సాక్షి, హైదరాబాద్: నైరుతి రాజస్థాన్ మీదుగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రంపైనా ఉంటుందని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయని వివరించింది.
శని, ఆదివారాల్లోనూ రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. మరోవైపు దక్షిణ తమిళనాడు నుండి ఉత్తర కొంకణ్ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి శుక్రవారానికి అంతర్గత తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది.
ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులున్న చోట గాలి వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల చొప్పున ఉంటుందని హెచ్చరించింది. కొన్నిచోట్ల వడగళ్లతో కూడిన భారీవర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది.
ఏపీలో భారీ వర్షాలు
ఏపీలో ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో మూడు రోజులపాటు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది.
Comments
Please login to add a commentAdd a comment