రాష్ట్రవ్యాప్తంగా శనివారం కురిసిన భారీ వర్షాలకు పిడుగులు పడి ఏడుగురు మరణించారు. వర్ష బీభత్సంతో వందలాది మూగజీవాలు మృత్యువాతపడ్డాయి. పిడుగులు పడటంతో చిత్తూరు, శ్రీకాకుళం జిల్లాల్లో ఇద్దరు చొప్పున, కృష్ణా జిల్లా, విజయనగరం, శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాల్లో ఒకరు చొప్పున మరణించారు. మరో ముగ్గురు గాయపడ్డారు. పంటలకు భారీ నష్టం జరిగింది.
సాక్షి, నెట్‌వర్క్: చిత్తూరు జిల్లాలో శనివారం సాయంత్రం పిడుగులతో కూడిన గాలి వాన బీభత్సం సృష్టించింది. వెదురుకుప్పం మండలం బలిజపల్లెలో పిడుగుపడడంతో సోకమ్మ (55), శ్రీకాళహస్తి మండలం దొడ్లమిట్టలో మహేంద్రమ్మ (45) మరణించారు. వెదురుకుప్పం, ఎస్‌ఆర్‌పురం, పెనుమూరు, నిమ్మనపల్లె మండలాల్లోని అన్ని గ్రామాల్లో విద్యుత్ సరఫరా పూర్తిగా నిలిచిపోయింది. శ్రీకాకుళం జిల్లాలో కూడా పిడుగులు పడి ఇద్దరు మృత్యువాత పడ్డారు. మరో ఇద్దరు గాయపడ్డారు. 37 మేకలు పిడుగుపాటుకి ప్రాణాలు కోల్పోయాయి. హిరమండలం భగీరథపురం వద్ద పిడుగుపడి గంగి రాజు (38) మరణించాడు. వంగర మండలం సంగాం గ్రామానికి చెందిన బొమ్మాళి గణేష్ (23) పిడుగులు పడటంతో మృత్యువాత పడ్డాడు.
పాలకొండ మండలం ఓని వద్ద పిడుగు పడడంతో గొర్రెల కాపర్లు కొండ్రు శంకర్, ఊలక వెంకటేష్ తీవ్రంగా గాయపడ్డారు. విజయనగరం జిల్లాలో విజయనగరం, ఎస్.కోట, గజపతినగరం, చీపురుపల్లి, నెల్లిమర్ల, తెర్లాం, రామభద్రపురం, బాడంగి మండలాల్లో భారీ ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులు, పిడుగులతో కూడిన వర్షం పడింది. మెంటాడ మండలం అమరాయవలసలో పిడుగుపడటంతో మాదిరెడ్డి రామకృష్ణ (28) మృతి చెందాడు. కృష్ణా జిల్లా తిరువూరు నియోజకవర్గం పట్టపాలెం గ్రామానికి చెందిన సీతయ్య (48) పొలానికి వెళ్లగా పిడుగుపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. నూజివీడు, నందిగామ నియోజకవర్గాల్లో ఈదురుగాలులకు మామిడికాయలు నేలరాలాయి. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని పలు మండలాల్లో ఈదురుగాలులతో వర్షం కురిసింది.
ఆత్మకూరులోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలోని పాత భవనంపై పిడుగుపడింది. పునాది శిక్షణకు హాజరైన ఉపాధ్యాయులు త్రుటిలో ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. సంగం మండలం జంగాలకండ్రిగకు చెందిన మత్స్యకారుడు కనిగిరి రిజర్వాయర్‌లో చేపలవేటకు వెళ్లి తిరిగి వస్తూ పిడుగుపాటుకు గురై మృతి చెందాడు. బుచ్చిరెడ్డిపాళెం మండలం శ్రీపురంధరాపురానికి చెందిన గొర్రెల కాపరి తాటిచెట్టు కింద నిలబడి ఉండగా పిడుగుపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు.
ప్రకాశం జిల్లాలో పలుచోట్ల గాలులు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చీరాల మండలంలో ఈదురుగాలులకు ఫ్లెక్సీలు, హోర్డింగులు నేలకొరిగాయి. పిడుగుపాటుకు 10 గొర్రెలు మృతిచెందాయి. పెద్దారవీడు మండలంలో పత్తి మొక్కలు దెబ్బతిన్నాయి. గుడ్లూరు మండలంలో మామిడి కాయలు రాలాయి. ఇటుక బట్టీలకు నష్టం వాటిల్లింది. ఇదే మండలం చెంచురెడ్డిపాలెంలో పిడుగుపాటుకు గేదె మృతి చెందింది. నాగర్ కర్నూల్ జిల్లా (తెలంగాణ) అమ్రాబాద్ మండల పరిధిలోని శ్రీశైలం ఆనకట్ట ఘాట్ రోడ్డులో వర్షంతో కొండచరియలు విరిగిపడ్డాయి. ఎస్‌పీఎఫ్ సిబ్బంది, స్థానిక పోలీసులు ప్రొక్లెయిన్‌తో బండరాళ్లను తొలగించారు. దీంతో దాదాపు మూడుగంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి.
నాలుగు రోజులపాటు వర్షాలు
ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు రాష్ట్రంలో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురవనున్నాయి. ప్రస్తుతం నైరుతి బంగాళాఖాతంపై తమిళనాడు కోస్తా తీరం ఆవల సముద్రమట్టానికి 3.1 కి.మీ. ఎత్తులో ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. వీటి ప్రభావంతో ఆదివారం రాయలసీమలో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షం కురుస్తుందని, అక్కడక్కడ పిడుగులు కూడా పడొచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) శనివారం రాత్రి నివేదికలో తెలిపింది.
అలాగే సోమ, మంగళ, బుధవారాల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో కొన్నిచోట్ల తేలికపాటి నుంచి మోస్తరుగానూ, అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వివరించింది. 5, 6 తేదీల్లో ఆయా ప్రాంతాల్లో ఒకట్రెండు చోట్ల అతి భారీ వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. మరోవైపు శనివారం సాధారణం కంటే 3 నుంచి 8 డిగ్రీలు తక్కువగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రంలోనే అత్యధిక ఉష్ణోగ్రతలు రికార్డయ్యే రెంటచింతల (జంగమహేశ్వరపురం)లో 33.2 డిగ్రీలు నమోదైంది. నెల్లూరులో 40.2 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. గత 24 గంటల్లో ఆత్మకూరు, శ్రీశైలంలలో 8, పుత్తూరు, నంద్యాలలో 7, పాకాలలో 6, భీమిలిలో 4, నగరిలో 3, రాపూరు, లేపాక్షి, ఆగలి, మదన పల్లెల్లో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది.
5న రాష్ట్రానికి ‘నైరుతి’ రాక
నైరుతి రుతుపవనాలు ఈ నెల 5న రాయలసీమలో ప్రవేశించనున్నాయి. గత నెల 29న కేరళలో ప్రవేశించిన రుతుపవనాలు తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు విస్తరించాయి. ఇవి ఈ నెల 5న నాటికి కర్ణాటక నుంచి రాయలసీమలో ప్రవేశించే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హైదరాబాద్ కేంద్రం డైరెక్టర్ వైకే రెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ‘ప్రస్తుతం రాయలసీమ, కోస్తా జిల్లాల్లో కురుస్తున్న వర్షాలు రుతుపవనాల రాకకు ముందస్తు సంకేతాలు. రుతుపవనాలు ప్రవేశిస్తే ఆ ప్రాంతమంతా విస్తారంగా వర్షాలు కురుస్తాయి.
60 శాతం ప్రాంతాల్లో రెండు రోజులు వరుసగా వర్షాలు కురిస్తేనే రుతుపవనాలు ప్రవేశించినట్లు నిర్ధారిస్తాం. ఆకాశం మేఘావృతం కావడం, చల్లని గాలులు వీయడం, విస్తారంగా వర్షాలు కురవడం రుతుపవనాల రాకను నిర్ధారించడానికి సూచికలు’ అని వైకే రెడ్డి వివరించారు. కాగా.. రుతుపవనాలు రాయల సీమలో ప్రవేశించిన తర్వాత వాతావరణం అనుకూలంగా ఉంటే వెంటనే కోస్తాంధ్ర జిల్లాలతో పాటు తెలంగాణకు కూడా విస్తారిస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం రిటైర్డ్ అధికారి నరసింహారావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment