ప్రైవేటు బస్సు బోల్తా
● నలుగురు భక్తులకు తీవ్ర గాయాలు
తుగ్గలి: ప్రైవేట్ బస్సు అదుపు తప్పి బోల్తా పడటంతో నలుగురు భక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తుగ్గలి మండలం జొన్నగిరి సమీపంలో శుక్రవారం చోటు చేసుకుంది. కర్ణాటక, అనంతపురానికి చెందిన 40 మంది యాత్రికులు ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్ రాజ్‌లో జరుగుతున్న కుంభమేళాకు వెళ్లారు. అక్కడి నుంచి కాశీతో పాటు పలు పుణ్యక్షేత్రాలను దర్శించుకుంటూ తిరుగు ప్రయాణమయ్యారు. శుక్రవారం మంత్రాలయంలో స్వామిని దర్శించుకొని అనంతపురానికి బయలుదేరారు. మార్గమధ్యలో గిరిగెట్ల–జొన్నగిరి మధ్య ఓ మలుపులో బస్సు అదుపుతప్పి పొలం పక్కకు దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంతో అనంతపురానికి చెందిన తులసి, యలహంకకు చెందిన పూర్ణిమ, గౌరిబిదనూరుకు చెందిన లక్ష్మయ్య, బ్రహ్మణహాల్‌కు చెందిన ఉమాదేవి తీవ్రంగా గాయపడ్డారు. మరి కొంత మందికి స్వల్ప గాయాలతో బయటపడటంతో పెద్ద ముప్పు తప్పినట్లయింది. జొన్నగిరి ఎస్‌ఐ జయశేఖర్, పోలీసులు, గ్రామస్తులు ఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్రులను బస్సులోంచి బయటకు లాగారు. విషయం తెలుసుకున్న ఇన్‌చార్జ్ పత్తికొండ ఆర్డీఓ వెంకటేష్, రూరల్ సీఐ పులిశేఖర్, ఆర్టీఏ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలపై ఆరా తీశారు. క్షతగాత్రులను 108 వాహనాల్లో గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment