lightnings
-
నేడు, రేపు పలుచోట్ల మోస్తరు వానలు
సాక్షి, హైదరాబాద్: నైరుతి రాజస్థాన్ మీదుగా మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్ మీదుగా ఉపరితల ద్రోణి కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావం రాష్ట్రంపైనా ఉంటుందని, రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో వానలు కురుస్తున్నాయని వివరించింది. శని, ఆదివారాల్లోనూ రాష్ట్రంలోని పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వివరించింది. మరోవైపు దక్షిణ తమిళనాడు నుండి ఉత్తర కొంకణ్ వరకు కొనసాగిన ఉపరితల ద్రోణి శుక్రవారానికి అంతర్గత తమిళనాడు నుంచి రాయలసీమ, తెలంగాణ, విదర్భ మీదుగా కొనసాగుతున్నట్లు వాతావరణ శాఖ పేర్కొంది. ఇది సముద్రమట్టానికి 0.9 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతున్నట్లు తెలిపింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని పలుచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ఈదురుగాలులున్న చోట గాలి వేగం గంటకు 30 నుండి 40 కిలోమీటర్ల చొప్పున ఉంటుందని హెచ్చరించింది. కొన్నిచోట్ల వడగళ్లతో కూడిన భారీవర్షాలు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వివరించింది. ఏపీలో భారీ వర్షాలు ఏపీలో ద్రోణులు, ఆవర్తనాల ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఇవి మరో మూడు రోజులపాటు కురుస్తాయని భారత వాతావరణ విభాగం తెలిపింది. కొన్ని ప్రాంతాల్లో శని, ఆదివారాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. -
మెరుపులనే దారి మళ్లించారు!
పారిస్: మెరుపంటేనే వేగానికి పెట్టింది పేరు. వేగానికి అత్యుత్తమ ఉపమానం కూడా. మెరుపు వేగం గంటకు ఏకంగా 4.3 లక్షల కిలోమీటర్ల దాకా ఉంటుంది. మెరుపుల ఫలితంగా విను వీధిలో మన కంటికి కనిపించే కాంతులైతే నిజంగా కాంతి వేగంతోనే (సెకను 3 లక్షల కిలోమీటర్లు) దూసుకెళ్తాయి. అలాంటి మెరుపులను దారి మళ్లించగలిగితే? ఫ్రెంచి పరిశోధకులు తాజాగా అలాంటి ఘనతే సాధించారు!! అతి శక్తిమంతమైన లేజర్ కిరణాల ద్వారా వాటి దారిని విజయవంతంగా మార్చగలిగారు. పిడుగుపాటు బారినుంచి రక్షించే వ్యవస్థల్లో ఇది విప్లవాత్మక మార్పులు తేగలదని భావిస్తున్నారు. మెరుపును అనుసరిస్తూ వచ్చి పడే పిడుగుల వల్ల భవనాలు, సమాచార వ్యవస్థ, విద్యుత్ ఉపకరణాలు, సరఫరా లైన్లు దెబ్బ తిని ఏటా వందలాది కోట్ల డాలర్ల మేరకు నష్టం వాటిల్లడమే గాక వేలాది మంది ప్రాణాలు కోల్పోతుండటం తెలిసిందే. ఈ టెక్నాలజీని మరింతగా అభివృద్ధి చేయగలిగితే దీని సాయంతో విమానాశ్రయాలు, భారీ విద్యుత్కేంద్రాలు, ఉపగ్రహాల లాంచింగ్ ప్యాడ్ల వంటి భారీ నిర్మాణాలకు పిడుగుపాట్ల నుంచి పూర్తిస్థాయి రక్షణ కల్పించవచ్చని చెబుతున్నారు. ఫ్రాన్స్‌లోని ఎకోల్ పాలిటెక్నిక్స్ లేబొరేటరీ ఆఫ్ అప్లైడ్ ఆప్టిక్స్కు చెందిన పరిశోధకులు అత్యంత శక్తిమంతమైన లేజర్ పరికరాల సాయంతో ఈ ప్రయోగానికి పూనుకున్నారు. ఇందుకోసం ఏకంగా మూడు టన్నుల బరువు, కారు పరిమాణమున్న లేజర్ పరికరాన్ని ఈశాన్య స్విట్జర్లాండ్‌లోని శాంటిస్ పర్వత శిఖరంపై 2,500 మీటర్ల ఎత్తున ఏర్పాటు చేశారు. దానిద్వారా సెకనుకు ఏకంగా 1,000కి పైగా అతి శక్తిమంతమైన కిరణాలను ఆకాశంలో మెరుపులకేసి పంపించారు. తొలి ప్రయత్నంలోనే వాటి దారిని 160 అడుగుల దాకా మళ్లించగలిగారు. రెండు హైస్పీడ్ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాల ద్వారా దీన్ని గుర్తించారు. ‘‘అతి శక్తిమంతమైన లేజర్ కిరణాలను ఆకాశంలోకి పంపినప్పుడు శక్తిమంతమైన కాంతితో కూడిన ఫిలమెంట్లు ఏర్పడతాయి. అవి గాలిలోని నైట్రోజన్, ఆక్సిజన్ అణువులను అయానీకరిస్తాయి. ఈ చర్య ఫలితంగా స్వేచ్ఛగా కదలాగే ఎలక్ట్రాన్లు విడుదలవుతాయి. ప్లాస్మాగా పిలిచే ఈ అయానీకరణ చెందిన గాలి ఎలక్ట్రాన్ల వాహకంగా పని చేస్తుంది’’ అంటూ ఈ టెక్నాలజీ పని చేసే తీరును డిపార్ట్మెంట్ ఆఫ్ అప్లైడ్ సైన్సెస్‌కు చెందిన ప్రొఫెసర్ జీన్ పియరీ వూల్ఫ్ వివరించారు. నిజానికి ఈ కాన్సెప్టును తొలుత 1970ల్లోనే ప్రతిపాదించినా ఇప్పటిదాకా ల్యాబుల్లోనే ప్రయోగించి చూశారు. బయటి వాతావరణంలో ప్రయోగం జరపడం ఇదే తొలిసారి. ఈ పరిశోధన ఫలితాలు జర్నల్ నేచర్ ఫోటానిక్స్‌లో పబ్లిషయ్యాయి. వీటి సాయంతో పిడుగుపాటు నుంచి కాపాడే వ్యవస్థల్లో విప్లవాత్మక మార్పులు తేగల హై పవర్ లేజర్ టెక్నాలజీని అభివృద్ధి చేసే పనిలో సైంటిస్టులు బిజీగా ఉన్నారు! -
770 కిలోమీటర్ల మేర మెరుపు.. ఇది ఆకాశంలో అద్భుతమేనా?
న్యూయార్క్: అమెరికాలో 2020 ఏప్రిల్‌లో దాదాపు 770 కిలోమీటర్ల మేర వ్యాపించిన రికార్డు మెరుపు చిత్రమిది. మిసిసిపీ, లూసియానా, టెక్సాస్‌ల మీదుగా విస్తరించిన ఈ మెరుపు గత రికార్డు కంటే 60 కిలోమీటర్ల మేర అధికంగా వ్యాపించిందని ప్రపంచ వాతావరణ సంస్థ (డబ్ల్యూఎంఓ) తాజాగా వెల్లడించింది. మెరుపులకు సంబంధించి మరో ప్రపంచ రికార్డును కూడా డబ్ల్యూఎంఓ నమోదు చేసింది. 2020 జూన్‌లో ఉరుగ్వే, ఉత్తర అర్జెంటీనాపై ఏర్పడిన ఓ మెరుపు ఏకంగా 17.1 సెకన్లపాటు నిలిచినట్లు తెలిపింది. గత రికార్డు కంటే ఇది 0.37 సెకన్లు ఎక్కువ సమయం నిలిచింది. ఇది ఆకాశంలో అద్భుతంగా చదవండి: ట్రూడో టార్గెట్‌గా ఆందోళనలు -
మొబైల్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన పిల్లలు.. అంతలోనే ఒక్కసారిగా
ముంబై: మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటుసుకుంది. మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం చెట్టెక్కిన 15 ఏళ్ల బాలుడు పిడుగుపాటుకు మృతి చెందాడు. మరో ముగ్గురు పిల్లలకు గాయాలయ్యాయి. తహసీల్దార్ రాహుల్ సారంగ్ తెలిపిన వివరాల ప్రకారం.. సోమవారం సాయంత్రం దహను తాలూకాలోని మంకర్పాడ వద్ద నలుగురు బాలురు పశువులను మేపడానికి బయటకు వెళ్లారు. సోమవారం జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది. దీంతో వాతవరణ ప్రతికూల పరిస్థితుల్లో మొబైల్ ఫోన్ సిగ్నల్ కు రాలేదు. ఈ క్రమంలో మొబైల్ ఫోన్ సిగ్నల్ కోసం నలుగురు పిల్లలు కలిసి చెట్టెక్కారు. అదే సమయంలో ఒక్క సారిగా పిడుగు పడడంతో రవీంద్ర కోర్డా (15) అనే బాలుడు మృతి చెందాడు. మరో మగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా 14 నుంచి 16 సంవత్సరాల మధ్య ఉన్న వారే. గాయపడిన పిల్లల్ని కాసా గ్రామీణ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు అధికారులు తెలిపారు. చదవండి: మహిళకు ఒకే రోజు మూడు డోసుల వ్యాక్సిన్ -
నేడు వాయుగుండం
సాక్షి, అమరావతి/ విశాఖపట్నం/ శ్రీకాళహస్తి రూరల్: ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తర అండమాన్ సముద్రం దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపో ఆవరణం వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. శనివారం సాయంత్రం నాటికి అల్పపీడనం బలపడి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది. తదుపరి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తరాంధ్రలో ఈ నెల 12న తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో కోస్తా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుందనీ, తీరం వెంబడి గంటకు 45 నుంచి గరిష్టంగా 65 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. 3 రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు. పిడుగుపాటుకు ఆర్టీసీ ఉద్యోగి మృతి పిడుగుపాటుకు ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో చోటుచేసుకుంది. కొత్తపాళెంమిట్ట గ్రామానికి చెందిన టి.సుబ్రహ్మణ్యం (35) శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో మెకానిక్ పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తికి వచ్చిన ఆయన భార్యతో కలసి ద్విచక్రవాహనంపై గ్రామానికి బయలు దేరారు. మార్గం మధ్యలో అమ్మపాళెం సమీపంలోకి రాగానే భారీగా వర్షం పడుతుండటంతో ఓ చెట్టుకింద ఆగారు. అదే సమయంలో పిడుగు పడటంతో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందారు. భార్య గౌరి స్పల్ప గాయాలతో బయటపడ్డారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అదేవిధంగా పెద్దపంజాణి మండలంలోనూ పిడుగుపాటుకు ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు. -
గోదావరి, కృష్ణా పోటాపోటీ
సాక్షి, అమరావతి/నెట్వర్క్: తెలంగాణలోని శ్రీరాంసాగర్ ప్రాజెక్టు (ఎస్సారెస్పీ) దిగువ నుంచి ఆంధ్రప్రదేశ్‌లోని ధవళేశ్వరం వరకూ గోదావరి నిండుకుండలా ప్రవహిస్తుంటే.. పులిచింతల ప్రాజెక్టు దిగువ నుంచి కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతోంది. ధవళేశ్వరం బ్యారేజీ నుంచి 4,35,061 క్యూసెక్కుల గోదావరి వరద నీళ్లు సముద్రంలోకి వదులుతుండగా.. ప్రకాశం బ్యారేజీ నుంచి 45 వేల క్యూసెక్కులను దిగువకు విడుదల చేస్తున్నారు. తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తోండటంతో కడెం, ర్యాలీ, గొల్లవాగులు, ప్రాణహిత, ఇంద్రా వతి, శబరి, తాలిపేరు, కిన్నెరసాని, సీలేరు వంటి ఉపనదులు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో గోదావరికి వరద పోటెత్తింది. తెలంగాణలో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండిపోవడంతో వచ్చిన వరదను వచ్చినట్టుగా దిగువకు విడుదల చేస్తున్నారు. అలాగే, ప్రాణహిత, ఇంద్రావతి, శబరి, కిన్నెరసాని, తాలిపేరు నదుల నుంచి వరద భారీగా వస్తుండటంతో భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. మరోవైపు.. ఉపనదులు పొంగిపొర్లుతుండటంతో ధవళేశ్వరం బ్యారేజీ వద్దకు సోమవారం 4,42,661 క్యూసెక్కుల ప్రవాహం వచ్చింది. ఇందులో 7,600 క్యూసెక్కులు డెల్టా కాలువలకు విడుదల చేసి.. మిగతా 4,35,061 క్యూసెక్కులు సముద్రంలోకి వదిలారు. దాంతో ఈ సీజన్లో ఇప్పటివరకూ.. 