‘కేటగిరి-6’ హరికేన్ అవుతుందా?
గాలులు వీచే వేగం ఆధారంగా అమెరికాలోని నేషనల్ హరికేన్ సెంటర్ పలు తీవ్రతలను సూచిస్తూ హరికేన్లను వివిధ కేటగిరీలుగా వర్గీకరిస్తుంది. ఈ కొలమానం రూపకర్త హెర్బర్ట్ సఫిర్ అనే ఇంజినీర్. హరికేన్ సెంటర్ మాజీ డైరెక్టర్ రాబర్ట్ సింప్సన్ ఈ కొలబద్దను 1970ల నుంచి అమలుచేయడం ఆరంభించడంతో ‘సఫిర్-సింప్సన్ హరికేన్ విండ్ స్కేలు’గా దీన్ని పిలుస్తున్నారు. ఇప్పుడు దీనికి కాలం చెల్లినట్టే అనిపిస్తోంది. ఎంతోకాలంగా మారని ఈ పాత స్కేల్ మీద 1 నుంచి 5 వరకు మాత్రమే కేటగిరీలు ఉన్నాయి. దూసుకొస్తున్న ‘మిల్టన్’ హరికేన్ పుణ్యమాని ఇప్పుడు ఆ పాత ప్రమాణాన్ని సవరించి ‘కొత్త విభాగాలు’ ఏర్పాటు చేయాల్సిన అవసరమొచ్చినట్టే కనిపిస్తోంది.
‘మిల్టన్’ హరికేన్ అతి వేగంగా.. అతి శక్తిమంతమైన కేటగిరి-5లోకి మారింది. కొద్ది గంటల్లోనే తీవ్రత స్థాయిని పెంచుకుని ‘మిల్టన్’ ఒక్కసారిగా కేటగిరి-2 నుంచి కేటగిరి-5లోకి దూకేసి ఫ్లోరిడాపై గురిపెట్టి ముందుకు కదులుతోంది. నిన్న ‘హెలెన్’ హరికేన్ దెబ్బకు అమెరికాలోని ఐదు రాష్ట్రాలు కకావికలమయ్యాయి. అవి నేటికీ తెప్పరిల్లలేదు. ఆ విపత్తు నుంచి తేరుకోకుండానే, కోలుకోకుండానే ఇప్పుడు మరోసారి మిల్టన్ రూపంలో ప్రమాదం చుట్టుముడుతోంది.
మెక్సికో సింధుశాఖలో ‘మిల్టన్’ ఏర్పడింది. గంటకు 96 మైళ్ల వేగంతో ఓ మాదిరి గాలులు వీచే కేటగిరి-2 ఉష్ణమండల తుపాను స్థాయి నుంచి కేవలం రోజున్నర వ్యవధిలోనే గంటకు 180 మైళ్ళ (288 కి.మీ.) వేగంతో పెనుగాలులు ఉద్ధృతంగా వీస్తూ కేటగిరి-5 హరికేన్‌గా మిల్టన్ పరివర్తనం చెందింది. చూస్తుంటే మిల్టన్ దూకుడు తగ్గేట్టు లేదు. దీని ‘శక్తి’ ఇంకా పెరిగి కేటగిరి-6లోకి మారుతుందా? అంటే చెప్పలేం. ఎందుకంటే హరికేన్ల శక్తిస్థాయుల్ని కొలిచే గరిష్ఠ స్కేల్ ప్రమాణం కేటగిరి-5. కేటగిరి-6 అనేది సాంకేతికంగా ఇప్పటివరకు లేనే లేదు. అదొక సైద్ధాంతిక పరికల్పన మాత్రమే. అంటే ఊహాజనిత (Hypothetical) భావన. భావనలు, ఊహలు ఉన్నా, లేకపోయినా.. మిల్టన్ మాత్రం అతి త్వరలో కేటగిరి-6 హరికేన్ రేంజికి చేరుతుందని నిపుణుల అంచనా.
గాలుల వేగం గంటకు 157 మైళ్ళు (252 కిలోమీటర్ల) దాటితే అది కేటగిరీ-5 హరికేన్ అవుతుంది. గంటకు 192 మైళ్ల (307 కిలోమీటర్ల) ప్రచండ వేగంతో గాలులు వీస్తే అది కేటగిరి-5 ‘అంతిమ హద్దు’ను దాటవేసినట్టే. 1980 నుంచి చూస్తే కేవలం 5 హరికేన్లు, టైఫూన్లు మాత్రమే కేటగిరి-5 కంటే ఎక్కువ తీవ్రతతో సంభవించాయి. కడపటి సమాచారం అందేసరికి.. వెచ్చటి గల్ఫ్ ఆఫ్ మెక్సికో జలాల్లో గంటకు 9 మైళ్ళ వేగంతో కదులుతున్న ‘మిల్టన్’ హరికేన్ బుధవారం ‘తంపా అఖాతం’ వద్ద తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు.
ఫ్లోరిడా పశ్చిమ తీరంపై ప్రభావం అధికంగా ఉండవచ్చు. ఫ్లోరిడాలోని పలు ప్రాంతాల్లో ప్రజల్ని ఇళ్ళు ఖాళీ చేయించి సురక్షిత ప్రదేశాలకు తరలిస్తున్నారు. మనం బోయింగ్ 747 జెట్ విమానం ఇంజిన్ లోపల ఉంటే ఆ ‘హోరు’ ఎలా ఉంటుందో.. కేటగిరీ-5 హరికేన్ గర్జన అలా ఉంటుందని బ్రిటన్ పత్రిక ‘ది ఇండిపెండెంట్’ వర్ణించింది.
- జమ్ముల శ్రీకాంత్
(Credit: USA TODAY, CBS News, ABC News, The Independent (UK), The Australian).
Comments
Please login to add a commentAdd a comment