చికాగో : అగ్రరాజ్యం అమెరికాను మంచు తుపాను వణికిస్తోంది. రాకీ పర్వతాల నుంచి భారీగా వీస్తున్న చలిగాలుల ధాటికి 25 రాష్ట్రాల్లో జనజీవనం స్తంభించిపోయింది. గంటకు 148 కిలోమీటర్ల వేగంతో వీస్తున్న గాలుల కారణంగా కొలరాడో, నెబ్రస్కా, డకోటాల్లోని ప్రధాన రహదారుల్లో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. హిమపాతం కారణంగా వేల సంఖ్యలో విమానాలు రద్దయ్యాయి. పాఠశాలలు మూతపడ్డాయి. మరికొన్నిచోట్ల హిమపాతంతోపాటు పిడుగులు కూడా పడుతుండటంతో అనేక ఇళ్లు ధ్వంసమయ్యాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఫలితంగా కొన్ని లక్షల కుటుంబాలు చీకట్లో మగ్గిపోయాయి.
ఇప్పటికే పలు ప్రాంతాల్లో మంచు తుపానుపై అధికారిక హెచ్చరికలు జారీ అయ్యాయి. తాజా తుపానును ‘బాంబ్ సైక్లోన్’గా వాతావరణశాఖ అధికారులు పేర్కొన్నారు. రోడ్లపై మంచు పేరుకుపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొన్నిచోట్ల వాహనాలు జారిపోవడం, ఒకదానితో మరొకటి ఢీకొన్న ఘటనలు చోటుచేసుకున్నాయి. హిమపాతం కారణంగా కొలరాడోలోని డెన్వర్ ఎయిర్‌పోర్టును తాత్కాలికంగా మూసివేశారు. విమానాల రాకపోకలను నిలిపివేశారు. దీంతో 1,339 విమాన సర్వీసులు రద్దయ్యాయి. కొన్ని ప్రాంతాల్లో ఇళ్లు కూలిపోవడంతో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. శిథిలాల నుంచి ప్రజలను రక్షించి ఆసుపత్రులకు తరలించారు. భారీ వర్షాలు కురిసే అవకాశాలు కూడా ఉండటంతో అధికారులు అప్రమత్తమై తగు చర్యలు తీసుకున్నారు. న్యూమెక్సికోలో వీచిన బలమైన గాలులకు ఒక రైలుకు చెందిన 26 బోగీలు వంతెనపై నుంచి పడిపోయాయి. దీంతో రంగంలోకి దిగిన సిబ్బంది సహాయక చర్యలు చేపట్టారు.
అమెరికాను వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’
Published Thu, Mar 14 2019 9:54 PM | Last Updated on Thu, Mar 14 2019 9:54 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment