పెట్‌.. మా ఇంటి నేస్తం | special Article About Zoonoses Day | Sakshi
Sakshi News home page

పెట్‌.. మా ఇంటి నేస్తం

Published Sat, Jul 6 2019 12:40 PM | Last Updated on Sat, Jul 6 2019 1:55 PM

special Article About Zoonoses Day  - Sakshi

‘‘‘పెట్‌ అంటే పంచ ప్రాణాలు.. పెట్‌ కోసం ఏదైనా చేసేందుకు, ఎంతఖర్చు చేసి కొనేందుకు పెట్‌ లవర్స్‌ వెనకడుగు వేయట్లేదు. తమ పిల్లల్ని ఎంత గారాబంగా చూసుకుంటారో.. అంతకంటే ఎక్కువగా పెట్‌ను చూసుకుంటున్నారు. కుక్కల పెంపకంపై నగరవాసులు ఎక్కువగా ఆసక్తి కనబరుస్తున్నారు. మార్కెట్, షాపింగ్, పార్లర్, ఫంక్షన్‌ ఇలా ఎక్కడికెళ్లినా స్నేహితుడిలా, ఆప్తుడిలా, కాపలాదారుడిలా వెంట తెచ్చుకుంటూ మురిసిపోతున్నారు. సిటీలో పలు దేశాలకు చెందిన కుక్కలు సందడి చేస్తున్నాయి. ఓనర్స్‌ వాటిని ఎంతో ఖర్చుతో కొనుగోలు చేసి మరీ వాటిని లక్కీగా చూసుకుంటున్నారు. నేడు ప్రపంచ జూనోసెస్‌ డే. జూనోసెస్‌ డేను పురస్కరించుకుని సిటీలో తారసపడుతున్న కుక్కలు, సర్వీసెస్, రెస్టారెంట్స్‌ తదితర వాటిపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం.’’
-చైతన్య వంపుగాని

సాక్షి, హైదరాబాద్‌ :  నిషి జీవితంలో పెంపుడు జంతువులు ఒక భాగమయ్యాయి. కుక్క, పిల్లి, కుందేలు లాంటివి పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. అయితే నగరవాసులు ఎక్కువగా కుక్కల్ని పెంచుకునేందుకు ఆసక్తి కనబరుస్తున్నారు. ఇంట్లో పిల్లల మాదిరిగా కుక్కకు కూడా ప్రత్యేక గుర్తింపును ఇస్తున్నారు. కుక్క బిక్కమొహం పెట్టినా, మౌనంగా ఉన్నా భరించలేరు. వెంటనే వైద్యుడిని సంప్రదించి కావాల్సిన వైద్యాన్ని అందిస్తారు. ప్రపంచంలోని పలు జాతులకు చెందిన కుక్కలు ఎంత రేటైనా పెట్టి మరీ ఇతర దేశాల నుంచి ఇక్కడకు తెప్పించుకుంటున్నారు. ఇంట్లోని పిల్లలను ఏ విధంగా అయితే అల్లారుముద్దుగా చూసుకుంటున్నారో.. అలాగే పెట్స్‌ను కూడా చూసుకుంటూ వాటిపై ఉన్న మమకారాన్ని బాహ్యప్రపంచానికి వ్యక్తం చేస్తున్నారు.

జూనోసిస్‌ డే అని ఎందుకు అంటారు 
జంతువులకు వాటి నుంచి మనుషులకు సక్రమించే వ్యాధులను ‘జోనోటిక్‌’ అంటారు. ఈ వ్యాధుల్లో రేబిస్‌ ప్రధానమైంది. లూయీపాశ్చర్‌ 1885 జూలై 6న యాంటీరేబిస్‌ వ్యాక్సిన్‌ను తొలిసారిగా ఉపయోగించారు. అందుకే ఈ దినాన్ని జోనోసెస్‌ డే అని అంటారు. అంతేకాదు యాంటీ రేబిస్‌ డేగా కూడా పిలుస్తారు.  

