Potato cultivation
-
మరో పాతికేళ్లలో... బ్రిటన్ ఆలూ మాయం!
బ్రిటన్ ప్రజలు ఇష్టంగా తినే బంగాళదుంప సాగు అక్కడ కనాకష్టంగా మారిందట. మరో పాతికేళ్లలో బ్రిటన్‌లో ఆలూ సాగు అసాధ్యంగా మారినా ఆశ్చర్యం లేదని పలు నివేదికలు ఘంటాపథంగా చెబుతున్నాయి. 20250 స్కాట్లండ్ ఆలూ సాగు పరిశ్రమ తుడిచిపెట్టుకుపోవచ్చన్నది వాటి సారాంశం. పొటాటో సిస్ట్ నెమటోడ్స్ (పీసీఎన్) అనే తెగులే ఇందుకు కారణం. ఇది సోకే పంటభూముల్లో ఆలూ సాగు అత్యంత కష్టం. నేరుగా మొక్క వేర్లను నాశనం చేసే ఈ తెగులు దెబ్బకు ఆలూ దిగుబడి దారుణంగా పడిపోతుంది. బ్రిటన్‌లో వాడే ఆలూ 80 శాతం స్కాట్లాండ్ భూముల నుంచే వస్తుంది. 450 కోట్ల యూరోల విలువైన ఆలూ పరిశ్రమను ఆదుకునేందుకు బ్రిటిష్ సైంటిస్టుల బృందం నడుం బిగించింది. పీసీఎన్ను తట్టుకునే రెండు వంగడాలను గుర్తించినట్టు మొక్కల వ్యాధుల నిపుణుడు జేమ్స్ ప్రిన్స్ చెప్పారు. వీటి సాయంతో సమస్యను అధిగమిస్తామని ధీమా వెలిబుచ్చారు. – లండన్ -
ఆలు వైపు.. రైతుల ముందస్తు చూపు
ఆలుగడ్డ పంట ముందస్తు సాగుకు రైతులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పంట సాగుకు నవంబర్ మొదటి వారం అనుకూలంగా ఉంటుంది. అయినా వారు అప్పటి వరకు వేచి చూడకుండా పంటను సాగు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది నవంబర్‌లో పంట వేసుకున్న రైతులకు మార్కెట్లో గిట్టుబాటు ధర రాక నష్టపోయారు. సెప్టెంబర్, అక్టోబర్‌లో ఆలుగడ్డ పంట వేసుకున్న వారికి మార్కెట్లో మంచి ధర పలికి కాసుల వర్షం కురిసింది. దీంతో ఈ సారి ముందస్తు సాగువైపే మొగ్గుచూపుతున్నారు. – జహీరాబాద్ స్వల్పకాలిక పంట కావడం, నీటి తడులు అంతగా అవసరం ఉండక పోవడం వల్ల ముందస్తు సాగు వైపు ఆసక్తి కనబరుస్తున్నారు. 80–90 రోజుల మధ్య కాలంలో పంట చేతికి అందివస్తుంది. మడుల విధానంలో పంటను తీసే సమయంలో 20 రోజుల ముందే నీటి తడులను ఆపేస్తారు. పంట వేసిన సమయంలో మొదటి తడి ఇచ్చాక 20 రోజుల వరకు నీటి తడులు అవసరం ఉండదు. గత ఏడాది కంటే ఈ ఏడాది రెండువేల ఎకరాల్లో సాగు పెరిగే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. గత ఏడాది జిల్లాలో సుమారు 6 వేల ఎకరాల్లో పంట సాగయింది. ప్రతిఏటా 90 శాతం మేర జహీరాబాద్ నియోజకవర్గంలోనే పంట సాగవుతోంది. సాగుకు అనువైన నేలలు ఉండడం వల్లే రైతులు ఆలుగడ్డ పంట వైపు మొగ్గు చూపుతున్నారు. నియోజకవర్గంలోని కోహీర్‌తో పాటు జహీరాబాద్, మొగుడంపల్లి, ఝరాసంగం, న్యాల్కల్ మండలాల్లో రైతులు ఆలు పంట సాగు చేశారు. నీరు పుష్కలంగా ఉండటం వల్లే.. ఈ ఏడాది అధికంగా వర్షాలు పడడం వల్ల వ్యవసాయ బావులు, బోర్లలో నీరు పుష్కలంగా ఉంది. గతంలో నీరు లేక పాడుబడిన బావులు కూడా తిరిగి వినియోగంలోకి వచ్చాయి. దీంతో ఆలుగడ్డ పంట సాగుకు రైతులు ఆసక్తి చూపుతున్నారు. గత ఏడాది కంటే సాగు పెరిగే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. గత ఏడాది మంచి గిట్టుబాటు ధర గత ఏడాది ఆలుగడ్డ పంటను సాగు చేసుకున్న రైతులకు మంచి గిట్టుబాటు ధర లభించింది. ఈ ఏడాది కూడా అదే ఆశతో పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. గత ఏడాది ఎకరం పంట సాగుపై పెట్టుబడులు పోను రూ.50 నుంచి రూ.70వేలు లాభం వచ్చిందని రైతులు పేర్కొంటున్నారు. జోరుగా విత్తన కొనుగోళ్లు.. రైతులు వ్యాపారుల వద్ద నుంచి ఆలుగడ్డ విత్తనం కొనుగోలు చేసుకుంటున్నారు. ఉత్తర ప్రదేశ్ రాష్ట్రంలోని ఆగ్రా నుంచి పలువురు వ్యాపారులు ఈ విత్తనాలను తీసుకొచ్చి స్థానికంగా విక్రయిస్తున్నారు. క్వింటాలు విత్తనం ధర రూ.2 వేలు నుంచి రూ.2,600 కు అమ్ముతున్నారు. రైతులు తప్పనిసరి పరిస్థితుల్లో వ్యాపారులపైనే ఆధారపడాల్సి వస్తోంది. ప్రభుత్వం స్థానికంగా కోల్డ్ స్టోరేజీలను ఏర్పాటు చేసినట్లయితే విత్తనం అందుబాటులో ఉండే అవకాశం ఉందని రైతులు అంటున్నారు. పది ఎకరాల్లో సాగు వారం రోజుల్లో ఆలుగడ్డ పంట సాగు చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నా. వర్షాలు తగ్గిపోవడంతో దుక్కులు దున్నే పనులను ఆరంభించా. సుమారు 10 ఎకరాల్లో సాగుచేస్తున్నా. మార్కెట్లో మంచి ధర లభించే అవకాశం ఉంది. అందుకే ముందస్తు వైపు ఆసక్తి చూపుతున్నా. ప్రస్తుతం వాతావరణం ముందస్తు సాగుకు అనుకూలంగా ఉంది. –ఎన్.అంజిరెడ్డి, రైతు, పైడిగుమ్మల్ దుక్కులు సిద్ధం చేసుకుంటున్న.. ఆలుగడ్డ పంట సాగుకు దుక్కి దున్నే పనులు ప్రారంభించా. ప్రస్తుతం వర్షాలు ఆగిపోవడంతో రైతులంతా ఈ సాగు కోసం ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. సుమారు మూడు ఎకరాల్లో పంటను వేసుకునేందుకు నిర్ణయం తీసుకున్నాను. –కె.స్వరూప్‌రెడ్డి, రైతు, కోహీర్ -
ఆలుగడ్డల సాగులో నూతన విధానం
-
ఆ పంట సాగు చేస్తే లాభాలే లాభాలు.. ఎకరాకు రూ.లక్ష ఆదాయం..
పుట్టపర్తి అర్బన్(శ్రీసత్యసాయి జిల్లా): ఆలుగడ్డల సాగు ఈ ఏడాది రైతులను లక్షాధికారులను చేస్తోంది. సాధారణంగా అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకూ సాగు చేసే ఆలుగడ్డ మంచి దిగుబడితో పాటు అధిక ధరలు పలుకుతుంటాయి. అయితే పంట సాగుకు ఖర్చు ఎక్కువే అయినా.. దిగుబడి ఆశాజనకంగా ఉండడంతో రైతుల ఇంట సిరుల వర్షం కురుస్తోంది. ఎకరా విస్తీర్ణంలో రూ.లక్షకు పైగా ఆదాయం వస్తుండడంతో అన్నదాతల్లో హర్షం వ్యక్తమవుతోంది. కలిసొచ్చిన వాతావరణం గత మూడేళ్లుగా విస్తారంగా వర్షాలు కురవడంతో భూగర్భ జలాలు గణనీయంగా పెరిగాయి. దీనికి తోడు ఖరీఫ్, రబీ సీజన్లలో వాతావరణ పరిస్థితులూ బాగా కలిసొచ్చాయి. దీంతో జిల్లా వ్యాప్తంగా 23,104 ఎకరాల్లో వివిధ రకాల ఆకు కూరలు, కూరగాయలను రైతులు సాగు చేశారు. అత్యధికంగా 18,872 ఎకరాల్లో టమాట సాగు చేయగా.. 2,076 ఎకరాల్లో పచ్చి మిరప, 919 ఎకరాల్లో వంకాయ, 450 ఎకరాలో ఆలుగడ్డ, 368 ఎకరాల్లో బెండ, 241 ఎకరాల్లో చిక్కుడు, 94 ఎకరాల్లో క్యాబేజీ పంటలను సాగు చేశారు. దిగుబడులు ఆశాజనకంగా ఉండడంతో పంట ఉత్పత్తులను స్థానిక వారపు మార్కెట్లతో పాటు హిందూపురం, కదిరి, ధర్మవరం, పుట్టపర్తి, కొత్తచెరువు తదితర పట్టణ ప్రాంతాల్లోనే దినసరి మార్కెట్లు, మదనపల్లి, చెన్నేతో పాటు కర్ణాటకలోని బాగేపల్లి, చింతామణి, బెంగళూరు ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారు. ధర అధికంగా ఉండడంతో తోటల వద్దకే వ్యాపారులు వచ్చి పంట ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్నారు. ఎకరాకు 150 బస్తాలు సీజన్‌ను బట్టి ఆలు విత్తన గడ్డ 50 కిలోల బస్తా రూ.2,500 నుంచి రూ.3వేల వరకు ధర పలుకుతోంది. భూమిని దుక్కి చేయడం, గడ్డి తొలగించడం, విత్తనం పెట్టడం, డ్రిప్ ద్వారా ఎరువులు, సాల్లు తీయడం, ఎరువులు పంట చివరన దున్ని గడ్డలను తొలగించడం వంటి పనులు చేపట్టాల్సి ఉంటుంది. ఈ మొత్తం ప్రక్రియకు ఎకరా విస్తీర్ణంలో దాదాపు రూ.లక్ష వరకు రైతులు వ్యయం చేశారు. పంట దిగుబడి ఆశాజనకంగా ఉంది. దీంతో ఇతర ప్రాంతాలకు చెందిన వ్యాపారులు తోటల వద్దకు చేరుకుని పంట కొనుగోళ్లు చేపట్టారు. 40 కిలోల ఆలుగడ్డల బస్తా రూ.1,400తో అమ్ముడు పోతోంది. ఎకరా విస్తీర్ణంలో 150 బస్తాల వరకూ దిగుబడి వచ్చింది. ప్రస్తుత ధరను పోల్చుకుంటే 150 బస్తాలకు రూ.2.10 లక్షలు చేతికి అందుతున్నాయని, పెట్టుబడులు పోను రూ.1.10 లక్షలు మిగులు ఆదాయం ఉంటోందని పెడపల్లి రైతులు జనార్దనరెడ్డి, రోషన్, శివప్ప, సుబ్బరాయనిపల్లి చండ్రాయుడు తెలిపారు. చదవండి: వీర్లకొండ ఎక్కేద్దాం రండి! -
సిరులు కురిపించిన చిలగడదుంప
పెరవలి: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దుంపల సాగు చేపట్టిన రైతులకు కాసుల వర్షం కురిసింది. గత కొన్నేళ్లుగా నష్టాలు చవిచూస్తున్న రైతులు ఈ ఏడాది తమ కష్టాలు తీరేలా దిగుబడి, గిట్టుబాటు ధర లబించటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంద, చిలగడ దుంప పంటపై రైతులు కూలీలు, వ్యాపారులు, వాహనదారులు, సంచుల వ్యాపారులు ఇలా 12 వేల మంది ఆధారపడి ఉన్నారు. పశ్చిమలో సాగు ఏంతంటే.. పశ్చిమ గోదావరి జిల్లాలో 900 హెక్టార్లలో కంద సాగు చేస్తుండగా, చిలగడదుంప సాగు 150 ఎకరాల్లో ఉంది. ఈ పంటలు గతంలో 1000 హెక్టార్లు ఉండగా.. నాలుగేళ్ళుగా వరుస నష్టాలు వస్తుండటంతో రైతులు సాగు విస్తీర్ణం తగ్గించారని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కంద సాగు పెరవలి, ఉండ్రాజవరం, నిడద వోలు, కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, నల్లజర్ల, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, పోలవరం మండలాల్లో సాగు చేస్తున్నారు. చిలకడదుంప, పెనుగొండ, ఇరవగవరం, ఆచంట, పెరవలి, కొవ్వూరు, నిడదవోలు మండలాల్లో సాగుచేస్తున్నారు. ధరలు ఇలా కంద ధరలు ఊహించని విధంగా ఈ ఏడాది పుట్టి రూ.3400 వద్ద ప్రారంభమై ప్రస్తుతం రూ.2000 వేల వద్ద స్థిరంగా ఉంది. మార్కెట్లో ధర ఎలా ఉన్నా ఈ ఏడాది ఊరికలు బాగా జరగటంతో రైతులు ఆనందంగా ఉన్నారు. ఎకరానికి 80 నుంచి 100 పుట్టుల దిగుబడి వచ్చి 8 ఏళ్ళు అయ్యిందని.. అలాంటి ఊరికలు ఇప్పుడు వచ్చాయంటున్నారు. కంద సాగు చేసే రైతులు లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎకరం కంద వేయాలంటే విత్తనానికి రూ.92 వేలు, కంద నాటడానికి, బోదెలు తవ్వడానికి, చచ్చు ఎక్కవేయడానికి కూలీలకు 20 వేలు అవుతుంది. ఎరువులు, పురుగుమందులకు రూ.15వేలు అవుతుంది. మొత్తం ఖర్చు రూ.1.27 లక్షలు అవు తు ంది. ఊరికల ఆధారంగా రైతుకు ఎకరానికి రూ. 30 వేల నుంచి రూ.60 వేల మిగులు వస్తుంది. సిరులు కురిపిస్తున్న చిలకడదుంప చిలకడదుంప సాగు కాలం కేవలం 4 నెలలు మాత్రమే. ఈ పంట లాభాలు కురిపించడంతో రైతులు సాగుకు మక్కువ చూపుతున్నారు. తెగుళ్ళు ఆశిస్తాయనే భయం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో పంట పాడైపోతుందని ఆందోళన అవసరం లేదు. కేవలం ఎరువులు అందించి నీరు సక్రమంగా పెడితే నాలుగు నెలల్లో రూపాయికి రెండు రూపాయలు మిగిలే పంట ఇది. చిలకడదుంప సాగు చేపట్టిన రైతులు సాగుచేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా కేవలం తవ్వకం వల్లే ఎక్కువ పెట్టుబడి అవుతుదంటున్నారు. ఎకరా పంట సాగుచేయాలంటే రూ.15 వేలు అవుతుంది. 4 నెలల్లో ఎకరానికి పెట్టుబడి పోను రూ.10 వేల ఆదాయం వస్తుంది. తీగ జాతికి చెందిన ఈ పంట కాడను తీసుకుని ముక్కలు చేసి వరినాట్లు వేసినట్లుగా చేలో నాటుకుంటూ వెళ్తే వారం రోజుల్లో నాటిన కాడ నుండి ఆకులు వచ్చి తీగ చేనంతా అల్లుకుంటుంది. పంట తయారీకి రూ.15వేలు పెట్టుబడి.. తవ్వడానికి, మార్కెట్‌కు తరలించడానికి మరో రూ. 15వేలు ఖర్చు ఖర్చవుతుంది. దిగుబడి ఎకరానికి 6 నుండి 8 టన్నులు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో దుంపల నాణ్యతను బట్టి టన్ను రూ.10 వేల నుంచి రూ.12 వేలకు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఏజెన్సీ, డెల్టాలో గోదావరి తీర ప్రాంతంలోను, తూర్పుగోదావరి జిల్లాలో ఆత్రేయపురం, రావులపాలెం మండలాల్లో ఎక్కువగా ఈ పంటను సాగుచేస్తున్నారు. ఈ ఏడాది ఊహించని దిగుబడి కంద ఈ ఏడాది వచ్చినంత దిగుబడి ఎన్నడూ రాలేదు. గత నాలుగేళ్ళుగా నష్టాలు చవిచూశాం. ఈ ఏడాది ఊహించని రీతిలో గిట్టు బాటు ధర ఉండడం, దిగుబడి పెరగడంతో లాభాలు వచ్చాయి. –సంఖు ప్రభాకరరావు, కంద రైతు, మల్లేశ్వరం తెగుళ్ల బెడద తక్కువ చిలగడదుంప సాగుచేయడానికి ముందుగా బలమైన చేలను ఎంపిక చేసుకోవాలి. ఎర్రనేలలు, ఇసుకనేలలు, నల్లరేగడి నేలలు అనువుగా ఉంటాయి. ఎకరానికి రూ.30 వేలు పెట్టుబడి పెడితే సరిపోతుంది. నాలుగు నెలల్లో పంట చేతికి అందుతుంది. సాగునీరు సక్రమంగా అందించాలి. తెగుళ్ల బెడద తక్కువగా ఉంటుంది. – తోట మల్లేశ్వరరావు రైతు మల్లేశ్వరం ఈ ఏడాది దుంప రైతుకు లాభాలు ఈ ఏడాది రైతులకు కలిసివచ్చింది. కంద దిగుబడి వచ్చే సమయంలో కరోనాతో లాక్డౌన్ వల్ల ఎక్కడి సరకు అక్కడే ఉండిపోయింది. దీంతో ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు అనుమతులు ఇవ్వటంతో కంద రైతులకు మంచి ధర లబించింది. చిలకడదుంప సాగులో రూపాయికి రెండు రూపాయల ఆదాయం వస్తుంది. – ఏ దుర్గేష్, ఉద్యానవన సహాయ సంచాలకులు, తణుకు -