681.015 టీఎంసీల గోదావరి జలాలు కడలిపాలయ్యాయి. శ్రీశైలంలోకి నిలకడగా వరద కృష్ణా నదిలో ఎగువన వరద ప్రవాహం నిలకడగా ఉంది. ఆల్మట్టి, నారాయణపూర్ జలాశయాల్లోకి వచ్చిన వరదను కాలువలకు విడుదల చేసి, మిగులుగా ఉన్న జలాలను విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా దిగువకు విడుదల చేస్తున్నారు. జూరాలకు 25,636 క్యూసెక్కులు రాగా కాలువలు, బీమా, కోయిల్‌సాగర్, బీమా ఎత్తిపోతలు.. విద్యుదుత్పత్తి కేంద్రం ద్వారా 28,240 క్యూసెక్కులు వదులుతున్నారు. తుంగభద్రలో వరద తగ్గుముఖం పట్టింది. సోమవారం తుంగభద్ర జలాశయంలోకి 56,893 క్యూసెక్కులు రాగా.. 66,721 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ఈ జలాలు సుంకేసుల బ్యారేజీ మీదుగా కృష్ణా నదలోకి చేరుతున్నాయి. జూరాల, తుంగభద్ర జలాశయాల నుంచి విడుదల చేసిన వరద జలాల్లో శ్రీశైలం జలాశయంలోకి 63,369 క్యూసెక్కులు చేరుతుండగా.. పోతిరెడ్డిపాడు, హంద్రీ–నీవా, కల్వకుర్తి ఎత్తిపోతలకు, విద్యుదుత్పత్తి కేంద్రాల ద్వారా నాగార్జునసాగర్‌కు 45,790 క్యూసెక్కులు వదులుతున్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 870.9 అడుగుల్లో 145.50 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. నాగార్జునసాగర్‌లోకి 23,485 క్యూసెక్కులు వస్తుండగా.. కుడి కాలువ, ఏమ్మార్పీల ద్వారా 3,944 క్యూసెక్కులు వదలుతున్నారు. ప్రస్తుతం నాగార్జునసాగర్‌లో 521.2 అడుగుల్లో 151.47 టీఎంసీలు నిల్వ ఉన్నాయి. ప్రకాశం బ్యారేజీలోకి భారీ వరద తెలంగాణలోని ఖమ్మం, రాష్ట్రంలో గుంటూరు, కృష్ణా జిల్లాలో కురుస్తున్న వర్షాలకు మున్నేరు, వైరా, కట్టలేరు వాగులు పొంగిపొర్లుతున్నాయి. దాంతో పులిచింతలకు దిగువన కృష్ణా నది పరవళ్లు తొక్కుతోంది. సోమవారం సాయంత్రం ఐదు గంటలకు ప్రకాశం బ్యారేజీలోకి 51,168 క్యూసెక్కులు చేరుతుండగా.. కాలువలకు 10,618 క్యూసెక్కులు విడుదల చేసి మిగిలినవి దిగువకు వదిలారు. దాంతో ఈ సీజన్లో ఇప్పటివరకూ 3.246 టీఎంసీల కృష్ణా జలాలను ప్రకాశం బ్యారేజీ నుంచి సముద్రంలోకి విడుదల చేసినట్లయింది. అలాగే, వంశధార నదిలో వరద ఉధృతి పెరిగింది. గొట్టా బ్యారేజీలోకి 9,866 క్యూసెక్కులు వస్తుండగా.. 7,220 క్యూసెక్కులను కడలిలోకి వదిలారు. ఈ సీజన్లో ఇప్పటివరకూ 22.76 టీఎంసీల వంశధార జలాలు సముద్రం పాలయ్యాయి. కొనసాగుతున్న వర్షాలు ఇదిలా ఉంటే.. ఉపరితల ఆవర్తనం, నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు సోమవారం కూడా కొనసాగాయి. దీంతో రాష్ట్రంలో గోదావరి, కృష్ణా నదులు పరవళ్లు తొక్కుతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లాలో పోలవరం మండలం కొత్తూరు గ్రామం వద్ద లోలెవల్ కాజ్‌వేలో మూడడుగులు వరదనీరు ప్రవహిస్తోంది. ఈ కారణంగా ఏజెన్సీలోని 19 గ్రామాలకు రాకపోకలు సోమవారం నిలిచిపోయాయి. పలు కాలువలు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఈ సీజన్లో గరిష్టంగా 5,92,410 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో వరద సోమవారం రికార్డయ్యింది. ఎగువ ప్రాంతం నుంచి వరదనీరు భారీగా వస్తుండంతో ధవళేళ్వరం ఆనకట్ట వద్ద 175 గేట్లను ఎత్తివేసేందుకు అధికారులు ఏర్పాట్లుచేస్తున్నారు. గోదావరి జిల్లాలోని మూడు డెల్టాలకు 7,700 క్యూసెక్కుల నీటిని విడుదల చేస్తున్నారు. నర్సాపురంలో 400 ఎకరాలు, పెనుమంట్ర మండలంలో 500 ఎకరాలు నీటమునిగాయి. పలు ప్రాంతాల్లో డ్రెయిన్లు పొంగి పొర్లుతున్నాయి. కాగా, తూర్పు గోదావరి జిల్లా వీఆర్‌పురం మండలాన్ని ఆనుకొని ప్రవహిస్తున్న శబరి నదికి ఎగపోటు తగిలింది. ఇది మరింత పెరిగితే వీఆర్ పురం, కూనవరం మండలాల్లోని 30కి పైగా గ్రామాలు నీట మునిగే ప్రమాదం ఉంది. కృష్ణా జిల్లాలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జనజీవనం అస్తవ్యస్తంగా మారింది. వరద నీటితో పశ్చిమ కృష్ణా ప్రాంతంలో వాగులు, వంకలు, చెరువులు పొంగిపొర్లుతున్నాయి. దీంతో ఆయా ప్రాంతాల్లో రాకపోకలు స్తంభించిపోయాయి. జిల్లా వ్యాప్తంగా 38.9 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లకూడదన్న సంకేతాలు వెలువడ్డాయి. మైలవరంలో లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి నీరు ప్రవేశించినా అధికారులు పట్టించుకోవడంలేదంటూ స్థానికులు జాతీయ రహదారిపై బైఠాయించారు. ఆదివారం అర్ధరాత్రి వరద తీవ్రత ఎక్కువ కావడంతో పెనుగంచిప్రోలు మండలంలోని మునేరు కాజ్వే పైనుండి రాకపోకలను నిలిపివేశారు. పిడుగుపడి కౌలు రైతు మృతి శ్రీకాకుళం జిల్లా మందస మండలం సిరిపురం గ్రామంలో పొలం పనులు చేసుకుంటున్న కౌలురైతు హరిశ్చంద్రప్రసాద్ (55)పై పిడుగుపడడంతో మృత్యువాత పడ్డాడు. జిల్లా వ్యాప్తంగా సోమవారం కూడా జల్లులు కురిసాయి. భారీ వర్షాలు లేకపోవడంతో శ్రీకాకుళం ఆర్ట్స్ కళాశాల మైదానంలో 15న జరగనున్న రాష్ట్రస్థాయి స్వాత్యంత్య్ర వేడుకల పనులను అధికారులు ముమ్మరం చేశారు. -
పిడుగులు పడి ఏడుగురు మృతి
రాష్ట్రవ్యాప్తంగా శనివారం కురిసిన భారీ వర్షాలకు పిడుగులు పడి ఏడుగురు మరణించారు. వర్ష బీభత్సంతో వందలాది మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. పిడుగులు పడటంతో చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కృష్ణా జిల్లా, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పంటలకు భారీ నష్టం జరిగింది. సాక్షి, నెట్వర్క్: చిత్తూరు జిల్లాలో శనివారం సాయంత్రం పిడుగులతో కూడిన గాలి వాన బీభత్సం సృష్టించింది. వెదురుకుప్పం మండలం బలిజపల్లెలో పిడుగుపడడంతో సోకమ్మ (55), శ్రీకాళహస్తి మండలం దొడ్లమిట్టలో మహేంద్రమ్మ (45) మరణించారు. వెదురుకుప్పం, ఎస్ఆర్పురం, పెనుమూరు, నిమ్మనపల్లె మండలాల్లోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో కూడా పిడుగులు పడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు గాయపడ్డారు. 37 మేకలు పిడుగుపాటుకి ప్రాణాలు కోల్పోయాయి. హిరమండలం భగీరథపురం వద్ద పిడుగుపడి గంగి రాజు (38) మరణించాడు. వంగర మండలం సంగాం గ్రామానికి చెందిన బొమ్మాళి గణేష్ (23) పిడుగులు పడటంతో మృత్యువాత పడ్డాడు. పాలకొండ మండలం ఓని వద్ద పిడుగు పడడంతో గొర్రెల కాపర్లు కొండ్రు శంకర్, ఊలక వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం జిల్లాలో విజయనగరం, ఎస్.కోట, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, తెర్లాం, రామభద్రపురం, బాడంగి మండలాల్లో భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడింది. మెంటాడ మండలం అమరాయవలసలో పిడుగుపడటంతో మాదిరెడ్డి రామకృష్ణ (28) మృతి చెందాడు. కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం పట్టపాలెం గ్రామానికి చెందిన సీతయ్య (48) పొలానికి వెళ్లగా పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నూజివీడు, నందిగామ నియోజకవర్గాల్లో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది. ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పాత భవనంపై పిడుగుపడింది. పునాది శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సంగం మండలం జంగాలకండ్రిగకు చెందిన మత్స్యకారుడు కనిగిరి రిజర్వాయర్‌లో చేపలవేటకు వెళ్లి తిరిగి వస్తూ పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. బుచ్చిరెడ్డిపాళెం మండలం శ్రీపురంధరాపురానికి చెందిన గొర్రెల కాపరి తాటిచెట్టు కింద నిలబడి ఉండగా పిడుగుపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రకాశం జిల్లాలో పలుచోట్ల గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చీరాల మండలంలో ఈదురుగాలులకు ఫ్లెక్సీలు, హోర్డింగులు నేలకొరిగాయి. పిడుగుపాటుకు 10 గొర్రెలు మృతిచెందాయి. పెద్దారవీడు మండలంలో పత్తి మొక్కలు దెబ్బతిన్నాయి. గుడ్లూరు మండలంలో మామిడి కాయలు రాలాయి. ఇటుక బట్టీలకు నష్టం వాటిల్లింది. ఇదే మండలం చెంచురెడ్డిపాలెంలో పిడుగుపాటుకు గేదె మృతి చెందింది. నాగర్ కర్నూల్ జిల్లా (తెలంగాణ) అమ్రాబాద్ మండల పరిధిలోని శ్రీశైలం ఆనకట్ట ఘాట్ రోడ్డులో వర్షంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఎస్పీఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు ప్రొక్లెయిన్‌తో బండరాళ్లను తొలగించారు. దీంతో దాదాపు మూడుగంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. నాలుగు రోజులపాటు వర్షాలు ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంపై తమిళనాడు కోస్తా తీరం ఆవల సముద్రమట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఆదివారం రాయలసీమలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని, అక్కడక్కడ పిడుగులు కూడా పడొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో తెలిపింది. అలాగే సోమ, మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగానూ, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. 5, 6 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు శనివారం సాధారణం కంటే 3 నుంచి 8 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యే రెంటచింతల (జంగమహేశ్వరపురం)లో 33.2 డిగ్రీలు నమోదైంది. నెల్లూరులో 40.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గత 24 గంటల్లో ఆత్మకూరు, శ్రీశైలంలలో 8, పుత్తూరు, నంద్యాలలో 7, పాకాలలో 6, భీమిలిలో 4, నగరిలో 3, రాపూరు, లేపాక్షి, ఆగలి, మదన పల్లెల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. 5న రాష్ట్రానికి ‘నైరుతి’ రాక నైరుతి రుతుపవనాలు ఈ నెల 5న రాయలసీమలో ప్రవేశించనున్నాయి. గత నెల 29న కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించాయి. ఇవి ఈ నెల 5న నాటికి కర్ణాటక నుంచి రాయలసీమలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ‘ప్రస్తుతం రాయలసీమ, కోస్తా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు రుతుపవనాల రాకకు ముందస్తు సంకేతాలు. రుతుపవనాలు ప్రవేశిస్తే ఆ ప్రాంతమంతా విస్తారంగా వర్షాలు కురుస్తాయి. 60 శాతం ప్రాంతాల్లో రెండు రోజులు వరుసగా వర్షాలు కురిస్తేనే రుతుపవనాలు ప్రవేశించినట్లు నిర్ధారిస్తాం. ఆకాశం మేఘావృతం కావడం, చల్లని గాలులు వీయడం, విస్తారంగా వర్షాలు కురవడం రుతుపవనాల రాకను నిర్ధారించడానికి సూచికలు’ అని వైకే రెడ్డి వివరించారు. కాగా.. రుతుపవనాలు రాయల సీమలో ప్రవేశించిన తర్వాత వాతావరణం అనుకూలంగా ఉంటే వెంటనే కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణకు కూడా విస్తారిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిటైర్డ్ అధికారి నరసింహారావు వెల్లడించారు. -
పిడుగు కాటు
-
గాలి వాన బీభత్సం
-
గాలి వాన బీభత్సం
కోవెలకుంట్ల, న్యూస్‌లైన్: వాతావరణంలో ఒక్కసారిగా మార్పులు చోటు చేసుకున్నాయి. సోమవారం ఉదయం ఎండ తీవ్రత అధికంగా ఉండటం, విద్యుత్ కోతల కారణంగా ప్రజలు ఉక్కపోతతో అల్లాడిపోయారు. సాయంత్రం ఆకాశం మేఘావృతమై ఉరుములు, మెరుపులు, పెనుగాలలతో కూడిన భారీవర్షం కురిసింది. గుళ్లదూర్తి, పొట్టిపాడు, కంపమల్ల, హరివరం, అల్లూరు, తదితర గ్రామాల్లో ఒక మోస్తారు నుంచి భారీ వర్షం కురవడంతో పొలాల్లో వర్షపు నీరు చేరింది. పెనుగాలుల కారణంగా కోవెలకుంట్ల- జమ్మలమడుగు ఆర్అండ్బీ రహదారిలో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డారు. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో కురిసిన తొలకరి వాన రైతులకు ఊరట నిచ్చింది. వేసవికాలం కావడంతో ఉక్కపోత నుంచి ప్రజలకు ఉపశమనం లభించింది. నేలకొరిగిన విద్యుత్ స్తంభాలు ఆళ్లగడ్డటౌన్: ఆళ్లగడ్డ ప్రాంతంలో సోమవారం సాయంత్రం గాలివాన బీభత్సానికి విద్యుత్ స్తంభాలు, మహా వృక్షాలు నేలకొరిగాయి. ఫలితంగా వాహనాల రాక పోకలకు, విద్యుత్ సరఫరాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. నగర పంచాయతీ పరిధిలోని చింతకుంటలో కోవెలకుంట్ల మార్గంలో ఉన్న వందల సంవత్సరాల నాటి గుర్రమ్మమాను కూకటి వేళ్లతో సహా నేలకొరిగింది. ఆ సమయంలో రోడ్లపై ఎవరు లేకపోవడంతో ఎలాంటి నష్టం జరగలేదు. పలు చోట్ల విద్యుత్ స్తంభాలు విరిగి పడ్డాయి. అదృష్ట వశాత్తు ఆ సమయంలో విద్యుత్ సర ఫరా లేకపోవడంతో ఘోరప్రమాదం తప్పింది. చెట్టు విరగడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. సంజామలలో పిడుగుపాటు కోవెలకుంట్ల రూరల్: మండల కేంద్రం సంజామలలో సోమవారం సాయంత్రం పిడుగుపడింది. పెనుగాలుల వీస్తూ ఉరుములు, మెరుపులుతో కూడిన వర్షం పడింది. ఈ సమయంలో గ్రామంలోని బీసీ కాలనీలో వెంకటరామకృష్ణుడు, గాండ్లవెంకటరామయ్య, గొల్లసంజన్న ఇళ్ల మధ్య ఉన్న కంపచెట్లపై పిడుగుపడటంతో కాలనీవాసులు బెంబెలెత్తారు.