ఆక్వా మంటలు | illegal shrimp ponds of ruling party leaders | Sakshi
Sakshi News home page

ఆక్వా మంటలు

Published Thu, Jan 18 2018 3:25 AM | Last Updated on Thu, Jan 18 2018 3:25 AM

 illegal shrimp ponds of ruling party leaders - Sakshi

పిఠాపురం: పచ్చని పంట పొలాలు తెల్లారేసరికి రొయ్యల చెరువులుగా మారిపోతున్నాయి. ఏ అనుమతులతో పని లేకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు చెరువులు తవ్వుకుంటున్నా పట్టించుకునే నాథుడు లేకపోవడంతో విచ్చలవిడిగా రెచ్చిపోతున్నారు. పంట పొలాల మధ్య చెరువులు తవ్వడం వల్ల చవుడుబారి పనికిరాకుండా పోతున్నాయని వాపోతూ ఆందోళనకు దిగినా పట్టించుకునే వారే లేరని  రైతులు మండిపడుతున్నారు. కొత్తపల్లి మండలం రమణక్కపేట, నాగులాపల్లి గ్రామాల మధ్యలో గత నెల రోజులుగా పొక్లైన్లతో చెరువుల తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. సంబంధితాధికారులకు భారీగా ముడుపులు ముడుతుండడంతో అటువైపు   కన్నెత్తి చూడడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.

వ్యవసాయం కనుమరుగు కానుందా..?
కాకినాడ ప్రత్యేక ఆర్ధిక మండలి (కేఎస్‌ఈజెడ్‌) కోసం కొత్తపల్లి, తొండంగి మండలాల్లో సుమారు 10 వేల ఎకరాలు స్వాధీనం చేసుకున్నారు. కొత్తపల్లి మండలం తీర ప్రాంతాన్ని ఆనుకుని ఉన్న గ్రామాల్లో వరి పంట పొలాలు సుమారు 2 వేల ఎకరాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. వాటిపై ఆధారపడి 4 వేల మంది రైతులు, 10 వేల మంది వ్యవసాయ కూలీలు, పరోక్షంగా మరో 10 వేల మంది వ్యాపారులు, ఇతర వర్గాలు జీవిస్తున్నారు. ఉన్న కొద్ది పంట పొలాలను సాగుచేసుకుని జీవిస్తున్న వీరిపై రొయ్యల చెరువుల తవ్వకాలు తీవ్ర ప్రభావం చూపనున్నాయంటున్నారు. ప్రస్తుతం వందల ఎకరాల పంట పొలాల మధ్యచెరువులు తవ్వడం వల్ల కలుషిత జలాలు విడుదలై చుట్టుపక్కల పొలాలు పనికిరాకుండాపోతాయని రైతులు వాపోతున్నారు. అత్యంత వ్యవసాయాధారమైన ఇక్కడి పంట కాలువ పెదేరులో ఈ కలుషిత జలాలు కలవడంతో అన్ని పంటలపై తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.

అధికార పార్టీ నేతల అరాచకం..
రైతుల అభివృద్ధే తమ ధ్యేయమంటూ ప్రకటనలు గుప్పించే అధికార పార్టీ నేతలు ప్రత్యక్షంగా వ్యవసాయాన్ని నాశనం చేస్తూ వాటిపై ఆధారపడి జీవిస్తున్న తమ పొట్టకొడుతున్నారని స్థానిక రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడి పంట పొలాలపై కన్నేసిన కాకినాడ రూరల్‌ ప్రాంతానికి చెందిన ఓ అధికార పార్టీ నేత ఆ పొలాలను లీజు పేరుతో తన సొంతం చేసుకుని ఆ పార్టీ నేతల అండదండలతో ఎటువంటి అనుమతులు లేకుండా యథేచ్ఛగా రొయ్యల చెరువులు తవ్వకాలు చేపట్టినట్టు స్థానిక రైతులు ఆరోపిస్తున్నారు.

చెరువులు తవ్వాలంటే...
వ్యవసాయ భూముల్లో ఎటువంటి రొయ్యల చెరువులు తవ్వకూడదనే ఖచ్చితమైన నిబంధన ఉంది. చెరువులు ఒకవేళ తవ్వాల్సి వస్తే రెవెన్యూ, వ్యవసాయ, నీటిపారుదల, పొల్యూషన్, భూగర్భ, మత్స్యశాఖ వంటి 22 శాఖల అనుమతులు తీసుకోవాలి. అయితే ఇక్కడ ఎటువంటి అనుమతులు తీసుకోకుండా చెరువుల తవ్వకాలు చేపడుతున్నా సంబంధితాధికారులు ప్రేక్షకపాత్ర వహించడం గమనార్హం. ‘తమ పొలాల మధ్య అక్రమ చెరువుల తవ్వకాలు జరుగుతున్నాయని, వాటి వల్ల తమ పంట పొలాలకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉందని అధికారులకు స్థానిక రైతులు ఫిర్యాదు చేసినా అరణ్య రోదనవుతుందేతప్ప సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. ఇప్పటికే సుమారు 150 ఎకరాల్లో తవ్వకాల కోసం పచ్చని చెట్లను కూల్చేశారని, పొలాల గట్లను తీసేస్తున్నారని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు వెంటనే జోక్యంచేసుకొని అక్రమ చెరువుల తవ్వకాలను నిలిపివేసి ... తమ పొలాలకు రక్షణ కల్పించాలని రైతులు విజ్ఞప్తి చేస్తున్నారు. అధికారులు పట్టించుకోకపోవడంతో కొందరు రైతులు న్యాయస్థానాన్ని ఆశ్రయించినట్లు తెలిసింది. 

మాకేం సంబంధం...
ఈ విషయంపై కొత్తపల్లి తహసీల్దారు రత్నకుమారిని వివరణ కోరగా ఏదైనా కట్టడం కడితే తప్ప వ్యవసాయ భూముల్లో ఏమి చేసుకున్నా మాకు సంబంధం లేదు. పట్టించుకోవాల్సిన అవసరం కూడా లేదన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement