ఆ పంట సాగు చేస్తే లాభాలే లాభాలు.. ఎకరాకు రూ.లక్ష ఆదాయం.. | Farmers High Profits From Potato Cultivation | Sakshi
Sakshi News home page

ఆ పంట సాగు చేస్తే లాభాలే లాభాలు.. ఎకరాకు రూ.లక్ష ఆదాయం..

Published Mon, Jan 2 2023 4:00 PM | Last Updated on Mon, Jan 2 2023 4:37 PM

Farmers High Profits From Potato Cultivation - Sakshi

పుట్టపర్తి అర్బన్‌(శ్రీసత్యసాయి జిల్లా): ఆలుగడ్డల సాగు ఈ ఏడాది రైతులను లక్షాధికారులను చేస్తోంది. సాధారణంగా అక్టోబర్‌ నుంచి డిసెంబర్‌ వరకూ సాగు చేసే ఆలుగడ్డ మంచి దిగుబడితో పాటు అధిక ధరలు పలుకుతుంటాయి. అయితే పంట సాగుకు ఖర్చు ఎక్కువే అయినా.. దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో రైతుల ఇంట సిరుల వర్షం కురుస్తోంది. ఎకరా విస్తీర్ణంలో రూ.లక్షకు పైగా ఆదాయం వస్తుండడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది.

కలిసొచ్చిన వాతావరణం 
గత మూడేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు ఖరీఫ్, రబీ సీజన్‌లలో వాతావరణ పరిస్థితులూ బాగా కలిసొచ్చాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా 23,104 ఎకరాల్లో వివిధ రకాల ఆకు కూరలు, కూరగాయలను రైతులు సాగు చేశారు. అత్యధికంగా 18,872 ఎకరాల్లో టమాట సాగు చేయగా.. 2,076 ఎకరాల్లో పచ్చి మిరప, 919 ఎకరాల్లో వంకాయ, 450 ఎకరాలో ఆలుగడ్డ, 368 ఎకరాల్లో బెండ, 241 ఎకరాల్లో చిక్కుడు,  94 ఎకరాల్లో క్యాబేజీ పంటలను సాగు చేశారు.

దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో పంట ఉత్పత్తులను స్థానిక వారపు మార్కెట్లతో పాటు హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, కొత్తచెరువు తదితర పట్టణ ప్రాంతాల్లోనే దినసరి మార్కెట్‌లు, మదనపల్లి, చెన్నేతో పాటు కర్ణాటకలోని బాగేపల్లి, చింతామణి, బెంగళూరు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు.  ధర అధికంగా ఉండడంతో తోటల వద్దకే వ్యాపారులు వచ్చి పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు.

ఎకరాకు 150 బస్తాలు 
సీజన్‌ను బట్టి ఆలు విత్తన గడ్డ 50 కిలోల బస్తా రూ.2,500 నుంచి రూ.3వేల వరకు ధర పలుకుతోంది. భూమిని దుక్కి చేయడం, గడ్డి తొలగించడం, విత్తనం పెట్టడం, డ్రిప్‌ ద్వారా ఎరువులు, సాల్లు తీయడం, ఎరువులు పంట చివరన దున్ని గడ్డలను తొలగించడం వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియకు ఎకరా విస్తీర్ణంలో దాదాపు రూ.లక్ష వరకు రైతులు వ్యయం చేశారు.

పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు తోటల వద్దకు చేరుకుని పంట కొనుగోళ్లు చేపట్టారు. 40 కిలోల ఆలుగడ్డల బస్తా రూ.1,400తో అమ్ముడు పోతోంది. ఎకరా విస్తీర్ణంలో 150 బస్తాల వరకూ దిగుబడి వచ్చింది. ప్రస్తుత ధరను పోల్చుకుంటే 150 బస్తాలకు రూ.2.10 లక్షలు చేతికి అందుతున్నాయని, పెట్టుబడులు పోను రూ.1.10 లక్షలు మిగులు ఆదాయం ఉంటోందని పెడపల్లి రైతులు జనార్దనరెడ్డి, రోషన్, శివప్ప, సుబ్బరాయనిపల్లి చండ్రాయుడు తెలిపారు.
చదవండి: వీర్లకొండ ఎక్కేద్దాం రండి!   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement