కొండాపురం గ్రామంలో నీట మునిగిన వరిపంట
రేగోడ్: మండలంలో శనివారం రాత్రి భారీ వర్షం కురిసింది. కొండాపురంలో వరి, కంది, తొగరి, పత్తి పంటలు 400 ఎకరాల్లో నీట మునిగింది. చెరువు అలుగు పొంగి ఇళ్ల వద్దకు వర్షపు నీరు చేరింది. రాయిలొంక తండాలో 15 ఎకరాల్లో పంటలు నీళ్లల్లో మునిగాయి. పెద్దతండా, జగిర్యాల, దుద్యాల, మర్పల్లి, లక్యానాయక్ తండా, రేగోడ్, చౌదర్‌పల్లి, ప్యారారం, సిందోల్, తాటిపల్లి, ఆర్.ఇటిక్యాల, గజ్వాడ, దేవునూర్, ఖాదిరాబాద్, నిర్జప్ల, ఉసిరికపల్లి తదితర గ్రామాలు, తండాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగాయి.
వేలాది రూపాయలు పెట్టుబడులు పెట్టినా పంటలు చేతికొచ్చే స్థితిలో లేవన్నారు. లక్షలాది రూపాయలు నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం స్పందించి పంటనష్టపరిహారం మంజూరు చేయాలని కోరుతున్నారు. వర్షం కారణంగా మేడికుంద, ఆయా తండాల్లో శనివారం రాత్రి కరెంటు సరఫరా నిలిచింది. దీంతో ప్రజలు రాత్రి ఇబ్బందులు ఎదుర్కొన్నారు.