నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం
దీని ప్రభావంతో రానున్న రెండ్రోజులు రాష్ట్రంలోని పలు జిల్లాలో వర్షాలు
జీహెచ్‌ఎంసీ, సమీప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలకు అవకాశం
సాక్షి, హైదరాబాద్: నైరుతి బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం ఏర్పడినట్టు వాతావరణశాఖ సూచించింది. ఇది సముద్రమట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తున కేంద్రీకృతమైనట్టు వివరించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలోని చాలా జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వాతావరణ శాఖ వివరించింది. సోమవారం ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, మంగళవారం కొన్నిచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది.
ప్రధానంగా యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్‌మల్కాజ్‌గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్‌నగర్, నాగర్‌కర్నూల్, నారాయణపేట, జోగులాంబగద్వాల, వనపర్తి జిల్లాల్లోని కొన్నిచోట్ల భారీ వర్షాలు నమోదు కావొచ్చని వివరించింది. రానున్న రెండ్రోజులు రాష్ట్రంలో సాధారణ ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణశాఖ అధికారులు చెబుతున్నారు.
ఉత్తర ప్రాంత జిల్లాల్లో కొన్ని ప్రాంతాల్లో గరిష్ట ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 4 డిగ్రీ సెల్సియస్ అధికంగా నమోదు కావొచ్చని వివరించారు. ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన నగరాల్లో ఉష్ణోగ్రతలు పరిశీలిస్తే... గరిష్ట ఉష్ణోగ్రత ఆదిలాబాద్‌లో 43.3 డిగ్రీ సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత నల్లగొండలో 25.2 డిగ్రీ సెల్సియస్ చొప్పున నమోదయ్యాయి.
నైరుతి ఋతుపవనాలు ఆదివారం కేరళలోని మిగిలిన ప్రాంతాలు, తమిళనాడులోని మరికొన్ని ప్రాంతాలతోపాటు కర్ణాటక, ఆంధ్రపదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్టు వాతావరణశాఖ తెలిపింది. రుతుపవనాల కదలిక చురుగ్గా ఉంటే ఈనెల 5వ తేదీ నాటికి తెలంగాణలోకి ప్రవేశించే అవకాశం ఉన్నట్టు వివరించింది.
Comments
Please login to add a commentAdd a comment