
సాక్షి, అమరావతి/ విశాఖపట్నం/ శ్రీకాళహస్తి రూరల్: ఉత్తర అండమాన్ సముద్రం, దాని పరిసర ప్రాంతాల్లో శుక్రవారం ఉదయం 5.30 గంటలకు ఏర్పడిన అల్పపీడనం.. ఉత్తర అండమాన్ సముద్రం దాన్ని ఆనుకొని ఉన్న తూర్పు మధ్య బంగాళాఖాతం పరిసరాల్లో కొనసాగుతోంది. దీనికి అనుబంధంగా మధ్యస్థ ట్రోపో ఆవరణం వరకూ ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. శనివారం సాయంత్రం నాటికి అల్పపీడనం బలపడి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా మారనుంది.
తదుపరి పశ్చిమ వాయవ్య దిశగా ప్రయాణించి ఉత్తరాంధ్రలో ఈ నెల 12న తీరం దాటే సూచనలు కనిపిస్తున్నాయని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాగల రెండు రోజుల పాటు కోస్తా, రాయలసీమల్లో విస్తారంగా, అక్కడక్కడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని పేర్కొంది. అల్పపీడనం వాయుగుండంగా మారనున్న నేపథ్యంలో కోస్తా తీరంలో సముద్రం అల్లకల్లోలంగా మారనుందనీ, తీరం వెంబడి గంటకు 45 నుంచి గరిష్టంగా 65 కి.మీ. వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని అధికారులు తెలిపారు. 3 రోజులపాటు మత్స్యకారులు వేటకు వెళ్లరాదని హెచ్చరికలు జారీ చేశారు.
పిడుగుపాటుకు ఆర్టీసీ ఉద్యోగి మృతి
పిడుగుపాటుకు ఆర్టీసీ ఉద్యోగి మృతి చెందిన ఘటన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలో చోటుచేసుకుంది. కొత్తపాళెంమిట్ట గ్రామానికి చెందిన టి.సుబ్రహ్మణ్యం (35) శ్రీకాళహస్తి ఆర్టీసీ డిపోలో మెకానిక్ పనిచేస్తున్నారు. శుక్రవారం సాయంత్రం శ్రీకాళహస్తికి వచ్చిన ఆయన భార్యతో కలసి ద్విచక్రవాహనంపై గ్రామానికి బయలు దేరారు. మార్గం మధ్యలో అమ్మపాళెం సమీపంలోకి రాగానే భారీగా వర్షం పడుతుండటంతో ఓ చెట్టుకింద ఆగారు. అదే సమయంలో పిడుగు పడటంతో సుబ్రహ్మణ్యం అక్కడికక్కడే మృతి చెందారు. భార్య గౌరి స్పల్ప గాయాలతో బయటపడ్డారు. మృతుడికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. అదేవిధంగా పెద్దపంజాణి మండలంలోనూ పిడుగుపాటుకు ఐదుగురు స్వల్పంగా గాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment