అంతా మా ఇష్టం.. | ponds between crop farms | Sakshi
Sakshi News home page

అంతా మా ఇష్టం..

Published Sat, Jun 7 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 8:24 AM

అంతా మా ఇష్టం..

అంతా మా ఇష్టం..

రామచంద్రపురం, న్యూస్‌లైన్ : అధిక లాభాలు పండించుకోవాలనే కొంత మంది బడాబాబుల దురాశ.. పసిడి సిరులను పండించే నేలతల్లికి తూట్లు పొడుస్తోంది. రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇటీవల కొందరు.. నిబంధనలను తుంగలో తొక్కి.. రైతులకు అధిక శిస్తు ఆశ చూపి.. పచ్చని పంటలు పండే పంట పొలాలను విచ్చలవిడిగా.. రాత్రికి రాత్రే రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. దీనివల్ల తమ పొలాలు దెబ్బ తింటాయని చుట్టుపక్కల రైతులు ఆందోళన చెందుతున్నారు.
 
రామచంద్రపురం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఇటీవల అనధికార రొయ్యల చెరువుల తవ్వకాలు విపరీతంగా పెరిగిపోయాయి. ఒక్క రామచంద్రపురం నియోజకవర్గంలోనే వందలాది ఎకరాల పంట పొలాలు రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి. డివిజన్ పరిధిలోని కె.గంగవరం, రామచంద్రపురం, కాజులూరు, మండపేట, రాయవరం మండలాల్లోని రైతులకు ఎకరానికి ఏడాదికి రూ.50 వేల నుంచి రూ.70 వేల వరకూ లీజు మొత్తం చెల్లించి, ఆ భూములను రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు.
 
ఈవిధంగా కొంతమంది బడాబాబులు నిబంధనలను యథేచ్ఛగా తుంగలో తొక్కి.. వందలాది ఎకరాల పంట పొలాలను పదేళ్ల నుంచి 20 ఏళ్లకు లీజుకు తీసుకుని చెరువులుగా మార్చేస్తున్నారు. వ్యవసాయం ద్వారా పంటలు బాగా పండితే రైతుకు ఎకరానికి రూ.30 వేలు మాత్రమే శిస్తు వస్తుంది. అదే రొయ్యల చెరువులకు లీజుకు ఇస్తే ఏడాదికి సుమారు రూ.50 వేలు పైగానే దక్కుతోంది. దీంతో రైతులు కూడా తమ పొలాలను చెరువులకు ఇచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు.
 
 పొంచి ఉన్న ప్రమాదం
 పంట పొలాల మధ్య చెరువులు తవ్వడం వల్ల చుట్టుపక్కల పొలాలపై ఆ ప్రభావం పడే అవకాశముంది. ఇష్టానుసారం చెరువులు తవ్వి భారీగా గట్లు వెయ్యడం వల్ల.. వర్షాలు అధికంగా కురిసే సమయంలో పంట పొలాల్లోని నీరు త్వరగా దిగేందుకు ఆస్కారం ఉండదు. దీనివల్ల రోజుల తరబడి పొలాలు ముంపులో చిక్కుకునే ప్రమాదం ఉంటుందని పరిసర రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 
అలాగే చెరువులు తవ్వుతున్న పొలాలు భవిష్యత్తులో చౌడుబారి పంటలు పండించేందుకు పనికి రావని వారంటున్నారు. మరోపక్క రొయ్యల చెరువుల్లో రసాయనాలు వాడడం వల్ల వాటి పక్కన ఉన్న డ్రెయిన్లు, నీటిపారుదల కాలువలు కాలుష్యం బారిన పడే అవకాశాలు కూడా ఉంటాయి. నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న చెరువుల తవ్వకాన్ని తక్షణం నిలుపు చేయాలని అధికారులను పరిసర పొలాల రైతులు కోరుతున్నారు.
 
 అధిక లాభాల కోసమే..
 
 ఎకరం పంట పొలాన్ని రొయ్యల చెరువుగా మారిస్తే మొదటిసారి సుమారు రూ 6లక్షల పెట్టుబడి అవుతుంది.
 
 రొయ్యల రేటు బాగుంటే మొదటి పంటలోనే సుమారు రూ.10 లక్షల వరకూ ఆదాయం వస్తుంది. అంటే ఒక్క పంటలోనే సుమారు రూ.4 లక్షల వరకూ లాభం వస్తుందన్నమాట.
 
 ఇలా ఏడాదికి రెండు లేదా మూడు పంటలు కూడా వేస్తారు.
 
 మొదటిసారి పెట్టుబడి ఎక్కువగా ఉన్నా అ తరువాత నుంచి పెట్టేది తక్కువగానే ఉంటుంది.
 
 ఇంతగా లాభాలు వస్తున్నందువల్లనే పంట పొలాలను రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారని తెలుస్తోంది.
 
కఠిన చర్యలు తీసుకుంటాం

ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో అనధికారంగా తవ్వుతున్న చెరువులపై ఫిర్యాదులందాయి. అనుమతులు లేకుండా పంట భూములను చెరువులుగా  తవ్వుతున్నవారిపై కఠిన చర్యలు తీసుకుంటాం. ఇప్పటికే రామచంద్రపురం మండలంలో కొన్నిచోట్ల అనధికార తవ్వకాలను నిలుపు చేశాం. జిల్లా కమిటీ అనుమతులు తప్పని సరిగా ఉండాలి. లేకుంటే చర్యలు తప్పవు.                           - కె.సుబ్బారావు, ఆర్డీఓ, రామచంద్రపురం
 
ఇవీ నిబంధనలు
 
నిబంధనల ప్రకారం అవసరమైన అనుమతులు లేకుండా పంట పొలాలను చెరువులుగా మార్చరాదు.
 
అలా మార్చే పక్షంలో చెరువు చుట్టూ మూడు మీటర్ల స్థలం విడిచిపెట్టాలి.
 
ఆ చెరువుల్లోని నీరు బయటకు పోయేవిధంగా వారి స్థలాల్లోనే కాలువలు తవ్వాలి. పంట కాలువలు, ప్రభుత్వ డ్రైనేజీల్లోనికి ఆ చెరువుల్లోని నీటిని వదలరాదు. ప్రభుత్వ భూములు ఆక్రమించరాదు.
 
చుట్టుపక్కల పంట భూములకు ఎటువంటి ప్రమాదమూ వాటిల్లకూడదు.
 
చేపలు, రొయ్యల చెరువుల తవ్వకానికి కలెక్టర్ నేతృత్వంలో వివిధ శాఖలతో ఏర్పాటు చేసిన కమిటీ అనుమతి తీసుకోవడం తప్పనిసరి. మండల, డివిజన్ స్థాయిలో అనుమతులు పొందిన అనంతరం చివరిగా కలెక్టర్ ఆదేశాలు జారీ చేస్తారు.
 
చెరువులు తవ్వే ప్రాంతాలను సంబంధిత ఆర్డీఓ, వ్యవసాయ, మత్స్య, నీటిపారుదల, భూగర్భ నీటివనరుల అధికారుల బృందం చెరువులు తవ్వే ప్రదేశాలను పరిశీలించాలి. వారి నివేదిక ఆధారంగా కలెక్టర్ అనుమతి మంజూరు చేస్తారు. ఆ తరువాత మాత్రమే పంట పొలాలను చెరువులుగా మార్చాలి.
 
కానీ రామచంద్రపురం డివిజన్‌లో ఎటువంటి అనుమతులూ లేకుండానే విచ్చలవిడిగా చెరువులను తవ్వుతున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement