రొయ్య రైతుకు జగన్‌ సర్కారు భరోసా | Good News For Aqua Farmers In AP | Sakshi
Sakshi News home page

రొయ్య రైతుకు జగన్‌ సర్కారు భరోసా

Published Thu, Jul 4 2019 8:58 AM | Last Updated on Thu, Jul 4 2019 8:58 AM

Good News For Aqua Farmers In AP - Sakshi

సాక్షి ప్రతినిధి, ఒంగోలు: ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు కష్టాల్లో ఉన్న ఆక్వా రైతులను ఆదుకొనేందుకు జగన్‌ సర్కార్‌ సిద్ధమైంది. గత ప్రభుత్వ హయాంలో ఉన్న యూనిట్‌ విద్యుత్‌ చార్జీని రూ.1.50కి తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మంగళవారం జీఓఆర్‌టీ నంబర్‌ 70 విడుదల చేసింది. దీనివల్ల రొయ్యల చెరువులు సాగు చేస్తున్న రైతుల విద్యుత్‌ చార్జీలు మరింత తగ్గనున్నాయి. జిల్లా పరిధిలో వేటపాలెం, కొత్తపట్నం, ఒంగోలు రూరల్, సింగరాయకొండ, టంగుటూరు, చినగంజాం, చీరాల, ఉలవపాడు, గుడ్లూరు, నాగులుప్పలపాడు, జరుగుమల్లి మండలాల్లో 28 వేల ఎకరాల్లో రైతులు రొయ్యల సాగు చేస్తున్నారు. వీటి పరిధిలో 2,530 కేటగిరి–3 విద్యుత్‌ సర్వీసులున్నాయి. గత టీడీపీ ప్రభుత్వం రొయ్యల చెరువుల విద్యుత్‌ చార్జీలు యూనిట్‌కు రూ.3.86 చొప్పన నాలుగేళ్లపాటు వసూలు చేసింది. ఎన్నికలకు ముందుకు వైఎస్‌.జగన్‌ మోహన్‌రెడ్డి హామీ ఇచ్చిన తర్వాత యూనిట్‌ చార్జి రూ.2కు తగ్గించింది.

దీనివల్ల ఒక పంట కాలానికి రూ.60 వేలు విద్యుత్‌ చార్జి కట్టాల్సి వస్తోంది. జగన్‌ సర్కార్‌ యూనిట్‌కు మరో 50 పైసలు తగ్గించడం వల్ల ఒక్కో ఎకరాకు నాలుగు నెలల పంట కాలానికి విద్యుత్‌ చార్జి రూ.45 వేలకు తగ్గుతోంది. దీనివల్ల ఒక పంట కాలానికి రూ.15 వేలు తగ్గనున్నాయి. ఈ లెక్కన జిల్లాలో 28 వేల ఎకరాలలో ఉన్న రొయ్యల చెరువుల సాగుకు ఒక పంటకు రూ.42 కోట్ల విద్యుత్‌ చార్జీలు తగ్గనున్నాయి. ఈ లెక్కన రొయ్య రైతులకు ఒక పంటకు రూ.42 కోట్లు మిగిలినట్లే లెక్క. దీంతో  రొయ్య రైతులకు మరింత ప్రయోజనం చేకూరనుంది.

జిల్లాలో ఆక్వా సాగు విస్తీర్ణం : 28,000 ఎకరాలు
వీటి పరిధిలో కేటగిరి–3 విద్యుత్‌ సర్వీసులు సంఖ్య: 2,530 
చార్జీల తగ్గింపుతో ఒక పంట కాలానికి తగ్గనున్న భారం : రూ.42 కోట్లు 

మాట నిలబెట్టుకున్న జగన్‌..
అసలే రొయ్యకు గిట్టుబాటు ధర లేక  రైతులు తీవ్రంగా నష్టపోతున్న పరిస్థితిలో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ విద్యుత్‌ చార్జి భారం తగ్గించడంపై సర్వత్రా హర్షం వ్యక్తమౌతోంది. ఆక్వా రైతులు సంబరాలు చేసుకుంటున్నారు. ఏడాది క్రితం వరకూ రొయ్యల చెరువుల విద్యుత్‌ చార్జీలు యూనిట్‌కు రూ.3.86 గా ఉంది. విద్యుత్‌ చార్జీ భారం తగ్గించాలని రైతాంగం నెత్తీ నోరు బాదుకున్నా నాలుగేళ్లపాటు గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో భారం భరించలేక చాలామంది రైతులు రొయ్యల సాగుకు స్వస్తి చెప్పాల్సి వచ్చింది. దీంతో జిల్లాలో రొయ్యల సాగు మరింతగా తగ్గింది. రైతులు పలుమార్లు చార్జీలు తగ్గించాలని కోరారు.

అప్పట్లో చంద్రబాబు పట్టించుకోక పోవడంతో అప్పటి ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి విద్యుత్‌ చార్జీలు తగ్గించాలని రైతులు కోరారు. వారి సమస్యలను పరిశీలించిన వైఎస్‌ జగన్‌ అధికారంలోకి వచ్చిన వెంటనే యూనిట్‌ విద్యుత్‌ చార్జీలను రూ.1.50కి తగ్గిస్తానని హామీ ఇచ్చారు. ఆ మేరకు చార్జీలు తగ్గిస్తూ జీఓ జారీ చేసి హామీని నెరవేర్చారు. సీఎం జగన్‌ మాట నిలబెట్టుకోవడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతోంది.

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

విద్యుత్‌ చార్జీలు తగ్గిస్తూ ఇచ్చిన జీవో

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement