్లోకి ప్రవేశించడం, ఆ నీరు రొ య్యల చెరువులకు మళ్లించడం వల్ల కూడా యాంటీ బయోటిక్స్‌ అవశేషాలు కనిపిస్తున్నట్టు గుర్తించారు.

20 రకాలపై నిషేధం
ఆక్వా ఉత్పత్తుల పెంపకంలో వాడకంపై నిషేధం ఉన్న యాంటీబయోటిక్స్‌ మందులు, రసాయనాలు ఇవి క్లోరామ్‌ ఫెనికాల్‌ ∙నెట్రోప్యూరాన్స్, ప్యూరాజోలిడాన్, నెట్రోప్యూరాజోన్, ప్యూరాల్టోడాన్, నెట్రో ప్యూరాన్‌టాయిన్, ప్యూరైల్‌ప్యూరామైడ్, నెప్యూరటల్, నెపురోగ్జిమ్, నైఫర్‌ప్రజైన్, వాటి నుంచి వచ్చే ఉత్పాదనలు  నియోమైసిన్‌  నాలిడిక్సిక్‌ ఆసిన్‌  సల్ఫా మిథాక్వోజిల్‌  అరిస్టాలోకియా జాతి మొక్కల నుంచి తయారు చేసిన మందులు    క్లోరోఫాం  క్లోర్‌ప్రోమజైన్‌  కోల్చిసిన్‌  డాప్సోన్‌  డైమిట్రీ డాజోల్‌  మెట్రోనిడాజోల్‌  రోనిడాజోల్‌  ఇప్రాని డాజోల్‌  ఇతర నైట్రోమిడాజోల్స్‌  క్లెన్‌ బ్యుటరాల్‌  డైఇథైల్‌ స్టిల్‌ బిన్‌స్టిరాల్‌ æ సల్ఫోనమైడ్‌ (అనుమతించబడని సల్ఫాడైమిథాక్సిన్,
సల్ఫాబ్రోమో మిథాజైన్, సల్ఫా ఇథాక్సి, పైరిడాజైన్‌)  ఫ్లోరిక్వినోలోన్స్‌  గ్లైకోపిప్టిడ్స్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement