నల్లమలలో దారి తప్పిన శివస్వాములు
● గూగుల్ మ్యాప్‌తో వెళ్తూ అడవి లోపలికి వెళ్లిన వైనం
● రక్షించిన ఆత్మకూరు అటవీ సిబ్బంది
ఆత్మకూరు రూరల్: శ్రీశైల శివరాత్రి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు నల్లమల మీదుగా పాదయాత్రగా బయలుదేరిన ఏడుగురు శివస్వాములు అడవిలో దారి తప్పారు. సుమారు 4 గంటలు అడవిలో తప్పిపోయి ఆందోళన చెందారు. ఎట్టకేలకు ఆత్మకూరు డివిజన్‌లోని ఇందిరేశ్వరం బీట్ అటవీ శాఖ సిబ్బంది వారిని రక్షించారు. తెలంగాణ రాష్ట్రం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లా పెంట్లవెల్లికి చెందిన ఏడుగురు శివస్వాములు ఆత్మకూరు సమీపంలోని వెంకటాపురానికి శుక్రవారం సాయంత్రం వాహనంలో చేరుకున్నారు. అక్కడి నుంచి అటవీ మార్గం మీదుగా శ్రీశైలానికి పాదయాత్రగా బయలుదేరారు. వారు అడవిలో అటవీ శాఖ ఏర్పాటు చేసిన సూచికల బోర్డుల చూపిన దారి గుండా వెళ్లకుండా గూగుల్ మ్యాప్ చూస్తూ వెళ్లడంతో అడవిలో వారు దారి తప్పారు. దట్టమైన అడవి కావడంతో ఎటుపోతున్నారో తెలియక సుమారు 4 గంటల పాటు దిక్కు తోచక తిరిగారు. చివరకు దారి తప్పినట్లు 100కు డయల్ చేసి చెప్పారు. సమాచారం తెలుసుకున్న నంద్యాల ఎస్పీ అధిరాజ్ సింగ్ రాణా వెంటనే ఆత్మకూరు అటవీ డివిజన్ డిప్యూటీ డైరెక్టర్ సాయిబాబాను అప్రమత్తం చేశారు. దీంతో ఆయన సూచన మేరకు ఇందిరేశ్వరం బీట్ ఎఫ్‌ఎస్‌ఓ మగ్బూల్, ఎఫ్‌బీవో మద్దిలేటి సిబ్బంది సహాయంతో దారితప్పిన యాత్రికుల కోసం అన్వేషించారు. ఎట్టకేలకు పాదయాత్రికులను గుర్తించిన అటవీ సిబ్బంది వారిని ఆత్మకూరు డీఎఫ్‌ఓ కార్యాలయానికి తీసుకొచ్చారు. తమను రక్షించిన అటవీ సిబ్బందికి శివస్వాములు కృతజ్ఞతలు తెలిపి బస్సులో శ్రీశైలం బయలుదేరారు.
Comments
Please login to add a commentAdd a comment