ఇవి నాలుగో సింహాలు 
► పోలీస్‌ కుక్కలు భారతమాత చిత్రాన్నీ గుర్తించి సలాం చేస్తాయి.. 
► మాస్టర్‌ మినహా ఇతరులు ఇచ్చిన ఆహారం తీసుకోవు.. 
► నడుస్తున్న వాహనాల్లోంచీ దూకి  టార్గెట్‌ను అడ్డుకుంటాయి. 
► మనం ఇంట్లో పెంచుకునే పెట్స్‌పై అమితమైన ప్రేమను చూపిస్తాం. అవి ఏవైనా చిన్న పనులు చేస్తే చాలు మురిసిపోతుంటాం. అయితే పోలీసు పెట్స్‌ చాలా డిఫ్‌రెంట్‌. అవి పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలను, నేరగాళ్ల జాడను ఇట్టే పసిగట్టేస్తాయి. ఎంతటి వారైనా సరే తప్పు చేసి ఎంత దూరం పరిగెత్తినా సరే వారి భరతం పట్టడంలో పోలీసు కుక్కలు కీలకపాత్ర పోషిస్తున్నాయి. మొయినాబాద్‌లోని ఇంటిగ్రేడెట్‌ ఇంటెలిజెన్స్‌ ట్రైనింగ్‌ అకాడమీ (ఐఐటీఏ)లో శిక్షణలో ఏడు జాతులకు చెందిన 49 జాగిలాలు అందుబాటులో ఉన్నాయి.  

వీటిలో ఆరితేరాయి... 
►  ఈ జాగిలాలు నిత్యం ఇష్టంగా తినే ఆహారాన్నైనా ఎవరు పడితే వాళ్లు పెడితే ముట్టవు. కేవలం హ్యాండ్లర్‌ లేదా మాస్టర్‌ ఇస్తేనే స్వీకరిస్తాయి. విషప్రయోగాలకు ఆస్కారం లేకుండా శిక్షణ ఇస్తారు. 
► కదులుతున్న వాహనం నుంచి అమాంతం కిందికి దూకడంతో పాటు టార్గెట్‌ను కరిచి పట్టుకుని కదలకుండా చేస్తాయి. 
►  హ్యాండ్లర్‌ ఇచ్చిన కమాండ్స్‌ను స్పష్టంగా అర్థం చేసుకోవడంతో పాటు తూ.చ. తప్పకుండా పాటిస్తాయి.   
► ఇండియా మ్యాప్‌ను స్పష్టంగా గుర్తించడంతో పాటు రెండు కాళ్లూ ఎత్తి నమస్కరిస్తాయి. 
► బాంబులు, పేలుడు పదార్థాలు, మాదకద్రవ్యాలు, అనుమానిత వస్తువులు, నేరగాళ్ల జాడ కనిపెట్టడంలోనూ నిష్ణాతులుగా మారాయి. ప్రముఖులకు పుష్పగుచ్ఛాలు అందించడం, చిన్న చిన్న పనులు చేస్తూ హ్యాండ్లర్లకు సహకారం అందిస్తాయి.

 పెట్స్‌ వెకేషన్‌ 
కుటుంబం అంతా కలసి ఏదైనా ఊరు వెళ్లాలి అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది పెట్‌. దీనిని ఎలా తీసుకెళ్లాలి, ట్రావెలింగ్‌లో ఏదైనా ఇబ్బంది వస్తదేమోనని ఒకటికి పదిసార్లు ఆలోచిస్తుంటాం. ఇటువంటి వారి కోసం ‘పెట్‌ ఏ టౌలీ’ అనే పేరుతో పెట్‌ వెకేషన్‌ను ప్రారంభించారు నగరానికి చెందిన శుభా మంజూష. ఏదైనా ఊరికి వెళ్లేప్పుడు మన పెట్‌ని ఇక్కడ వదిలేసి వెళ్తే వీళ్లే అన్ని అవసరాలు చూసుకుంటారు. గ్రూమింగ్‌ కూడా చేస్తారు. ఎప్పటికప్పుడు పెట్‌ యజమానికి పెట్‌ గురించి సమాచారం ఇస్తుంటారు. 15 నుంచి నెల రోజుల వరకు కూడా ఇక్కడ ఉంచొచ్చు.  

విదేశాల నుంచి దిగుమతి 
చిహౌహుహా, బీగిల్, దాల్మటియన్, న్యూఫౌండ్‌ల్యాండ్, సెయింట్‌ బెర్నార్డ్, రాట్‌వెల్లర్, గ్రేట్‌డేన్, రోడి షియన్‌ రిడ్జ్‌బ్యాక్, ఆఫ్ఘన్‌హౌండ్, బుల్‌మస్తిఫ్, షిట్జూ, లసాప్సో, ‘పమేరియన్, జర్మన్‌షెప్పర్, లేబ్రడార్, పగ్‌(హట్చ్‌ కుక్కపిల్ల), గ్రేట్‌డీన్, చోచో, టెర్రియర్, డాబర్‌మ్యాన్, బుల్డాగ్, మస్టిఫ్, గోల్డెన్‌ రిట్రవర్, షిట్‌జూ’లతో మరికొన్ని జాతి కుక్కలు మనకు ఇక్కడ నిత్యం కనిపిస్తుంటాయి. మన దేశానికి చెందిన జాతి కుక్క అయితే ‘మాంగ్రిల్‌’ ఒక్కటే అని చెప్పొచ్చు.

లంచ్‌ విత్‌ పెట్స్‌ 
వీకెండ్, ఫెస్టివల్‌ సమయంలో ఫ్రెండ్స్‌తో కలిసి మనం లంచ్‌ను ప్లాన్‌ చేసుకోవడం ఆనవాయితీ. మనం ఎంతో ఇష్టంగా పెంచుకునే పెట్స్‌ను ఆ సమయంలో ఇంట్లో పెట్టి లంచ్‌కు వెళ్లిపోతాం. అయితే ఈ స్టైల్‌కి స్వస్తి పలికి లంచ్‌విత్‌ పెట్స్‌ అనే కాన్సెప్ట్‌తో హోటల్‌ తాజ్‌కృష్ణా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. సిటీలో ఉన్న పెట్‌ లవర్స్‌ అంతా ప్రతి నెలా మొదటి వారంలో తాజ్‌కృష్ణాలో ‘లంచ్‌ విత్‌ పెట్స్‌’కి వెళ్తున్నారు. సరదాగా పెట్స్‌కు నచ్చిన ఫుడ్‌ ఐటంలను ఆర్డర్‌ చేసుకోవచ్చు. మనకు నిచ్చినవి కూడా తినేయోచ్చు.  

 పసందైన రెస్టారెంట్‌  
► పెట్స్‌కు వినూత్న సేవలు అందిస్తున్న గచ్చిబౌలిలోని ‘కేఫే దె లోకో’ 
► బర్త్‌డే సెలబ్రేషన్స్‌ కూడా మనం మనకు సంబంధించిన బర్త్‌డే, పెళ్లిరోజు వంటి ఫంక్షన్‌లను ఖరీదైన ప్రదేశాల్లో జరుపుకుంటుంటాం. మరి మనం అల్లారు ముద్దుగా పెంచుకుంటున్న మన పప్పీల సంగతేంటీ? వాటికి ఉన్నాయి మంచి రెస్టారెంట్‌లు. వెజ్‌ నాన్‌ వెజ్‌లలో 20కి పైగా వెరైటీల్లో గచ్చిబౌలిలో ‘కేఫే దె లోకో’ పేరుతో హేమంత్, మంచి రుచి ఏర్పాటు చేశారు. మనమే కాకుండా మన పెట్స్‌కి కూడా రెస్టారెంట్‌కు తీసికెళ్లి మంచి విందును ఆరగించే ఏర్పాట్లు చేయోచ్చు.  


ఫీడింగ్‌ విధానం ఇదీ 
కుక్క జాతి మాంసాహారి.. వీటికి మాంసానికి సంబంధించిన ఫుడ్‌ ఐటంలు పెడితేనే ఎక్కువకాలం ఆరోగ్యంగా ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం పలు కంపెనీలు కూడా ప్యాకెట్‌ ఫుడ్స్‌ అందిస్తున్నాయి. ఇంట్లో ఉన్న పెట్స్‌కు ‘పాలు, ఉడకబెట్టిన గుడ్డు, రొట్టె’లతో పాటు విటమిన్స్, మినరల్స్‌ ఉన్న మందులు వాడితే ఆరోగ్యంగా ఉంటాయి.  

బ్రీడింగ్‌ విధానం ఇలా.. 
►  ప్రతి ఆడకుక్క 8నెలలకు హీట్‌కి వస్తుంది.  
►  కుక్క గర్భం దాల్చాలంటే సమయం ఏడాది.  
► ఏడాది దాటాక దాన్ని క్రాసింగ్‌కు పంపాలి.  
► ఏడాది దాటాక స్వజాతి కుక్కతోనే క్రాసింగ్‌ చేయించాలి.  
► ఒక్క గర్భంలో 4నుంచి 8 పిల్లలు  పుట్టే అవకాశం ఉంటుంది.  
►  క్రాసింగ్‌ అయ్యాక 62రోజులకు డెలవరీ అవుతుంది.  
►  పుట్టిన పిల్లలు 14రోజులకు కళ్లు తెరుస్తాయి.  
►  పిల్లలకు తల్లి పాలతో పాలు చాలకపోతే ప్యాకెట్‌ పాలు ఇవ్వొచ్చు.  
► మొదటి నెల రోజుల ఎదుగుదలే ప్రాముఖ్యం. పాలతో పాటు అదనంగా సెరిలాక్, ఉడకబెట్టిన గుడ్డును కూడా ఇవ్వొచ్చు.  
► ఆరోగ్యంగా ఉండేందుకు నట్టల మందును 21వ రోజుకు ఇవ్వాలి 

.రెండు రాష్ట్రాల్లో ఏకైక సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌
 రోజు రోజుకు మనుషులతో పాటు కుక్కలు సంఖ్య కూడా పెరుగుతోంది. ఈ తరుణంలో కుక్కలకు ఏమైనా జబ్బులు వస్తే వాటికి చికిత్స చేసేందుకు ఆసుపత్రుల సంఖ్య తక్కువగా ఉందనే చెప్పాలి. నారాయణగూడలో ఉన్న ‘వెటర్నరీ సూపర్‌ స్పెషాలిటీ హాస్పిటల్‌’ మాత్రం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకైక హాస్పిటల్‌. ఇక్కడ ‘ఎక్స్‌రే, ఈసీజీ, అల్ట్రాసౌండ్, ఆపరేషన్‌ థియేటర్‌’ సౌకర్యాలు ఉన్నాయి. ఐదుగురు వైద్యుల పర్యవేక్షణలో ఇక్కడ హాస్పిటల్‌ నడుస్తోంది. గ్రామాల్లో, మండలాల్లో, సిటీల్లో కూడా నయంకాకపోతే ఇక్కడకు తీసుకొస్తారు. ఇక్కడ వైద్యుల పర్యవేక్షణలో జబ్బును నయం చేసి ఇంటికి పంపిస్తామని డాక్టర్‌ స్వాతి తెలిపారు.  

నెక్లెస్‌రోడ్డులో విహారం 
సిటీలో ఉన్న పెట్స్‌ దాదాపు ప్రతి శని, ఆదివారాల్లో ఉదయం నెక్లెస్‌ రోడ్డుకు వస్తుం టాయి. వాటి యజమానులు వాటిని సరదాగా విహారానికి తీసుకొస్తారు. దీనిని డాగ్స్‌ పార్క్‌ అని కూడా పిలుస్తారు. కొన్ని వందల పెట్స్‌ అన్నీ ఒకే చోటకు చేరి ఆహ్లాదంగా, ఆనందంగా గడుపుతుంటాయి. పెట్స్‌ యజమానులు కూడా ఒకరికొకరు ఇంట్రాక్ట్‌ అవుతూ తమ తమ పెట్స్‌ విశేషాలను షేర్‌ చేసుకుంటుంటారు.  

తప్పక పాటించాల్సినవి 
 పెంపుడు జంతువులు నాకిన శరీర భాగాల్ని సబ్బుతో శుభ్రపర్చుకోవాలి. 
 కుక్కలను ఎక్కువగా ముట్టుకోవద్దు. ముట్టుకుంటే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి. 
 వైద్యుల సలహా మేరకే పెంపుడు జంతువులకు ఆహారాన్ని అందించాలి.  
 బైక్‌పై తీసుకెళ్లాలనుకుంటే మౌత్‌గ్యాగ్‌ తప్పనిసరిగా అమర్చాలి.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement