పలుచోట్ల పిడుగులు పడే అవకాశం
విశాఖపట్నం (ఏయూ క్యాంపస్): నైరుతి రుతు పవనాలు మధ్య అరేబియా సముద్రంలోను, కర్ణాటకలోని మిగిలిన భాగాలు, దక్షిణ మహారాష్ట్ర, తెలంగాణ, ఉత్తరాం«ధ్ర మరికొన్ని ప్రాంతాల్లో ముందుకు సాగడానికి పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కోణంగి కూర్మనాథ్ వెల్లడించారు.
శుక్రవారం ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, పార్వతీపురం మన్యం, అల్లూరి, కాకినాడ, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, బాపట్ల, పల్నాడు జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. శనివారం అల్లూరి, కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి, వైఎస్సార్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడా పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
ఉరుములతో కూడిన వర్షం పడే సమయంలో పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, పశువుల కాపరులు చెట్లు, పోల్స్, టవర్స్ కింద, బహిరంగ ప్రదేశాల్లో ఉండరాదని సూచించారు. గురువారం సాయంత్రం 5 గంటల సమయానికి శ్రీసత్యసాయి జిల్లా నల్లచెరువులో 44 మి.మీ, నెల్లూరు జిల్లా వెంకటాచలంలో 40 మి.మీ, శ్రీ సత్యసాయి జిల్లా నంబుపూలకుంటలో 39 మి.మీ, నెల్లూరు జిల్లా సైదాపురంలో 39 మి.మీ, పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో 36 మి.మీ, తిరుపతి జిల్లా పుత్తూరులో 30 మి.మీ చొప్పున వర్షపాతం నమోదైందని వివరించారు.
తిరుమలలో భారీ వర్షం
తిరుమల: తిరుమలలో భారీ వర్షం కురిసింది. తిరుమల అంతా జలపాతాలను తలపిస్తున్నాయి. భక్తులు కొద్దిపాటి ఇబ్బందులకు గురైనా ప్రకృతి ఇస్తున్న చల్లదనాన్ని ఆస్వాదిస్తున్నారు. తిరుమలలో రోడ్లన్నీ వర్షపు నీటితో నిండిపోయాయి. భారీగా కురిసిన వర్షానికి నాలుగు మాడ వీధులు జలమయమయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment