కుక్కలకు సేవ చేస్తున్న సహాయకులు కుక్కకు గ్రూమింగ్ చేస్తున్న దృశ్యం
కొందరు కుక్కలను చాలా ఇష్టంగా పెంచుకుంటారు. కానీ వారు ఎప్పుడైనా ఊళ్లకు, టూర్లకు వెళ్లాల్సి వస్తే వెంట తీసుకెళ్లలేరు. ఈ సమస్యకు పరిష్కారం చూపుతూ ఓ యువకుడు సరికొత్త వ్యాపారం ప్రారంభించాడు. ఎవ్వరైనా ఊళ్లకు వెళితే వాటి ఆలనాపాలనా మేము చూస్తామంటూ కుక్కలకు హాస్టల్ ఏర్పాటు చేశాడు.
కర్నూలు(హాస్పిటల్): గోనెగండ్లకు చెందిన వి. రవిప్రకాష్ కర్నూలులో బీఎస్సీ బయోకెమిస్ట్రీ వరకు చదువుకున్నాడు. అతని తండ్రి చిన్న ఓబులేసు వ్యవసాయం చేస్తున్నాడు. తల్లి నాగరత్నమ్మ గృహిణి, తమ్ముడు బాలు డిగ్రీ పూర్తి చేసి తండ్రికి సాయంగా వ్యవసాయం చేస్తున్నాడు. ఇద్దరు అక్కా చెల్లెళ్లకు వివాహమైంది. రవిప్రకాష్ 2016లో డిగ్రీ పూర్తి చేసుకున్నాడు. అతను చదివిన కళాశాలలో చేసిన డిగ్రీ కారణంగా అతనికి మంచి కంపెనీలో ఉద్యోగం లభించేది. కానీ అతనికి చిన్నతనం నుంచి కుక్కలపై ఉన్న ఆసక్తి వ్యాపారంపై దారిమళ్లించింది. చిన్నతనం నుంచి కుక్కల జాతులు, వాటి రకాలు, ఏఏ జాతులు ఎలా ఉంటాయి, ఎలా వ్యవహరిస్తాయి, వాటి ఆహారం, అభిరుచులు, వాటితో ఎలా మెలగాలి, ఎలా మచ్చిక చేసుకోవాలనే విషయాలపై బాగా అధ్యయనం చేశాడు. కుక్కలతోనే తన జీవితమని,తాను బాగుపడ్డా వాటితోనే అని రవిప్రకాష్ నిర్ణయించుకున్నాడు.
కుక్కలకూ ప్రత్యేకంగా హాస్టల్
సాధారణంగా చదువుకునే విద్యార్థులకు హాస్టళ్లు ఉంటాయి. అలాగే వర్కింగ్ ఉమెన్, మెన్స్‌కు హాస్టళ్లు ఉంటాయి. నిర్ణయించిన మేర ఫీజు చెల్లిస్తే వాటిలో ఫుడ్, బెడ్డు సౌకర్యం కల్పిస్తారు. అంతేకాదు సేఫ్టీ కూడా ఉంటుంది. ఇదే తరహాలో కుక్కల కోసం హాస్టల్ ఏర్పాటు చేయాలని భావించాడు రవిప్రకాష్. 2017లో కర్నూలు నగర శివారులోని సల్కాపురం వద్ద అర ఎకరా స్థలంలో 11 షెడ్లతో కుక్కలకు ప్రత్యేక వసతులు కల్పించాడు. కొన్ని రకాల కుక్కలు ఎక్కువ ఎండవేడిమి తట్టుకోలేవు. అలాంటి వాటి కోసం కూలర్లు కూడా ఏర్పాటు చేశాడు. వారి వద్ద వదిలిన కుక్కల ఆలనా పాలనా చూసుకునేందుకు తనతో పాటు మరో ఇద్దరిని ఉద్యోగంలో ఉంచుకున్నాడు. ఆ కుక్కలకు స్నానం చేయించడం, హెయిర్ గ్రూమింగ్(వెంట్రుకలు కత్తిరించడం) చేయడం, వాటికి సమయానికి ఆహారాన్ని అందించడం ఏదైనా అనారోగ్యం కలిగితే వైద్యుల వద్దకు తీసుకెళ్లడం చేస్తుంటారు. ఎవ్వరికై నా ఫలానా జాతి కుక్క కావాలంటే దానిని తెప్పించి ఇవ్వడమే గాక వాటిని ఎలా పెంచాలో కూడా అవగాహన కల్పిస్తున్నారు.
ఎలా పెంచాలో అవగాహన కల్పించారు
మా వద్ద ఇండియన్ స్పిట్ జాతి కుక్క ఉంది. 10 ఏళ్లుగా దానిని మేము పెంచుకుంటున్నాము. మేము ఊళ్లకు వెళ్లే సమయంలో చాలా సార్లు డాగ్ హాస్టల్‌లో వదిలివెళ్లేవాళ్లం. అక్కడ వారు బాగా చూసుకునేవారు. ఏదైనా అనుమానం వస్తే మాకు ఫోన్ చేసి తెలుసుకునేవారు. దానికి ఎలాంటి ఆహారం తినిపిస్తే బాగుంటుంది, దానితో ఎలా వ్యవహరించాలి, దాని లక్షణాలు ఏంటి తదితరవి వివరించి చెప్పేవారు. కుక్కల గురించి మాకు తెలియని విషయాలు ఎన్నో వారి వద్ద నుంచి నేర్చుకున్నాము. –ప్రదీప్, కర్నూలు
Comments
Please login to add a commentAdd a comment