చలికాలంలో పెంపుడు జంతువులకు కేర్ అవసరం
జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న నిపుణులు.
పెంపుడు జంతువులు.. మన జీవన శైలిలో ఓ భాగం. అయితే ఆ మూగ జీవాలను ప్రాణప్రదంగా భావించేవారు కోకొల్లలు. కంటికి రెప్పలా కాస్తూ.. విడదీయరాని మైత్రి బంధాన్ని కొనసాగించే వారు మరికొందరు. మనుషుల్లానే చలికాలంలో వాటికీ రక్షణ అవసరమే.. అందుకే జంతు ప్రేమికులు చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాటిపట్ల జాగ్రత్తగా మసలుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనుషుల మాదిరిగానే వాటికీ సీజనల్ వ్యాధులు వస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వాటి ఆరోగ్యానికీ ఢోకా ఉండదని చెబుతున్నారు కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా, తెలంగాణలోని సనత్ నగర్‌కి చెందిన కెనైన్ అసోసియేషన్ కార్యదర్శి విశాల్ సూదం.
మనుషులకే కాదు.. పెంపుడు జంతువులకూ చలికాలంలో వేడి పుట్టించే వివిధ రకాల యాక్సెసరీస్ అందుబాటులోకి వచ్చాయి. కుక్కలకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు వాష్ చేసుకునేందుకు వీలుగా ఫ్లాట్ బెడ్, రౌండ్ బెడ్లు దొరుకుతున్నాయి. కుక్కలు, పప్పీస్ చలి తీవ్రతను వీటి ద్వారా అరికట్టవచ్చు.
దీంతోపాటు ప్రత్యేక స్వెట్టర్లు జంతువులకు రక్షణ నిలుస్తున్నాయి. అన్ని సైజుల కుక్కలకూ అనువుగా ఉండేలా వివిధ మోడళ్లతో ఊలుతో తయారుచేసిన స్వెట్టర్లు లభిస్తున్నాయి. ఇవి కూడా వాటి సైజు, నాణ్యత ఆధారంగా వివిధ ధరల్లో లభిస్తున్నాయి. అలాగే. కాళ్లకు రక్షణ కలిగించే రీతిలో శీతాకాలంలో షూష్ అందుబాటులో ఉన్నాయి.
శీతాకాలంలో మంచు కారణంగా గాలిలో తేమ శాతం కారణంగా గాలి నాణ్యత తక్కువగా ఉంటుంది. దీంతో పెంపుడు జంతువులు వాయు కాలుష్యం బారిన పడి శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే బయటకు తీసుకెళ్లకపోవడమే ఉత్తమం. పెట్స్ ఆరోగ్యంగా ఉండడానికి రెగ్యులర్‌గా గ్రూమింగ్ చేయడం అవసరం. నీళ్లు తాగించేందుకు ఉపయోగించే గిన్నెలు, పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి.
సీజనల్ వ్యాధులు..
శీతాకాలలో వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువ. చలి కాలంలో ఫ్లీస్, టిక్, మైట్స్ (గోమర్లు) అనే బాహ్య పరాన్నజీవులు కుక్కల చర్మంపై చేరతాయి. దీంతో జుట్టు రాలిపోవడం, టిక్ ఫీవర్ రావడం, బ్లడ్ లాస్ కావడం, దురదలు కారణంగా కుక్కలు వాటంతట అవే శరీరాన్ని కొరుక్కుంటాయి.
గాలి సంక్రమణ ద్వారా ఒక కుక్క నుంచి మరో కుక్కకు పాకుతుంటాయి. అందుకోసం ముందుగానే నిపుణుల సలహా మేరకు బెల్టు టైపులో ఉండే యాంటీ టిక్ కాలర్ ఏర్పాటు చేయడం రక్షణగా ఉంటుంది. అలాగే తరచూ యాంటీ రాబీస్, సెవన్ ఇన్ వన్ వంటి టీకాలను వేయించాలి. షాంపో, పౌడర్, స్ప్రేస్‌తో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే ఆరోగ్యకరంగా ఉంటాయి.
ప్రత్యేక శ్రద్ధ అవసరం..
శీతాకాలంలో మంచుకురిసే అవకాశం ఉన్నందున సాధ్యమైంత వరకూ పెంపుడు జంతువులకు ప్రత్యేక షెల్టర్ గానీ, ఇంట్లో వెచ్చని ప్రదేశాన్ని గానీ కేటాయిస్తే బాగుంటుంది. ముఖ్యంగా పప్పీస్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వాటి దినచర్యలో ఏవైనా మార్పులు వస్తే.. వైద్యుల సలహా పాలించాలి.
– విశాల్ సూదం, కెనైన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి
(చదవండి: వినదగ్గదే శ్రీమతి చెబుతుంది)
Comments
Please login to add a commentAdd a comment