మొగల్తూరు: పశ్చిమ గోదావరి జిల్లా పాతపాడు సంత అంటే ఒకప్పుడు రాష్ట్రవ్యాప్తంగా పేరు. వేకువజామున 3 గంటలకు ప్రారంభమై తెల్లవారకముందే ముగియడం ఈ సంత ప్రత్యేకం. ఎండు చేపలు, కూరగాయలు, కిరాణా సరుకులు, దుస్తులు, బంగారు వస్తువులు, ఫ్యాన్సీ సామాన్లు వంటివి అమ్ముతుంటారు. ప్రతి మంగళవారం జరిగే సంత కోసం సోమవారం సాయంత్రానికే అమ్ముకునేవారు, కొనుగోలుదారులతో గ్రామం కోలాహలంగా మారుతుంది.
సంత ఏర్పడిందిలా..
పాతపాడు పూర్తిగా మత్స్యకార గ్రామం. ఇక్కడకు వచ్చేందుకు పూర్వం సరైన రవాణా సదుపాయాలు లేవు. గ్రామం చుట్టూ ఏరులు ఉండటంతో లాంచీలు, పడవలే ఆధారం. మత్స్య సంపద అపారంగా ఉండటం, బయట ప్రాంతాలకు తరలించే అవకాశం లేకపోవడంతో ఇక్కడ సంత ఏర్పడింది. ముఖ్యంగా ఎండుచేపలకు పెట్టింది పేరుగా మారింది. వేటలో లభ్యమయ్యే చేపలు కోసి వాటికి ఉప్పు దట్టించి ఎండబెట్టి ఉప్పు చేపలు లేదా ఎండు చేపలుగా విక్రయిస్తారు. ఇరుగుపొరుగు గ్రామాలతో పాటు కృష్ణా జిల్లా నుంచి కూడా చిరువ్యాపారులు తమ మత్స్య ఉత్పత్తులను ఇక్కడకు తీసుకువచ్చి విక్రయించడంతో సంత పేర్గాంచింది. మత్స్య సంపదతో పాటు మిగిలిన వస్తువుల క్రయవిక్రయాలు మొదలయ్యాయి. పూర్వం పెళ్లిళ్ల కోసం బంగారు తాళిబొట్టును కూడా ఇక్కడ ఆర్డరు ఇచ్చి చేయించుకునేవారు.
సంతలో దొరికే రకాలు
పాతపాడు సంతలో పలురకాల ఎండు చేపలు లభిస్తాయి. పండు గప్ప, వంజరం, మాగ, సప్పిడి గొరక, పార, సండువాయి చుక్కర్లు, కవర్లు, బల్లపరిగ, సావిడాయి, కట్టి పరిగ, కారెగప్ప, రొయ్యలు, పీతలు ఇక్కడ ప్రత్యేకం. ఇక్కడ ఎండు చేపలను దేశంలోని ఇతర ప్రాంతాలతో పాటు విదేశాల్లో నివసించే బంధుమిత్రులకు పంపించేవారు. సంతలో దుకాణాల నిర్వహణలో మహిళలదే ప్రధాన పాత్ర. ఇక్కడ దుకాణాల్లో మహిళలు విక్రయిస్తుంటే మగవారు సాయం చేస్తుంటారు.
తగ్గిన ఆదరణ
మండల కేంద్రం మొగల్తూరు నుంచి పాతపాడు రావాలంటే రెండు రేవులు దాటాలి. ఇటీవల రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, ఆక్వా పరిశ్రమలు పెరగడం, మత్య్స సంపదను కోల్డ్ స్టోరేజీలో నిల్వ ఉంచడం వంటి పరిణామాలతో పాతపాడు సంతకు ఆదరణ తగ్గింది. గతంలో సంత జరిగే రోజు సుమారు 200 టన్నుల మత్య్స సంపద విక్రయాలు జరగ్గా ప్రస్తుతం టన్ను సరుకు కూడా అమ్ముడవడం లేదని గ్రామ పెద్దలు అంటున్నారు.
రాష్ట్రంలోనే పేరు
పాతపాడు సంతకు రాష్ట్రంలోనే పేరుంది. అయితే మారిన కాలానికి అనుగుణంగా రవాణా సౌకర్యాలు మెరుగుపడటం, మత్య్స సంపదను నిల్వ చేసుకునే అవకాశం ఉండటంతో పాతపాడు సంత తన ప్రాభవాన్ని కోల్పోయింది.
–కొప్పాడ లక్ష్మీతులసి, సర్పంచ్, పాతపాడు
ఎక్కడెక్కడ నుంచో వచ్చేవారు
నాకు ఊహ తెలిసినప్పటి నుంచి పాతపాడు సంతకు వస్తున్నా. ఎండుచేపలను కొనేందుకు ఎక్కడెక్కడ నుంచో కొనుగోలుదారులు వచ్చేవారు. ఎక్కడికక్కడ ఎండుచేపలు అందుబాటులోకి రావడంతో పాతపాడు సంత తగ్గింది.
–చింతా వెంకటేశ్వరమ్మ, చినగొల్లపాలెం
Comments
Please login to add a commentAdd a comment