బాల్కొండ : చల్లని వాతావరణం ఆలుగడ్డ సాగుకు అనుకూలం అని వ్యవసాయ శాఖ అధికారి మహేందర్‌రెడ్డి పేర్కొన్నారు. బంగాళదుంప పెరుగుదలకు వాతావరణంలో తక్కువ ఉష్ణోగ్రత దోహదపడుతుందన్నారు. జిల్లాలో ఆలు సాగు నామమాత్రమే అయినా.. బాల్కొండ ప్రాం తంలో ఈ పంట సాగుకు పలువురు రైతులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆలుగడ్డ సాగు గురించి వ్యవసాయ అధికారి పలు సూచనలు చేశారు.
పంట కాలం.. ఏ నేల అనుకూలం
బంగాళదుంప పంట సాగుకు నీటి వసతి గల ఇసుక, ఎర్రగరప నేలలు అనుకూలం. బరువైన నేలల్లో ఈ పంట సాగు చేయవద్దు. అక్టోబర్ రెండో వారం నుం చి నవంబర్ మొదటి వారం వరకు ఆలూ సాగు చేయవచ్చు. ఇది వంద రోజుల్లో చేతికి వచ్చే పంట. సమగ్ర సస్య రక్షణ చర్యలు పాటిస్తే ఎకరానికి పదినుంచి పది హేను టన్నుల దిగుబడి వచ్చే అవకాశాలుంటాయి.
నేల తయారీ
నేలను నాలుగు నుంచి ఐదు సార్లు దున్నాలి. చివరి దుక్కిలో ఎకరాకు 10 నుంచి 12 టన్నుల పశువుల ఎరువు, 40 కిలోల యూరియా, 150 కిలోల సూపర్ ఫాస్పెట్, 30 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ వేయాలి. తర్వాత భూమిని చదును చేసుకోవాలి. బోదెలు చేసుకొని ఆలుగడ్డలు నాటుకోవాలి.
విత్తన ఎంపిక
30 నుంచి 40 గ్రాముల బరువుండి, రెండు నుంచి మూడు కళ్లున్న విత్తన దుంపలను ఎన్నుకోవాలి. ఎకరానికి ఆరు క్వింటాళ్ల వరకు విత్తనాలు అవసరం అవుతాయి. భూమి, వాతావరణాన్ని బట్టి నీటి తడులు అందించాలి. సాధారణంగా వారానికి ఒక తడి సరిపోతుంది. దుంపలు ఏర్పడే సమయంలో నాలుగైదు రోజులకు ఒక తడి అందించాల్సి ఉంటుంది. కలుపు పెరగకుండా చూసుకోవాలి.
ఎరువులు
ఆలుగడ్డలను విత్తిన 30 రోజుల తర్వాత 40 కిలోల యూరియా, 50 రోజులకు మరో 20 కిలోల యూరియా, 30 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ చల్లుకోవాలి.
సస్యరక్షణ
బంగాళదుంప పంటను సాధారణంగా దుంప తొలిచే పురుగులు ఆశించి నష్టం చేస్తాయి. రసం పీల్చే పురుగు, పొగాకు లద్దె పురుగు, తెల్లనల్లి కూడా ఆశించే అవకాశాలుంటాయి. ఆకుమాడు తెగులు, మొజాయిక్ వైరస్‌లతోనూ నష్టం వాటిల్లుతుంది. వ్యవసాయ అధికారులను సంప్రదించి వీటి నివారణ చర్యలు తీసుకోవాలి. పంట మార్పిడి చేయడం వల్ల భూసారం పెరగడంతోపాటు పంటలకు తెగుళ్ల బాధ తగ్గుతాయి.
అభివృద్ధి చెందుతున్న దుంపలపై సూర్యరశ్మి పడితే దుంప ఆకుపచ్చ రంగుకు మారే అవకాశాలుంటాయి. అందువల్ల విత్తిన 30 రోజుల తర్వాత నుంచి దుంపలపైకి మట్టిని ఎగదోయాలి. ఇలా మూడు నాలుగు సార్లు చేయాలి.
శీతకాలం.. ఆలు సాగుకు అనుకూలం
Published Wed, Oct 1 2014 3:07 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM
Advertisement