శీతకాలం.. ఆలు సాగుకు అనుకూలం
బాల్కొండ : చల్లని వాతావరణం ఆలుగడ్డ సాగుకు అనుకూలం అని వ్యవసాయ శాఖ అధికారి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బంగాళదుంప పెరుగుదలకు వాతావరణంలో తక్కువ ఉష్ణోగ్రత దోహదపడుతుందన్నారు. జిల్లాలో ఆలు సాగు నామమాత్రమే అయినా.. బాల్కొండ ప్రాం తంలో ఈ పంట సాగుకు పలువురు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలుగడ్డ సాగు గురించి వ్యవసాయ అధికారి పలు సూచనలు చేశారు. పంట కాలం.. ఏ నేల అనుకూలం బంగాళదుంప పంట సాగుకు నీటి వసతి గల ఇసుక, ఎర్రగరప నేలలు అనుకూలం. బరువైన నేలల్లో ఈ పంట సాగు చేయవద్దు. అక్టోబర్ రెండో వారం నుం చి నవంబర్ మొదటి వారం వరకు ఆలూ సాగు చేయవచ్చు. ఇది వంద రోజుల్లో చేతికి వచ్చే పంట. సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటిస్తే ఎకరానికి పదినుంచి పది హేను టన్నుల దిగుబడి వచ్చే అవకాశాలుంటాయి. నేల తయారీ నేలను నాలుగు నుంచి ఐదు సార్లు దున్నాలి. చివరి దుక్కిలో ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల యూరియా, 150 కిలోల సూపర్ ఫాస్పెట్, 30 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ వేయాలి. తర్వాత భూమిని చదును చేసుకోవాలి. బోదెలు చేసుకొని ఆలుగడ్డలు నాటుకోవాలి. విత్తన ఎంపిక 30 నుంచి 40 గ్రాముల బరువుండి, రెండు నుంచి మూడు కళ్లున్న విత్తన దుంపలను ఎన్నుకోవాలి. ఎకరానికి ఆరు క్వింటాళ్ల వరకు విత్తనాలు అవసరం అవుతాయి. భూమి, వాతావరణాన్ని బట్టి నీటి తడులు అందించాలి. సాధారణంగా వారానికి ఒక తడి సరిపోతుంది. దుంపలు ఏర్పడే సమయంలో నాలుగైదు రోజులకు ఒక తడి అందించాల్సి ఉంటుంది. కలుపు పెరగకుండా చూసుకోవాలి. ఎరువులు ఆలుగడ్డలను విత్తిన 30 రోజుల తర్వాత 40 కిలోల యూరియా, 50 రోజులకు మరో 20 కిలోల యూరియా, 30 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ చల్లుకోవాలి. సస్యరక్షణ బంగాళదుంప పంటను సాధారణంగా దుంప తొలిచే పురుగులు ఆశించి నష్టం చేస్తాయి. రసం పీల్చే పురుగు, పొగాకు లద్దె పురుగు, తెల్లనల్లి కూడా ఆశించే అవకాశాలుంటాయి. ఆకుమాడు తెగులు, మొజాయిక్ వైరస్లతోనూ నష్టం వాటిల్లుతుంది. వ్యవసాయ అధికారులను సంప్రదించి వీటి నివారణ చర్యలు తీసుకోవాలి. పంట మార్పిడి చేయడం వల్ల భూసారం పెరగడంతోపాటు పంటలకు తెగుళ్ల బాధ తగ్గుతాయి. అభివృద్ధి చెందుతున్న దుంపలపై సూర్యరశ్మి పడితే దుంప ఆకుపచ్చ రంగుకు మారే అవకాశాలుంటాయి. అందువల్ల విత్తిన 30 రోజుల తర్వాత నుంచి దుంపలపైకి మట్టిని ఎగదోయాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేయాలి.