సిరులు పండిస్తున్న కొర్రమీను.. ఇలా చేస్తే లాభాలే లాభాలు | Korameenu Fish Farming Earn High Profits | Sakshi
Sakshi News home page

సిరులు పండిస్తున్న కొర్రమీను.. ఇలా చేస్తే లాభాలే లాభాలు

Published Wed, Oct 12 2022 7:23 PM | Last Updated on Wed, Oct 12 2022 7:34 PM

Korameenu Fish Farming Earn High Profits  - Sakshi

తాడేపల్లిగూడెం రూరల్‌(పశ్చిమ గోదావరి): మత్స్య ఉత్పత్తులకు పెట్టింది పేరు పశ్చిమగోదావరి జిల్లా. దేశ, అంతర్జాతీయంగా ఇక్కడి ఉత్పత్తులకు మంచి పేరు ఉంది. మత్స్య ఉత్పత్తుల్లో పండుగప్పది ప్రత్యేక స్థానం. ఇది సముద్రంలో పెరిగే చేప అయినప్పటికీ ఇక్కడి వాతావరణ పరిస్థితులు అనుకూలంగా ఉండటంతో చెరువుల్లో సైతం సాగు చేస్తున్నారు. తరువాత స్థానం కొర్రమీనుదే. ఔషధ గుణాలతో పాటు రుచిగా ఉండటంతో మాంసప్రియులు దీనిని తినేందుకు ఆసక్తి చూపుతుంటారు. ఇప్పుడు ఈ చేప సీడ్‌ విక్రయం లాభసాటిగా మారడంతో కొందరు రైతులు తమ ఇళ్లల్లోనే సాగు చేసి లాభాలను చవిచూస్తుండటం విశేషం.
చదవండి: జియో ట్రూ 5జీ : అతి త్వరలో ఆంధ్రప్రదేశ్‌లో సేవలు

కొర్రమీను సాగుపై రైతులు మక్కువ చూపుతున్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా చెరువుల్లోనూ సైతం సాగు చేసేందుకు రైతులు ముందుకు రావడంతో సీడ్‌ దశలోనే మంచి గిరాకీ ఉందని సీడ్‌ సాగుదారులు పేర్కొంటున్నారు. సీడ్‌ను సైతం ప్రకృతి సిద్ధంగా మురుగు కుంటల్లో పెరిగిన కొర్రమీను నుంచి సేకరిస్తున్నారు. ఈ సీడ్‌ను ఇంటి పెరట్లోనే పెంచి చెరువుల రైతులకు విక్రయిస్తూ లాభాలు గడిస్తున్నారు. ఇలా ఒక్క తాడేపల్లిగూడెం మండలంలోనే జగన్నాథపురం, నవాబ్‌పాలెం, కృష్ణాయపాలెం, దండగర్ర గ్రామాల్లో దాదాపు 15 నుంచి 20 మంది రైతులు కొర్రమీను సాగు చేపట్టడం విశేషం.

జగన్నాథపురం గ్రామానికి చెందిన మారెడ్డి శ్రీనివాస్‌ తన కుమార్తెను భీమవరం కళాశాలకు తీసుకెళ్లే క్రమంలో కొర్ర మీను సాగుపై తన బంధువుల ద్వారా తెలుసుకున్నాడు. తాను కూడా ఒక ప్రయత్నం చేయాలనే సంకల్పంతో దాదాపు ఐదు వేల కొర్రమీను పిల్లను రూ.3 వేలకు కొనుగోలు చేశారు. దాదాపు మూడు నెలల వ్యవధిలోనే అంగుళం సైజు పిల్ల రూ.17 చొప్పున మొత్తం రూ.85 వేలకు సీడ్‌ను కైకలూరుకు చెందిన చేపల సాగుదారుడు కొనుగోలు చేశారు. సీడ్‌కు రూ.3 వేలు, మూడు నెలలు చేప పెంపకానికి ఐదు నుంచి పది వేల రూపాయలు వరకు ఖర్చయిందని అంచనా. పెట్టుబడి రూ.13 వేలు పోను రూ.72 వేల వరకు లాభం కనబడుతుంది. దీంతో మరింత ఉత్సాహంగా రైతు మారెడ్డి శ్రీనివాస్‌ కొర్రమీను పెంపకాన్ని చేపట్టారు. తాను సాగు చేయడంతో పాటు పరిసర గ్రామాల రైతులను సైతం ప్రోత్సహిస్తున్నారు.

ఇంట్లోనే 1.50 లక్షల సీడ్‌ పెంపకం  
జగన్నాథపురం గ్రామంలోని తన ఇంటిలోనే మారెడ్డి శ్రీనివాస్‌ దాదాపు 1.50 లక్షల సీడ్‌ను పెంచుతున్నారు. సీడ్‌ పెంపకానికి మొదట్లో అందుబాటులో ఉన్న ట్యాంకులను వినియోగించినప్పటికీ సీడ్‌ పెరగడంతో వైజాగ్‌ నుంచి తీసుకువచ్చిన ట్యాంకుల్లో పెంచుతున్నారు. ఒక్కో ట్యాంకు ఖరీదు రూ.4,500 కాగా, పైప్‌లైన్, ఇతరత్రా పనులకు మరో రూ.500 వెరసి రూ.5 వేల వరకు ఖర్చు చేశారు. ప్రస్తుతం తన ఇంటి వద్ద ఆరు ట్యాంకుల్లో సైజుల వారీగా పెంచుతున్నారు. ఒక్కో ట్యాంకులో ఐదు వేల వరకు పిల్లను పెంచాల్సి ఉండగా, 25 వేల సామర్థ్యంతో పిల్లను పెంచుతుండటం గమనార్హం.

పిల్ల పరిమాణం ఆధారంగా మేత 
మైక్రో సీడ్‌ నుంచి మూడు అంగుళాల వరకు ఒక్కో దశకు ఒక్కో రకమైన మేతను అందిస్తారు. మైక్రో సీడ్‌కు తొలి వారం రోజులు ఎటువంటి ఆహారాన్ని అందించరు. తదుపరి తవుడు మాదిరి పౌడర్‌ను అందిస్తారు. 0.3, 0.6 సైజులు కలిగిన మిల్లెట్స్‌ను ఆహారంగా అందిస్తారు. ఈ ఆహారం కూడా పోషక విలువలు కలిగిన సోయాబీన్, తవుడు, వేరుశెనగ చెక్కతో తయారు చేసిన వాటినే వినియోగిస్తారు. పది కిలోల బస్తా రూ.1400 నుంచి రూ.2వేల వరకు పిల్ల సైజును బట్టి దాణాను కొనుగోలు చేస్తారు. రెండు నెలలకు సీడ్‌ను విక్రయించే నాటికి పది వేల పిల్లకు రూ.12 వేలు ఖర్చవుతుంది. ఈ పది వేల పిల్లను విక్రయిస్తే రూ.60 వేలు వస్తుంది. ఖర్చులు తీసివేస్తే రూ.48 వేల వరకు మిగులుతుంది.

అన్ని పరిస్థితుల్లోనూ ఆరోగ్యంగా.. 
సాధారణంగా ఆక్వా సాగులో  రైతులను వాతావరణ పరిస్థితులు వెంటాడుతుంటాయి. అయితే కొర్రమీను సాగు చేసే రైతులకు ఇటువంటి సమస్యలు ఉండవు. ఇవి ఆక్సిజన్, ఏ నీటినైనా తట్టుకుని జీవించగలవని రైతు మారెడ్డి శ్రీనివాస్‌ చెబుతున్నారు. బోరు, చెరువు, మంచినీటిలోనూ ఇవి ఆరోగ్యకరంగా పెరుగుతున్నట్టు చెబుతున్నారు.

దక్షిణాది రాష్ట్రాలకు సీడ్‌ ఎగుమతి 
ఇక్కడ నుంచి అత్యధికంగా కర్ణాటక ఆక్వా సాగుదారులు రెండున్నర నుంచి మూడు అంగుళాల సైజు సీడ్‌ను కొనుగోలు చేస్తున్నారు. రెండున్నర అంగుళాల పిల్లను రూ.3కు, మూడున్నర అంగుళాల పిల్లను రూ.4 నుంచి రూ.6 వరకు విక్రయిస్తున్నారు. కర్ణాటక ప్రభుత్వం ఆక్వా సాగుదారులకు సబ్సిడీలను ఇస్తుండటంతో కొర్రమీను సాగు చేపట్టేందుకు రైతులు ఉత్సాహంగా ముందుకొస్తున్నారు. వీరితో పాటు కైకలూరు, ఆకివీడు, ఇతర రాష్ట్రాలైన తెలంగాణ, తమిళనాడుకు సైతం ఎగుమతి చేస్తున్నారు. దక్షిణాది రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, తెలంగాణ, మధురై, బెంగళూరులోనూ కొర్రమీను వినియోగం అధికం. దీంతో ఆయా ప్రాంతాలకు ఎక్కువగా సీడ్‌ ఎగుమతి జరుగుతుంది.

ఇంట్లోనే సులభంగా పెంపకం 
కొర్రమీను పిల్లను ఇంట్లోనే ట్యాంకుల్లో పెంచుకునే వెసులుబాటు ఉంది. కూలీలు అవసరం లేదు. కుటుంబ సభ్యులే సమయానుగుణంగా ఆహారం, నీటిని మారిస్తే చాలు. ఎటువంటి ప్రతికూల పరిస్థితులనైనా తట్టుకోగలదు. మంచి ఆదాయం కూడా వస్తుంది. వీటి పెంపకంపై శిక్షణ ఇచ్చి యువతను ప్రోత్సహించడం ద్వారా ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.  
– మారెడ్డి శ్రీనివాస్, కొర్రమీను పెంపకందారుడు, జగన్నాథపురం, తాడేపల్లిగూడెం మండలం

స్వయం ఉపాధికి అవకాశం 
నిరుద్యోగ యువతకు కొర్రమీను పెంపకం స్వయం ఉపాధి రంగంగా నిలుస్తుంది. దీనిపై అవగాహన కోసం సాగుదారుల వద్దకే నేరుగా తీసుకెళ్లి శిక్షణ ఇప్పించేందుకు సిద్ధంగా ఉన్నాం. యువత కొర్రమీను సీడ్‌ పెంపకాన్ని ఉపాధి మార్గంగా ఎంచుకోవాలి. 
– డాక్టర్‌ దేవీవరప్రసాద్‌రెడ్డి, మత్స్య విభాగం శాస్త్రవేత్త, కేవీకే, డాక్టర్‌ వైఎస్సార్‌ ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం, తాడేపల్లిగూడెం మండలం  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement