మందుబాబులకు జరిమానా
కర్నూలు: జిల్లాలో రోడ్డు ప్రమాదాల నియంత్రణలో భాగంగా పోలీసులు తనిఖీలు ముమ్మరం చేశారు. ముఖ్యంగా మద్యం సేవించి వాహనాలు నడుపుతూ ప్రమాదాల బారిన పడుతున్నట్లు పలు ఘటనల ద్వారా వెలుగు చూడటంతో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా తనిఖీలు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా మూడో పట్టణ పోలీసులు డ్రంకెన్ డ్రైవ్, బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న వారిపై ప్రత్యేక దృష్టి సారించి 12 మందిని అదుపులోకి తీసుకుని కేసులు నమోదు చేశారు. వారందరినీ శుక్రవారం జేఎఫ్‌సీఎం కోర్టులో హాజరుపర్చగా డ్రంకెన్ డ్రైవ్‌లో పట్టుబడిన ఒకరికి రూ.3వేలు, ఓపెన్ డ్రింకింగ్‌లో పట్టుబడిన 11 మందికి ఒక్కొక్కరికి రూ.1000 జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు.
సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యం
కర్నూలు: పోలీసు శాఖలో పనిచేస్తున్న సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యతనిస్తూ వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నట్లు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలో పోలీస్ వెల్ఫేర్ డే(గ్రీవెన్స్ డే) నిర్వహించారు. జిల్లాలోని వివిధ పోలీస్‌స్టేషన్లు, వివిధ విభాగాల్లో విధులు నిర్వహిస్తున్న సిబ్బంది హాజరై తమ సమస్యలను చెప్పుకున్నారు. ముఖ్యంగా బదిలీలు, ఆరోగ్య సమస్యలు, విధి నిర్వహణలో తలెత్తుతున్న ఇబ్బందులను ఎస్పీ దృష్టికి తీసుకొచ్చారు. వాటికి తగిన పరిష్కారం చూపుతానని ఎస్పీ సిబ్బందికి భరోసా కల్పించారు. ఇకపై ప్రతి శుక్రవారం సిబ్బంది సమస్యల పరిష్కారానికి గ్రీవెన్స్ డే నిర్వహిస్తామని ఎస్పీ హామీ ఇచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment