‘జీబీ సిండ్రోమ్’పై అప్రమత్తం
● పెద్దాసుపత్రిలో అవసరమైన ఏర్పాట్లు
● సూపరింటెండెంట్ డాక్టర్
కె. వెంకటేశ్వర్లు
కర్నూలు(హాస్పిటల్): గులియన్ బారే సిండ్రోమ్(జీబీ సిండ్రోమ్) అనే వ్యాధిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కర్నూలు ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ డాక్టర్ కె.వెంకటేశ్వర్లు అన్నారు. ఆసుపత్రిలోని తన చాంబర్‌లో వైద్యులతో గురువారం సమీక్ష నిర్వహించారు. వ్యాధికి సంబంధించి లక్షణాలపై చర్చించారు. రోగులకు అందుతున్న చికిత్స, ఇతర అంశాల గురించి తెలుసుకున్నారు. కాళ్లు, చేతులు స్పర్శ కోల్పోయినట్లు అనిపిస్తే వెంటనే ఆసుపత్రికి రావాలని ప్రజలకు సూచించారు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ వ్యాధి సోకుతుందని తెలిపారు. ఈ వ్యాధి ముఖ్యంగా పిల్లలు, వృద్ధులపైనే తీవ్ర ప్రభావం చూపిస్తుందని, సకాలంలో వైద్యం అందితే ముప్పు ఉండదన్నారు. చికిత్సకు అవసరమైన ఇమ్యునోగ్లోబిన్ ఇంజెక్షన్‌ను అందుబాటులో ఉందని తెలిపారు. ఈ వ్యాధికి సంబంధించి నోడల్ అధికారిగా డాక్టర్ దమామ్ శ్రీనివాసులును నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. సమావేశంలో సీఎస్‌ఆర్‌ఎంవో డాక్టర్ బి. వెంకటేశ్వరరావు, జనరల్ మెడిసిన్, న్యూరాలజీ, హెచ్‌వోడీలు డాక్టర్ ఇక్బాల్ హుసేన్, డాక్టర్ సి. శ్రీనివాసులు, పీడియాట్రిక్ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ రవీంద్రనాథ్‌రెడ్డి, హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ డాక్టర్ శివబాలనాగాంజన్ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment