dogs hotel
-
పెట్ లవర్స్.. బీ కేర్‌ఫుల్..!
పెంపుడు జంతువులు.. మన జీవన శైలిలో ఓ భాగం. అయితే ఆ మూగ జీవాలను ప్రాణప్రదంగా భావించేవారు కోకొల్లలు. కంటికి రెప్పలా కాస్తూ.. విడదీయరాని మైత్రి బంధాన్ని కొనసాగించే వారు మరికొందరు. మనుషుల్లానే చలికాలంలో వాటికీ రక్షణ అవసరమే.. అందుకే జంతు ప్రేమికులు చలి తీవ్రతను దృష్టిలో పెట్టుకుని వాటిపట్ల జాగ్రత్తగా మసలుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మనుషుల మాదిరిగానే వాటికీ సీజనల్ వ్యాధులు వస్తాయి. సరైన జాగ్రత్తలు తీసుకుంటే వాటి ఆరోగ్యానికీ ఢోకా ఉండదని చెబుతున్నారు కెన్నెల్ క్లబ్ ఆఫ్ ఇండియా, తెలంగాణలోని సనత్ నగర్‌కి చెందిన కెనైన్ అసోసియేషన్ కార్యదర్శి విశాల్ సూదం. మనుషులకే కాదు.. పెంపుడు జంతువులకూ చలికాలంలో వేడి పుట్టించే వివిధ రకాల యాక్సెసరీస్ అందుబాటులోకి వచ్చాయి. కుక్కలకు సౌకర్యవంతంగా ఉండడంతో పాటు ఎప్పటికప్పుడు వాష్ చేసుకునేందుకు వీలుగా ఫ్లాట్ బెడ్, రౌండ్ బెడ్లు దొరుకుతున్నాయి. కుక్కలు, పప్పీస్ చలి తీవ్రతను వీటి ద్వారా అరికట్టవచ్చు. దీంతోపాటు ప్రత్యేక స్వెట్టర్లు జంతువులకు రక్షణ నిలుస్తున్నాయి. అన్ని సైజుల కుక్కలకూ అనువుగా ఉండేలా వివిధ మోడళ్లతో ఊలుతో తయారుచేసిన స్వెట్టర్లు లభిస్తున్నాయి. ఇవి కూడా వాటి సైజు, నాణ్యత ఆధారంగా వివిధ ధరల్లో లభిస్తున్నాయి. అలాగే. కాళ్లకు రక్షణ కలిగించే రీతిలో శీతాకాలంలో షూష్ అందుబాటులో ఉన్నాయి.శీతాకాలంలో మంచు కారణంగా గాలిలో తేమ శాతం కారణంగా గాలి నాణ్యత తక్కువగా ఉంటుంది. దీంతో పెంపుడు జంతువులు వాయు కాలుష్యం బారిన పడి శ్వాసకోశ వ్యాధులకు గురయ్యే ప్రమాదం ఉంది. అందుకే బయటకు తీసుకెళ్లకపోవడమే ఉత్తమం. పెట్స్ ఆరోగ్యంగా ఉండడానికి రెగ్యులర్‌గా గ్రూమింగ్ చేయడం అవసరం. నీళ్లు తాగించేందుకు ఉపయోగించే గిన్నెలు, పాత్రలను ఎప్పటికప్పుడు శుభ్రం చేసుకోవాలి. సీజనల్ వ్యాధులు.. శీతాకాలలో వ్యాధులు సంక్రమించే అవకాశం ఎక్కువ. చలి కాలంలో ఫ్లీస్, టిక్, మైట్స్ (గోమర్లు) అనే బాహ్య పరాన్నజీవులు కుక్కల చర్మంపై చేరతాయి. దీంతో జుట్టు రాలిపోవడం, టిక్ ఫీవర్ రావడం, బ్లడ్ లాస్ కావడం, దురదలు కారణంగా కుక్కలు వాటంతట అవే శరీరాన్ని కొరుక్కుంటాయి. గాలి సంక్రమణ ద్వారా ఒక కుక్క నుంచి మరో కుక్కకు పాకుతుంటాయి. అందుకోసం ముందుగానే నిపుణుల సలహా మేరకు బెల్టు టైపులో ఉండే యాంటీ టిక్ కాలర్ ఏర్పాటు చేయడం రక్షణగా ఉంటుంది. అలాగే తరచూ యాంటీ రాబీస్, సెవన్ ఇన్ వన్ వంటి టీకాలను వేయించాలి. షాంపో, పౌడర్, స్ప్రేస్తో ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తే ఆరోగ్యకరంగా ఉంటాయి. ప్రత్యేక శ్రద్ధ అవసరం..శీతాకాలంలో మంచుకురిసే అవకాశం ఉన్నందున సాధ్యమైంత వరకూ పెంపుడు జంతువులకు ప్రత్యేక షెల్టర్ గానీ, ఇంట్లో వెచ్చని ప్రదేశాన్ని గానీ కేటాయిస్తే బాగుంటుంది. ముఖ్యంగా పప్పీస్ విషయంలో జాగ్రత్తలు తప్పనిసరి. వాటి దినచర్యలో ఏవైనా మార్పులు వస్తే.. వైద్యుల సలహా పాలించాలి. – విశాల్ సూదం, కెనైన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి (చదవండి: వినదగ్గదే శ్రీమతి చెబుతుంది) -
రెండేళ్లలో రూ.ఆరు వేలకోట్లకు చేరే మార్కెట్
ప్రపంచవ్యాప్తంగా పెంపుడు జంతువుల సంరక్షణ మార్కెట్ గణనీయంగా వృద్ధి చెందుతోంది. ప్రధానంగా చాలా ఇళ్లల్లో కుక్కలు పెంచుతుంటారు. పెట్‌డాగ్స్ కొనుగోలు చేసినప్పటి నుంచి వాటి నిర్వహణ, ఫుడ్, వాటికి వేసే బట్టలు, వాడే క్యాస్టుమ్స్, వైద్యం.. ఇలా పెట్ గ్రూమింగ్ నుంచి పెట్ ఫుడ్ సేల్స్ వరకు ప్రపంచవ్యాప్తంగా కోట్ల వ్యాపారం సాగుతోంది. వచ్చే రెండేళ్లలో పెట్‌డాగ్స్ ద్వారా దేశంలో దాదాపు రూ.ఆరు వేలకోట్ల వ్యాపారం అభివృద్ధి చెందుతుందని నిపుణులు అంచనా వేస్తున్నారు.మార్కెట్‌కు అవకాశమున్న కొన్ని విభాగాలుపెంపుడు జంతువులకు స్నానం చేయించడం, జుట్టు, గోళ్లను కత్తిరించడం, చెవులు శుభ్రం చేయడం వంటి సేవలు పెట్‌గ్రూమింగ్ సర్వీస్ కిందకు వస్తాయి.పెట్ సిట్టింగ్, డాగ్ వాకింగ్ సర్వీస్‌లో భాగంగా వాటి యజమానులు దూరంగా ఉన్నప్పుడు పెంపుడు జంతువులకు ఆహారం ఇవ్వడం, వాకింగ్ తీసుకెళ్లడం, ఆడించడం వంటివి ఉంటాయి.కొందరు ఆన్లైన్లో లేదా స్టోర్‌లో పెట్ ఫుడ్‌ను విక్రయిస్తున్నారు.స్టూడియోలో లేదా మంచి లొకేషన్లో వాటి యజమానుల కోసం పెంపుడు జంతువుల చిత్రాలను తీయడం కూడా వ్యాపారంగా మలుచుకుంటున్నారు.యజమానులు, ఇంటికి ఇతరులతో విధేయతతో ఎలా ఉండాలో కూడా పెట్స్‌కు శిక్షణ ఇస్తూ డబ్బు సంపాదిస్తున్నారు.యజమానులు రోజంతా పనిలో నిమగ్నమవుతుండడంతో వాటిని సంరక్షించే సమయం దొరకదు. అందుకు వీలుగా పెంపుడు జంతువుల డేకేర్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు.ఇదీ చదవండి: ఈయూ కోర్టులో గూగుల్‌కు చుక్కెదురు!దేశవ్యాప్తంగా జరిగిన కొన్ని నివేదికల ప్రకారం.. ఇండియాలో ఏటా ఆరు లక్షల పెంపుడు జంతువులను దత్తత తీసుకుంటున్నారు. వాటిలో ఎక్కువ భాగం కుక్కలు ఉన్నాయి. దేశంలో పెంపుడు జంతువుల మార్కెట్ రూ.రెండు వేలకోట్లుకు పైగా ఉంది. పెట్ ఫుడ్ మార్కెట్ ఏటా 14% వృద్ధి చెందుతోంది. 2026 నాటికి దాదాపు రూ.ఆరు వేలకోట్లకు చేరుకుంటుందని అంచనా. -
కుక్కలకూ ఉంది ఓ హాస్టల్ !
కొందరు కుక్కలను చాలా ఇష్టంగా పెంచుకుంటారు. కానీ వారు ఎప్పుడైనా ఊళ్లకు, టూర్లకు వెళ్లాల్సి వస్తే వెంట తీసుకెళ్లలేరు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ఓ యువకుడు సరికొత్త వ్యాపారం ప్రారంభించాడు. ఎవ్వరైనా ఊళ్లకు వెళితే వాటి ఆలనాపాలనా మేము చూస్తామంటూ కుక్కలకు హాస్టల్ ఏర్పాటు చేశాడు. కర్నూలు(హాస్పిటల్): గోనెగండ్లకు చెందిన వి. రవిప్రకాష్ కర్నూలులో బీఎస్సీ బయోకెమిస్ట్రీ వరకు చదువుకున్నాడు. అతని తండ్రి చిన్న ఓబులేసు వ్యవసాయం చేస్తున్నాడు. తల్లి నాగరత్నమ్మ గృహిణి, తమ్ముడు బాలు డిగ్రీ పూర్తి చేసి తండ్రికి సాయంగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇద్దరు అక్కా చెల్లెళ్లకు వివాహమైంది. రవిప్రకాష్ 2016లో డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. అతను చదివిన కళాశాలలో చేసిన డిగ్రీ కారణంగా అతనికి మంచి కంపెనీలో ఉద్యోగం లభించేది. కానీ అతనికి చిన్నతనం నుంచి కుక్కలపై ఉన్న ఆసక్తి వ్యాపారంపై దారిమళ్లించింది. చిన్నతనం నుంచి కుక్కల జాతులు, వాటి రకాలు, ఏఏ జాతులు ఎలా ఉంటాయి, ఎలా వ్యవహరిస్తాయి, వాటి ఆహారం, అభిరుచులు, వాటితో ఎలా మెలగాలి, ఎలా మచ్చిక చేసుకోవాలనే విషయాలపై బాగా అధ్యయనం చేశాడు. కుక్కలతోనే తన జీవితమని,తాను బాగుపడ్డా వాటితోనే అని రవిప్రకాష్ నిర్ణయించుకున్నాడు. కుక్కలకూ ప్రత్యేకంగా హాస్టల్ సాధారణంగా చదువుకునే విద్యార్థులకు హాస్టళ్లు ఉంటాయి. అలాగే వర్కింగ్ ఉమెన్, మెన్స్‌కు హాస్టళ్లు ఉంటాయి. నిర్ణయించిన మేర ఫీజు చెల్లిస్తే వాటిలో ఫుడ్, బెడ్డు సౌకర్యం కల్పిస్తారు. అంతేకాదు సేఫ్టీ కూడా ఉంటుంది. ఇదే తరహాలో కుక్కల కోసం హాస్టల్ ఏర్పాటు చేయాలని భావించాడు రవిప్రకాష్. 2017లో కర్నూలు నగర శివారులోని సల్కాపురం వద్ద అర ఎకరా స్థలంలో 11 షెడ్లతో కుక్కలకు ప్రత్యేక వసతులు కల్పించాడు. కొన్ని రకాల కుక్కలు ఎక్కువ ఎండవేడిమి తట్టుకోలేవు. అలాంటి వాటి కోసం కూలర్లు కూడా ఏర్పాటు చేశాడు. వారి వద్ద వదిలిన కుక్కల ఆలనా పాలనా చూసుకునేందుకు తనతో పాటు మరో ఇద్దరిని ఉద్యోగంలో ఉంచుకున్నాడు. ఆ కుక్కలకు స్నానం చేయించడం, హెయిర్ గ్రూమింగ్(వెంట్రుకలు కత్తిరించడం) చేయడం, వాటికి సమయానికి ఆహారాన్ని అందించడం ఏదైనా అనారోగ్యం కలిగితే వైద్యుల వద్దకు తీసుకెళ్లడం చేస్తుంటారు. ఎవ్వరికై నా ఫలానా జాతి కుక్క కావాలంటే దానిని తెప్పించి ఇవ్వడమే గాక వాటిని ఎలా పెంచాలో కూడా అవగాహన కల్పిస్తున్నారు. ఎలా పెంచాలో అవగాహన కల్పించారు మా వద్ద ఇండియన్ స్పిట్ జాతి కుక్క ఉంది. 10 ఏళ్లుగా దానిని మేము పెంచుకుంటున్నాము. మేము ఊళ్లకు వెళ్లే సమయంలో చాలా సార్లు డాగ్ హాస్టల్లో వదిలివెళ్లేవాళ్లం. అక్కడ వారు బాగా చూసుకునేవారు. ఏదైనా అనుమానం వస్తే మాకు ఫోన్ చేసి తెలుసుకునేవారు. దానికి ఎలాంటి ఆహారం తినిపిస్తే బాగుంటుంది, దానితో ఎలా వ్యవహరించాలి, దాని లక్షణాలు ఏంటి తదితరవి వివరించి చెప్పేవారు. కుక్కల గురించి మాకు తెలియని విషయాలు ఎన్నో వారి వద్ద నుంచి నేర్చుకున్నాము. –ప్రదీప్, కర్నూలు -
కుక్కల కోసం ప్రత్యేక రెస్టారెంట్.. ఎక్కడో తెలుసా?
శునకాలు మనుషుల జీవితాల్లో భాగమైపోయాయి. చాలా ఇళ్లలో అవి కూడా సభ్యులుగా ఉంటున్నాయి. వివిధ రకాల జాతుల శునకాలను వేలు.. లక్షల రూపాయలు పెట్టి మరీ కొని ప్రేమగా పెంచుకుంటున్నారు. వాటి పోషణ, సంరక్షణ కోసం ఎంత ఖర్చయినా వెనకాడటం లేదు డాగ్ లవర్స్. ఈ క్రమంలోనే కుక్కల కోసం ప్రత్యేకమైన స్పాలు, హోటళ్లు, రెస్టారెంట్లు ఏర్పాటవుతున్నాయి. డాగ్ లవర్స్ తమ పెంపుడు శునకాలను తమతో పాటు హోటళ్లకు, రెస్టారెంట్లకు తీసుకెళ్లడానికి ఇష్టపడుతుంటారు. అయితే వాటికి అక్కడ అనువైన వాతావరణం ఉండదు. ఇలాంటి ఇబ్బందులు లేకుండా మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో శునకాల కోసమే ప్రత్యేకంగా ‘డాగీ దాబా’ పేరుతో ఓ రెస్టారెంట్ ప్రారంభమైంది. ఇక్కడ కుక్కల కోసం చాలా రకాల వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్ వంటకాలు లభిస్తాయి. రూ.7 నుంచి రూ.500 వరకు శునకాలకు ఇష్టమైన ఆహారం అందిస్తున్నారు. అంతేకాదు ఇక్కడ కుక్కల పుట్టినరోజులను జరుపుకోవచ్చు. ఇందు కోసం ప్రత్యేకమైన కేక్‌లు ఇక్కడ తయారు చేస్తున్నారు. కుక్కలు ఆడుకునేందుకు, విహారం చేసేందుకు అనువైన ఏర్పాట్లు సైతం చేశారు. (ఇదీ చదవండి: అతిగా ఫోన్ వాడుతున్నారా.. ఈమెకు జరిగిందే మీకూ జరగొచ్చు!) బాలరాజ్ ఝాలా అనే వ్యక్తి అతని భార్య కలిసి ఈ డాగీ దాబాను ఏర్పాటు చేశారు. కోవిడ్ లాక్డౌన్ సమయంలో తమకు ఈ ఆలోచన వచ్చిందని ఆయన చెప్పారు. తాను హోటల్లో పనిచేస్తున్న సమయంలో రోజూ ఇంటికి వెళ్లేటప్పుడు కుక్కలకు ఆహారం వేసేవాడినని, ఈ సమయంలోనే కుక్కలకు మంచి ఆహారం అందించాలన్న ఉద్దేశంతో ఈ ప్రత్యేకమైన రెస్టారెంట్ ఏర్పాటు చేసినట్లు బాలరాజ్ వివరించారు. -
ఫుడ్ ట్రక్.. కుక్కలకు మాత్రమే
కరోనా మహమ్మారి తర్వాత ఇంకా రెస్టారెంట్లకు వెళ్ళని వ్యక్తులు ఉన్నారు. కిక్కిరిసిన జనాల మధ్య ఉండటం ఎందుకని హోటల్స్‌కు వెళ్లడం లేదు. అలాంటి వారు రోడ్డు పక్కన ఉండే ఫుడ్ ట్రక్ మెనూని మాత్రం ఇష్టంగా ఎంచుకుంటున్నారు. అయితే, మిగతా దేశాల మాటెలా ఉన్నా న్యూయార్క్ నగరంలోని ఈ ఫుడ్ ట్రక్ మాత్రం కుక్కలకు మాత్రమే ఆహారాన్ని అందిస్తోంది. ఈ ట్రక్కును 2017లో వాడుకలోకి తీసుకువచ్చారు. దీని పేరు ‘వూఫ్ బౌల్.’ ఇక్కడ వివిధ రకాల ఫాస్ట్ ఫుడ్‌ను కుక్కలకు యమాటేస్టీగా వండి వడ్డిస్తారు. కుక్కకి స్నేహపూర్వక, ఆరోగ్యకరమైన ఆహారాన్ని వూఫ్ బౌల్ ద్వారా అందించడమే తమ ప్రధాన లక్ష్యం అని చెబుతున్నారు నిర్వాహకులు. ఈ ట్రక్ యజమాని ఇక్కడ కుక్కల కోసం సేంద్రీయ ఆహారాన్ని మాత్రమే తయారు చేస్తుందని, ఎలాంటి హానికారక రసాయనాలు ఉపయోగించరని ముందే తమ నోట్లో పేర్కొంటారు. ఇక్కడ తయారు చేసిన ప్రతిదీ కుక్కలు లొట్టలు వేసుకొని మరీ టేస్ట్ చేస్తుంటాయి. -
పెట్.. మా ఇంటి నేస్తం
‘‘‘పెట్ అంటే పంచ ప్రాణాలు.. పెట్ కోసం ఏదైనా చేసేందుకు, ఎంతఖర్చు చేసి కొనేందుకు పెట్ లవర్స్ వెనకడుగు వేయట్లేదు. తమ పిల్లల్ని ఎంత గారాబంగా చూసుకుంటారో.. అంతకంటే ఎక్కువగా పెట్‌ను చూసుకుంటున్నారు. కుక్కల పెంపకంపై నగరవాసులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. మార్కెట్, షాపింగ్, పార్లర్, ఫంక్షన్ ఇలా ఎక్కడికెళ్లినా స్నేహితుడిలా, ఆప్తుడిలా, కాపలాదారుడిలా వెంట తెచ్చుకుంటూ మురిసిపోతున్నారు. సిటీలో పలు దేశాలకు చెందిన కుక్కలు సందడి చేస్తున్నాయి. ఓనర్స్ వాటిని ఎంతో ఖర్చుతో కొనుగోలు చేసి మరీ వాటిని లక్కీగా చూసుకుంటున్నారు. నేడు ప్రపంచ జూనోసెస్ డే. జూనోసెస్ డేను పురస్కరించుకుని సిటీలో తారసపడుతున్న కుక్కలు, సర్వీసెస్, రెస్టారెంట్స్ తదితర వాటిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.’’ -చైతన్య వంపుగాని సాక్షి, హైదరాబాద్ : నిషి జీవితంలో పెంపుడు జంతువులు ఒక భాగమయ్యాయి. కుక్క, పిల్లి, కుందేలు లాంటివి పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. అయితే నగరవాసులు ఎక్కువగా కుక్కల్ని పెంచుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంట్లో పిల్లల మాదిరిగా కుక్కకు కూడా ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నారు. కుక్క బిక్కమొహం పెట్టినా, మౌనంగా ఉన్నా భరించలేరు. వెంటనే వైద్యుడిని సంప్రదించి కావాల్సిన వైద్యాన్ని అందిస్తారు. ప్రపంచంలోని పలు జాతులకు చెందిన కుక్కలు ఎంత రేటైనా పెట్టి మరీ ఇతర దేశాల నుంచి ఇక్కడకు తెప్పించుకుంటున్నారు. ఇంట్లోని పిల్లలను ఏ విధంగా అయితే అల్లారుముద్దుగా చూసుకుంటున్నారో.. అలాగే పెట్స్‌ను కూడా చూసుకుంటూ వాటిపై ఉన్న మమకారాన్ని బాహ్యప్రపంచానికి వ్యక్తం చేస్తున్నారు. జూనోసిస్ డే అని ఎందుకు అంటారు జంతువులకు వాటి నుంచి మనుషులకు సక్రమించే వ్యాధులను ‘జోనోటిక్’ అంటారు. ఈ వ్యాధుల్లో రేబిస్ ప్రధానమైంది. లూయీపాశ్చర్ 1885 జూలై 6న యాంటీరేబిస్ వ్యాక్సిన్‌ను తొలిసారిగా ఉపయోగించారు. అందుకే ఈ దినాన్ని జోనోసెస్ డే అని అంటారు. అంతేకాదు యాంటీ రేబిస్ డేగా కూడా పిలుస్తారు. ఇవి నాలుగో సింహాలు ► పోలీస్ కుక్కలు భారతమాత చిత్రాన్నీ గుర్తించి సలాం చేస్తాయి.. ► మాస్టర్ మినహా ఇతరులు ఇచ్చిన ఆహారం తీసుకోవు.. ► నడుస్తున్న వాహనాల్లోంచీ దూకి టార్గెట్‌ను అడ్డుకుంటాయి. ► మనం ఇంట్లో పెంచుకునే పెట్స్‌పై అమితమైన ప్రేమను చూపిస్తాం. అవి ఏవైనా చిన్న పనులు చేస్తే చాలు మురిసిపోతుంటాం. అయితే పోలీసు పెట్స్ చాలా డిఫ్రెంట్. అవి పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను, నేరగాళ్ల జాడను ఇట్టే పసిగట్టేస్తాయి. ఎంతటి వారైనా సరే తప్పు చేసి ఎంత దూరం పరిగెత్తినా సరే వారి భరతం పట్టడంలో పోలీసు కుక్కలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేడెట్ ఇంటెలిజెన్స్ ట్రైనింగ్ అకాడమీ (ఐఐటీఏ)లో శిక్షణలో ఏడు జాతులకు చెందిన 49 జాగిలాలు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ఆరితేరాయి... ► ఈ జాగిలాలు నిత్యం ఇష్టంగా తినే ఆహారాన్నైనా ఎవరు పడితే వాళ్లు పెడితే ముట్టవు. కేవలం హ్యాండ్లర్ లేదా మాస్టర్ ఇస్తేనే స్వీకరిస్తాయి. విషప్రయోగాలకు ఆస్కారం లేకుండా శిక్షణ ఇస్తారు. ► కదులుతున్న వాహనం నుంచి అమాంతం కిందికి దూకడంతో పాటు టార్గెట్‌ను కరిచి పట్టుకుని కదలకుండా చేస్తాయి. ► హ్యాండ్లర్ ఇచ్చిన కమాండ్స్‌ను స్పష్టంగా అర్థం చేసుకోవడంతో పాటు తూ.చ. తప్పకుండా పాటిస్తాయి. ► ఇండియా మ్యాప్‌ను స్పష్టంగా గుర్తించడంతో పాటు రెండు కాళ్లూ ఎత్తి నమస్కరిస్తాయి. ► బాంబులు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలు, అనుమానిత వస్తువులు, నేరగాళ్ల జాడ కనిపెట్టడంలోనూ నిష్ణాతులుగా మారాయి. ప్రముఖులకు పుష్పగుచ్ఛాలు అందించడం, చిన్న చిన్న పనులు చేస్తూ హ్యాండ్లర్లకు సహకారం అందిస్తాయి. పెట్స్ వెకేషన్ కుటుంబం అంతా కలసి ఏదైనా ఊరు వెళ్లాలి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది పెట్. దీనిని ఎలా తీసుకెళ్లాలి, ట్రావెలింగ్‌లో ఏదైనా ఇబ్బంది వస్తదేమోనని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటాం. ఇటువంటి వారి కోసం ‘పెట్ ఏ టౌలీ’ అనే పేరుతో పెట్ వెకేషన్‌ను ప్రారంభించారు నగరానికి చెందిన శుభా మంజూష. ఏదైనా ఊరికి వెళ్లేప్పుడు మన పెట్ని ఇక్కడ వదిలేసి వెళ్తే వీళ్లే అన్ని అవసరాలు చూసుకుంటారు. గ్రూమింగ్ కూడా చేస్తారు. ఎప్పటికప్పుడు పెట్ యజమానికి పెట్ గురించి సమాచారం ఇస్తుంటారు. 15 నుంచి నెల రోజుల వరకు కూడా ఇక్కడ ఉంచొచ్చు. విదేశాల నుంచి దిగుమతి చిహౌహుహా, బీగిల్, దాల్మటియన్, న్యూఫౌండ్‌ల్యాండ్, సెయింట్ బెర్నార్డ్, రాట్వెల్లర్, గ్రేట్‌డేన్, రోడి షియన్ రిడ్జ్‌బ్యాక్, ఆఫ్ఘన్హౌండ్, బుల్మస్తిఫ్, షిట్జూ, లసాప్సో, ‘పమేరియన్, జర్మన్షెప్పర్, లేబ్రడార్, పగ్(హట్చ్ కుక్కపిల్ల), గ్రేట్డీన్, చోచో, టెర్రియర్, డాబర్‌మ్యాన్, బుల్డాగ్, మస్టిఫ్, గోల్డెన్ రిట్రవర్, షిట్జూ’లతో మరికొన్ని జాతి కుక్కలు మనకు ఇక్కడ నిత్యం కనిపిస్తుంటాయి. మన దేశానికి చెందిన జాతి కుక్క అయితే ‘మాంగ్రిల్’ ఒక్కటే అని చెప్పొచ్చు. లంచ్ విత్ పెట్స్ వీకెండ్, ఫెస్టివల్ సమయంలో ఫ్రెండ్స్‌తో కలిసి మనం లంచ్‌ను ప్లాన్ చేసుకోవడం ఆనవాయితీ. మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే పెట్స్‌ను ఆ సమయంలో ఇంట్లో పెట్టి లంచ్‌కు వెళ్లిపోతాం. అయితే ఈ స్టైల్‌కి స్వస్తి పలికి లంచ్విత్ పెట్స్ అనే కాన్సెప్ట్‌తో హోటల్ తాజ్‌కృష్ణా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సిటీలో ఉన్న పెట్ లవర్స్ అంతా ప్రతి నెలా మొదటి వారంలో తాజ్‌కృష్ణాలో ‘లంచ్ విత్ పెట్స్’కి వెళ్తున్నారు. సరదాగా పెట్స్‌కు నచ్చిన ఫుడ్ ఐటంలను ఆర్డర్ చేసుకోవచ్చు. మనకు నిచ్చినవి కూడా తినేయోచ్చు. పసందైన రెస్టారెంట్ ► పెట్స్‌కు వినూత్న సేవలు అందిస్తున్న గచ్చిబౌలిలోని ‘కేఫే దె లోకో’ ► బర్త్‌డే సెలబ్రేషన్స్ కూడా మనం మనకు సంబంధించిన బర్త్‌డే, పెళ్లిరోజు వంటి ఫంక్షన్లను ఖరీదైన ప్రదేశాల్లో జరుపుకుంటుంటాం. మరి మనం అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మన పప్పీల సంగతేంటీ? వాటికి ఉన్నాయి మంచి రెస్టారెంట్లు. వెజ్ నాన్ వెజ్లలో 20కి పైగా వెరైటీల్లో గచ్చిబౌలిలో ‘కేఫే దె లోకో’ పేరుతో హేమంత్, మంచి రుచి ఏర్పాటు చేశారు. మనమే కాకుండా మన పెట్స్‌కి కూడా రెస్టారెంట్‌కు తీసికెళ్లి మంచి విందును ఆరగించే ఏర్పాట్లు చేయోచ్చు. ఫీడింగ్ విధానం ఇదీ కుక్క జాతి మాంసాహారి.. వీటికి మాంసానికి సంబంధించిన ఫుడ్ ఐటంలు పెడితేనే ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పలు కంపెనీలు కూడా ప్యాకెట్ ఫుడ్స్ అందిస్తున్నాయి. ఇంట్లో ఉన్న పెట్స్‌కు ‘పాలు, ఉడకబెట్టిన గుడ్డు, రొట్టె’లతో పాటు విటమిన్స్, మినరల్స్ ఉన్న మందులు వాడితే ఆరోగ్యంగా ఉంటాయి. బ్రీడింగ్ విధానం ఇలా.. ► ప్రతి ఆడకుక్క 8నెలలకు హీట్‌కి వస్తుంది. ► కుక్క గర్భం దాల్చాలంటే సమయం ఏడాది. ► ఏడాది దాటాక దాన్ని క్రాసింగ్‌కు పంపాలి. ► ఏడాది దాటాక స్వజాతి కుక్కతోనే క్రాసింగ్ చేయించాలి. ► ఒక్క గర్భంలో 4నుంచి 8 పిల్లలు పుట్టే అవకాశం ఉంటుంది. ► క్రాసింగ్ అయ్యాక 62రోజులకు డెలవరీ అవుతుంది. ► పుట్టిన పిల్లలు 14రోజులకు కళ్లు తెరుస్తాయి. ► పిల్లలకు తల్లి పాలతో పాలు చాలకపోతే ప్యాకెట్ పాలు ఇవ్వొచ్చు. ► మొదటి నెల రోజుల ఎదుగుదలే ప్రాముఖ్యం. పాలతో పాటు అదనంగా సెరిలాక్, ఉడకబెట్టిన గుడ్డును కూడా ఇవ్వొచ్చు. ► ఆరోగ్యంగా ఉండేందుకు నట్టల మందును 21వ రోజుకు ఇవ్వాలి .