పెరవలి: పశ్చిమ గోదావరి జిల్లాలో ఎన్నడూ లేని విధంగా ఈ ఏడాది దుంపల సాగు చేపట్టిన రైతులకు కాసుల వర్షం కురిసింది. గత కొన్నేళ్లుగా నష్టాలు చవిచూస్తున్న రైతులు ఈ ఏడాది తమ కష్టాలు తీరేలా దిగుబడి, గిట్టుబాటు ధర లబించటంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కంద, చిలగడ దుంప పంటపై రైతులు కూలీలు, వ్యాపారులు, వాహనదారులు, సంచుల వ్యాపారులు ఇలా 12 వేల మంది ఆధారపడి ఉన్నారు.
పశ్చిమలో సాగు ఏంతంటే..
పశ్చిమ గోదావరి జిల్లాలో 900 హెక్టార్లలో కంద సాగు చేస్తుండగా, చిలగడదుంప సాగు 150 ఎకరాల్లో ఉంది. ఈ పంటలు గతంలో 1000 హెక్టార్లు ఉండగా.. నాలుగేళ్ళుగా వరుస నష్టాలు వస్తుండటంతో రైతులు సాగు విస్తీర్ణం తగ్గించారని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో కంద సాగు పెరవలి, ఉండ్రాజవరం, నిడద వోలు, కొవ్వూరు, చాగల్లు, దేవరపల్లి, నల్లజర్ల, కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం, పోలవరం మండలాల్లో సాగు చేస్తున్నారు. చిలకడదుంప, పెనుగొండ, ఇరవగవరం, ఆచంట, పెరవలి, కొవ్వూరు, నిడదవోలు మండలాల్లో సాగుచేస్తున్నారు.
ధరలు ఇలా
కంద ధరలు ఊహించని విధంగా ఈ ఏడాది పుట్టి రూ.3400 వద్ద ప్రారంభమై ప్రస్తుతం రూ.2000 వేల వద్ద స్థిరంగా ఉంది. మార్కెట్‌లో ధర ఎలా ఉన్నా ఈ ఏడాది ఊరికలు బాగా జరగటంతో రైతులు ఆనందంగా ఉన్నారు. ఎకరానికి 80 నుంచి 100 పుట్టుల దిగుబడి వచ్చి 8 ఏళ్ళు అయ్యిందని.. అలాంటి ఊరికలు ఇప్పుడు వచ్చాయంటున్నారు. కంద సాగు చేసే రైతులు లక్షల్లో పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఎకరం కంద వేయాలంటే విత్తనానికి రూ.92 వేలు, కంద నాటడానికి, బోదెలు తవ్వడానికి, చచ్చు ఎక్కవేయడానికి కూలీలకు 20 వేలు అవుతుంది. ఎరువులు, పురుగుమందులకు రూ.15వేలు అవుతుంది. మొత్తం ఖర్చు రూ.1.27 లక్షలు అవు తు ంది. ఊరికల ఆధారంగా రైతుకు ఎకరానికి రూ. 30 వేల నుంచి రూ.60 వేల మిగులు వస్తుంది.
సిరులు కురిపిస్తున్న చిలకడదుంప
చిలకడదుంప సాగు కాలం కేవలం 4 నెలలు మాత్రమే. ఈ పంట లాభాలు కురిపించడంతో రైతులు సాగుకు మక్కువ చూపుతున్నారు. తెగుళ్ళు ఆశిస్తాయనే భయం లేదు. ప్రకృతి వైపరీత్యాలతో పంట పాడైపోతుందని ఆందోళన అవసరం లేదు. కేవలం ఎరువులు అందించి నీరు సక్రమంగా పెడితే నాలుగు నెలల్లో రూపాయికి రెండు రూపాయలు మిగిలే పంట ఇది. చిలకడదుంప సాగు చేపట్టిన రైతులు సాగుచేయడానికి ఎటువంటి ఇబ్బంది లేకపోయినా కేవలం తవ్వకం వల్లే ఎక్కువ పెట్టుబడి అవుతుదంటున్నారు. ఎకరా పంట సాగుచేయాలంటే రూ.15 వేలు అవుతుంది. 4 నెలల్లో ఎకరానికి పెట్టుబడి పోను రూ.10 వేల ఆదాయం వస్తుంది.
తీగ జాతికి చెందిన ఈ పంట కాడను తీసుకుని ముక్కలు చేసి వరినాట్లు వేసినట్లుగా చేలో నాటుకుంటూ వెళ్తే వారం రోజుల్లో నాటిన కాడ నుండి ఆకులు వచ్చి తీగ చేనంతా అల్లుకుంటుంది. పంట తయారీకి రూ.15వేలు పెట్టుబడి.. తవ్వడానికి, మార్కెట్‌కు తరలించడానికి మరో రూ. 15వేలు ఖర్చు ఖర్చవుతుంది. దిగుబడి ఎకరానికి 6 నుండి 8 టన్నులు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్‌లో దుంపల నాణ్యతను బట్టి టన్ను రూ.10 వేల నుంచి రూ.12 వేలకు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో ఏజెన్సీ, డెల్టాలో గోదావరి తీర ప్రాంతంలోను, తూర్పుగోదావరి జిల్లాలో ఆత్రేయపురం, రావులపాలెం మండలాల్లో ఎక్కువగా ఈ పంటను సాగుచేస్తున్నారు.
ఈ ఏడాది ఊహించని దిగుబడి
కంద ఈ ఏడాది వచ్చినంత దిగుబడి ఎన్నడూ రాలేదు. గత నాలుగేళ్ళుగా నష్టాలు చవిచూశాం. ఈ ఏడాది ఊహించని రీతిలో గిట్టు బాటు ధర ఉండడం, దిగుబడి పెరగడంతో లాభాలు వచ్చాయి. –సంఖు ప్రభాకరరావు, కంద రైతు, మల్లేశ్వరం
తెగుళ్ల బెడద తక్కువ
చిలగడదుంప సాగుచేయడానికి ముందుగా బలమైన చేలను ఎంపిక చేసుకోవాలి. ఎర్రనేలలు, ఇసుకనేలలు, నల్లరేగడి నేలలు అనువుగా ఉంటాయి. ఎకరానికి రూ.30 వేలు పెట్టుబడి పెడితే సరిపోతుంది. నాలుగు నెలల్లో పంట చేతికి అందుతుంది. సాగునీరు సక్రమంగా అందించాలి. తెగుళ్ల బెడద తక్కువగా ఉంటుంది.
– తోట మల్లేశ్వరరావు రైతు మల్లేశ్వరం
ఈ ఏడాది దుంప రైతుకు లాభాలు
ఈ ఏడాది రైతులకు కలిసివచ్చింది. కంద దిగుబడి వచ్చే సమయంలో కరోనాతో లాక్‌డౌన్ వల్ల ఎక్కడి సరకు అక్కడే ఉండిపోయింది. దీంతో ప్రభుత్వం వ్యవసాయ ఉత్పత్తులకు అనుమతులు ఇవ్వటంతో కంద రైతులకు మంచి ధర లబించింది. చిలకడదుంప సాగులో రూపాయికి రెండు రూపాయల ఆదాయం వస్తుంది.
– ఏ దుర్గేష్, ఉద్యానవన సహాయ సంచాలకులు, తణుకు
Comments
Please login to add a commentAdd a comment