సాక్షి, నెట్‌వర్క్: పలు జిల్లాల్లో శుక్రవారం ఈదురు గాలులు బీభత్సం సృష్టించాయి. చేతికందొచ్చిన పంటలను నాశనం చేశాయి. రాత్రి వీచిన ఈ గాలులకు కామారెడ్డి, సిరిసిల్ల, నిజామాబాద్, ఉమ్మడి మెదక్ జిల్లాల్లో వేలాది ఎకరాల్లో పంటలను రైతులు నష్టపోయారు. కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా సుమారు ఐదు వేల హెక్టార్లలో పంటలు దెబ్బతిన్నాయి. బీర్కూర్, బాన్సువాడ మండలాల్లో వరి పంట, మొక్కజొన్న భారీగా దెబ్బతిన్నాయి.
దాదాపు రూ.13 కోట్ల మేర పంటనష్టం జరిగినట్లు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. మామిడికాయలు నేలపాలయ్యాయి. నిజామాబాద్ జిల్లాలో 464 ఎకరాల్లో మామిడి పంటకు నష్టం వాటిల్లినట్లు ఉద్యానశాఖ అధికారులు అంచనాకు వచ్చారు. సంగారెడ్డి జిల్లాలో 1,352 హెక్టార్లలో వివిధ పంటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లా రైతులకు వడగండ్లు వరుసగా నాలుగో రోజూ కడగండ్లనే మిగిల్చాయి.
మెదక్ జిల్లాలోని పలు మండలాల్లో వందల ఎకరాల్లో వరి, మొక్కజొన్న పంటలు నేలకొరిగాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వివిధ మండలాల్లోని సుమారు 1,280 ఎకరాల్లో మామిడి, వరి పంటలు దెబ్బతిన్నాయి. సిద్దిపేట జిల్లా దౌల్తాబాద్ మండలం శేరిపల్లిబందారం గ్రామానికి చెందిన స్వరూప (37) శనివారం పొలానికి వెళ్లింది. ఆ సమయంలో బలమైన ఈదురుగాలులు వీయడంతో విద్యుత్ తీగలు తెగిపడ్డాయి. ఈ క్రమంలో గడ్డికోస్తూ స్వరూప తీగలను తాకి మృతిచెందింది.
Comments
Please login to add a commentAdd a comment