రెండు రాష్ట్రాల్లో ఏకైక సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ రోజు రోజుకు మనుషులతో పాటు కుక్కలు సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ తరుణంలో కుక్కలకు ఏమైనా జబ్బులు వస్తే వాటికి చికిత్స చేసేందుకు ఆసుపత్రుల సంఖ్య తక్కువగా ఉందనే చెప్పాలి. నారాయణగూడలో ఉన్న ‘వెటర్నరీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్’ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక హాస్పిటల్. ఇక్కడ ‘ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, ఆపరేషన్ థియేటర్’ సౌకర్యాలు ఉన్నాయి. ఐదుగురు వైద్యుల పర్యవేక్షణలో ఇక్కడ హాస్పిటల్ నడుస్తోంది. గ్రామాల్లో, మండలాల్లో, సిటీల్లో కూడా నయంకాకపోతే ఇక్కడకు తీసుకొస్తారు. ఇక్కడ వైద్యుల పర్యవేక్షణలో జబ్బును నయం చేసి ఇంటికి పంపిస్తామని డాక్టర్ స్వాతి తెలిపారు. నెక్లెస్‌రోడ్డులో విహారం సిటీలో ఉన్న పెట్స్ దాదాపు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం నెక్లెస్ రోడ్డుకు వస్తుం టాయి. వాటి యజమానులు వాటిని సరదాగా విహారానికి తీసుకొస్తారు. దీనిని డాగ్స్ పార్క్ అని కూడా పిలుస్తారు. కొన్ని వందల పెట్స్ అన్నీ ఒకే చోటకు చేరి ఆహ్లాదంగా, ఆనందంగా గడుపుతుంటాయి. పెట్స్ యజమానులు కూడా ఒకరికొకరు ఇంట్రాక్ట్ అవుతూ తమ తమ పెట్స్ విశేషాలను షేర్ చేసుకుంటుంటారు. తప్పక పాటించాల్సినవి ► పెంపుడు జంతువులు నాకిన శరీర భాగాల్ని సబ్బుతో శుభ్రపర్చుకోవాలి. ► కుక్కలను ఎక్కువగా ముట్టుకోవద్దు. ముట్టుకుంటే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. ► వైద్యుల సలహా మేరకే పెంపుడు జంతువులకు ఆహారాన్ని అందించాలి. ► బైక్‌పై తీసుకెళ్లాలనుకుంటే మౌత్గ్యాగ్ తప్పనిసరిగా అమర్చాలి. -
కుక్కల కోసం ఏసీ హోటల్
జైపూర్: ప్రతి కుక్కకు ఒక రోజు వస్తుందంటారు. పింక్ సిటీ జైపూర్ లో కుక్కలకు ఆ రోజు రానే వచ్చింది. వాటి కోసం ప్రత్యేకంగా ఎయిర్-కండీషన్డ్ హోటల్ పెట్టారు. ఇందులో కుక్కల విడిది కోసం 20 కెన్నెల్స్ లేదా రూములు ఉన్నాయి. అంతేకాదు శునకాల కోసం స్విమ్మింగ్ పూల్, స్పా సౌకర్యాలు ఏర్పాటు చేశారు. జాగిలాలను జాలీగా ఉంచేందుకు, వాటిని మన పిల్లలతో సమానంగా చూసుకోవాలన్న ఉద్దేశంతో ఈ హోటల్ పెట్టినట్టు ఇంటర్నేషనల్ డాగ్ బజార్(ఐడీబీ), రాజస్థాన్ కెన్నల్ క్లబ్ గౌరవ కార్యదర్శి వీరేన్ శర్మ తెలిపారు. ఒక్కొక్కటి 24 చదరపు అడుగుల విస్తీర్ణంతో 20 ఎయిర్ కండీషన్డ్ కెన్నెల్స్ లేదా రూములతో హోటల్ ప్రారంభించామని చెప్పారు. కుక్కల యజమానుల నుంచి మంచి స్పందన వస్తే వీటి సంఖ్య పెంచుతామన్నారు. ఒక్క రోజుకు రూ.599 వసూలు చేస్తామని చెప్పారు. కుక్కలకు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ తో పాటు స్పా సౌకర్యాలు కల్పిస్తామన్నారు. ఎక్కువ కాలం తమ హోటల్ లో గడిపే శునకాలకు స్పెషల్ డిస్కౌంట్ కూడా ఇస్తామని ప్రకటించారు.