ఈఏడాది టీబీ డ్యామ్‌లో 170 టీఎంసీల లభ్యత!
తుంగభద్ర బోర్డు, మూడు రాష్ట్రాల అధికారులు అంచనా
గతేడాది ఎల్‌నినో ప్రభావంతో బేసిన్‌లో కనిష్ట వర్షపాతం
దాంతో డ్యామ్‌లోకి 114.58 టీఎంసీల ప్రవాహం
ఆయకట్టులో ఆరుతడి పంటలు సాగుచేసుకున్న రైతులు
సాక్షి, అమరావతి: నైరుతి రుతుపవనాల ప్రభావం వల్ల ఈ ఏడాది సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని వాతావరణ సంస్థ(ఐఎండీ) అంచనాల నేపథ్యంలో ఈ ఏడాది తుంగభద్ర డ్యామ్‌లో 170 టీఎంసీల లభ్యత ఉంటుందని తుంగభద్ర బోర్డు, ఏపీ, కర్ణాటక, తెలంగాణ జలవనరుల అధికారులు అంచనా వేస్తున్నారు.
ప్రస్తుత నీటి సంవత్సరంలో అంటే ఈనెల 1 నుంచి తుంగభద్ర బేసిన్‌లో కురుస్తున్న వర్షాల ప్రభావం వల్ల ఇప్పటికి 0.67 టీఎంసీలు తుంగభద్ర డ్యామ్‌లోకి చేరాయి. ఇక శనివారం డ్యామ్‌లోకి 1,490 క్యూసెక్కులు చేరాయి. గతేడాది ఎల్‌నినో ప్రభావం వల్ల వర్షాలు సక్రమంగా కురవలేదు.
దాంతో తుంగభద్ర డ్యామ్‌లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహం వచ్చింది. తాగునీటి అవసరాలకుపోను మిగతా నీటితో ఆరుతడి పంటలను ఆయకట్టు రైతులు సాగుచేశారు. ఈ ఏడాదైనా తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత పుష్కలంగా పెరుగుతుందని.. ఆయకట్టుకు సమృద్ధిగా నీళ్లందాలని రైతులు ఆశిస్తున్నారు.
కేటాయింపుల మేరకైనా లభ్యత ఉండేనా..
తుంగభద్ర డ్యామ్‌లో 230 టీఎంసీల లభ్యత ఉంటుందని అంచనా వేసిన బచావత్ ట్రిబ్యునల్.. కర్ణాటకకు 151.49, ఏపీకి 72 (హెచ్చెల్సీ 32.50, ఎల్లెల్సీ 29.50, కేసీ 10.00), తెలంగాణకు 6.51 (రాజోలిబండ డైవర్షన్ స్కీం) టీఎంసీల చొప్పున కేటాయించింది. ఏటా పూడిక పేరుకుపోతుండటంతో డ్యామ్ నిల్వ సామర్థ్యం తగ్గుతూ వస్తోంది.
2016లో నిర్వహించిన సర్వేలో డ్యామ్ సామర్థ్యం 105.78 టీఎంసీలని తేలింది. తగ్గిన నిల్వ సామర్థ్యం.. నీటిలభ్యత ఆధారంగా దామాషా పద్ధతిలో మూడు రాష్ట్రాలకు తుంగభద్ర బోర్డు పంపిణీ చేస్తూ వస్తోంది. గతేడాది తుంగభద్ర డ్యామ్‌లోకి కేవలం 114.58 టీఎంసీల ప్రవాహమే వచ్చింది. అంటే.. బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన దాంట్లో కేవలం 49.81 శాతం మేర మాత్రమే తుంగభద్ర డ్యామ్‌లో నీటి లభ్యత ఉన్నట్లు స్పష్టమవుతోంది.
తుంగభద్ర డ్యామ్‌లోకి 2016–17లో కేవలం 85.719 టీఎంసీలే చేరాయి. డ్యామ్ చరిత్రలో అదే కనిష్ట వరద ప్రవాహం కావడం గమనార్హం. ఈ ఏడాదైనా బచావత్ ట్రిబ్యునల్ కేటాయింపుల మేరకైనా నీటి లభ్యత ఉంటుందని రైతులు ఆశిస్తున్నారు.
నాలుగేళ్లూ పుష్కలంగా నీటి లభ్యత..
తుంగభద్ర డ్యామ్‌లోకి 2015 నుంచి 2018 వరకు అరకొరగానే ప్రవాహం వచ్చింది. ఇక 2019–20 నుంచి 2022–23 వరకు నాలుగేళ్లు టీబీ డ్యామ్‌లో బచావత్ ట్రిబ్యునల్ అంచనా వేసిన దానికంటే అధికంగా లభ్యత నమోదైంది.
బేసిన్‌లో భారీ వర్షాలు కురవడంతో డ్యామ్‌లోకి వరద ప్రవాహం కొనసాగింది. నీటి లభ్యత పుష్కలంగా ఉండటంతో రాయలసీమ, కర్ణాటక, తెలంగాణలోని ఆయకట్టు రైతులు భారీ ఎత్తున పంటలు సాగుచేయడంతో సస్యశ్యామలమైంది. దిగుబడులు భారీగా రావడం.. గిట్టుబాటు ధర దక్కడంతో రైతులు సంతోషం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment