
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భానుడు భగభగమన్నాడు. శుక్రవారం నాలుగు చోట్ల తీవ్ర వడగాడ్పులు, పలుచోట్ల వడగాడ్పులు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. 45 నుంచి 46 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉష్ణోగ్రతలు నమోదైతే వడగాడ్పులుగా ప్రకటిస్తారు. 47 డిగ్రీలు, ఆపైన గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదైతే తీవ్ర వడగాడ్పులుగా ప్రకటిస్తారు. ఆ ప్రకారం శుక్రవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అన్నపురెడ్డిపాలెం మండలం పెంట్లాం, నల్లగొండ జిల్లా అనుములు హాలియా మండలం హాలియా, అదే జిల్లా కనగల్, పెద్దపల్లి జిల్లా మంథనిలలో ఏకంగా 47 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం సీనియర్ అధికారి రాజారావు వెల్లడించారు.
అలాగే ఖమ్మం, కొల్వి, ధర్మపురి, దామరచర్ల, దుమ్ముగూడెం, మొగుళ్లపల్లి, జైనా, జూలూరుపాడు, ఏన్కూరు, పాత ఎల్లాపూర్, సోన్ ఐబీ, మామిడాల, జన్నారం, భోరాజ్, నామాపూర్, బొమ్మిరెడ్డిపల్లె, ఉర్లుగొండల్లో 46 డిగ్రీల చొప్పున గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక ఆదిలాబాద్, నల్లగొండ, నిజామాబాద్‌లలో 45 డిగ్రీల చొప్పున అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భద్రాచలం, హన్మకొండ, మహబూబ్‌నగర్, మెదక్, రామగుండంలలో 44 డిగ్రీల చొప్పున ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇక హైదరాబాద్‌లో 43 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. తీవ్రమైన ఉష్ణోగ్రతలు, వడగాలులతో రాష్ట్రంలో జనం ఇబ్బందులు పడ్డారు. అనేకమంది విలవిలలాడిపోయారు.
నేడు, రేపు వడగాడ్పులు..
ఉత్తర బంగ్లాదేశ్ దాని పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం బలహీనపడి అల్పపీడనంగా మారింది. దీనికి అనుబంధంగా ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. మరోవైపు రాష్ట్రంలో శని, ఆదివారాల్లో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని రాజారావు తెలిపారు. ఆదిలాబాద్, కొమురంభీం, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, మంచిర్యాల, రాజన్న సిరిసిల్ల, పెద్దపల్లి, కరీంనగర్, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, వరంగల్ అర్బన్, వరంగల్ రూరల్, నల్లగొండ, సూర్యాపేట.. మొత్తంగా 17 జిల్లాల్లో అక్కడక్కడ వడగాడ్పులు వీచే అవకాశం ఉందని ఆయన వెల్లడించారు.