మాజీ ముఖ్యమంత్రికి భద్రత ఇవ్వలేరా?
కర్నూలు(టౌన్): రైతులతో మాట్లాడేందుకు గుంటూరు మిర్చి యార్డుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి, జడ్‌ప్లస్ క్యాటగిరీ కలిగిన వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి భద్రత కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వ విఫలం అయ్యిందని వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి విమర్శించారు. ఒక్క పోలీసును కూడా నియమించకపోవడం వెనుక ఆంతర్యమేంటని ప్రశ్నించారు. జగనన్నకు హాని తలపెట్టాలని చూస్తే రాష్ట్రం అగ్నిగుండం అవుతుందని హెచ్చరించారు. ఎస్వీ కాంప్లెక్స్‌లోని సమావేశ హాలులో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల కోడ్ పేరుతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి రక్షణ కల్పించలేకపోయామని చెప్పిన ప్రభుత్వం, విజయవాడలో సంగీత విభావరికి ఎలా భద్రత కల్పించారన్నారు. గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడుకు, ప్రొటోకాల్ లేని నారాలోకేష్‌కు రక్షణ కల్పించిందన్నారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంపై తమకు నమ్మకం లేదన్నారు. కేంద్ర బలగాలే మాజీ సీఎంకు రక్షణ కల్పించాలని, కేంద్ర ప్రభుత్వం స్పందించాలని కోరారు.
రైతులను నట్టేట ముంచిన కూటమి సర్కార్
రైతులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందని ఎస్వీ విమర్శించారు. మొన్న టమాట రైతులు రోడ్డున పడ్డారని, ఇప్పుడు మిర్చి రైతులు అప్పుల పాలయ్యారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో రైతుల పంటను కొనే నాథుడు కరువయ్యారన్నారు. రైతులకు ఇప్పటికే కేంద్రం ప్రభుత్వం రెండు విడతలుగా ఆర్థిక సహాయం అందించినా.. రాష్ట్ర ప్రభుత్వం నయాపైసా విడుదల చేయలేదన్నారు. తొమ్మిది నెలల వ్యవధిలో రూ.1.25 లక్షల కోట్ల అప్పులు చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఒక్క సంక్షేమ పథకం అమలు చేసిందా అని ప్రశ్నించారు.
దురుద్దేశపూర్వకంగానే..
రాష్ట్ర ప్రభుత్వం దురుద్దేశ పూర్వకంగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి భద్రతను గాలికి వదిలేసిందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్ రెడ్డి విమర్శించారు. ప్రజల మధ్యన తిరిగే మాజీ సీఎంకు ఏదైన చిన్న హాని జరిగితే రాష్ట్ర ప్రభుత్వం బాధ్యత వహించాలన్నారు. తొమ్మిది నెలల పాలనలో అన్ని వర్గాల ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ జిల్లా నాయకులు, అనుబంధ సంఘ నాయ కులు, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.
విఫలమైన రాష్ట్ర ప్రభుత్వం
వైఎస్సార్‌సీపీ కర్నూలు జిల్లా
అధ్యక్షుడు ఎస్వీమోహన్ రెడ్డి
Comments
Please login to add a commentAdd a comment