150 కి.మీ. వేగంతో పెనుగాలులు
- నగరంపై ఉరుములేని పిడుగులా విరుచుకుపడ్డ భారీ వర్షం
- 10 సెం.మీ. కుండపోత..
సాక్షి, హైదరాబాద్: ఉరుములేని పిడుగులా మంగళవారం అర్ధరాత్రి విరుచుపడ్డ అకాల వర్షం భాగ్యనగరంలో బీభత్సం సృష్టించింది. సరిగ్గా ఏడాది క్రితం ఇదే మే నెల 6వ తేదీన కురిసిన భారీ వర్షాన్ని తలపిస్తూ నగర ప్రజలను వణికించింది. గంటలకు 120 నుంచి 150 కి.మీ మేర వీచిన ప్రచండ గాలుల ధాటికి భారీ వృక్షాలు కూడా కూకటి వేళ్లతో సహా నేలకూలాయి. అనేక ప్రాంతాల్లో విద్యుత్ స్తంభాలు కూలడంతో అంధకారం అలుముకుంది. మూడు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు కూలిపోయాయి. ఒక్కసారిగా నాలాలు పొంగిపొర్లి లోతట్టు ప్రాంతాల్లో జలమయమయ్యాయి. ఇళ్లల్లోకి నీరు చేరడంతో జనం పడరాని పాట్లు పడ్డారు. మొత్తంగా నగరంలో దాదాపు 10 సెం.మీ. వర్షం కురిసింది. గతేడాది మేలో కురిసిన వర్షం(7.9 సెం.మీ.) కంటే ఇదే ఎక్కువ.
అతలాకుతలం..: బలమైన గాలులకు నగరం లో 291 చెట్లు కూలిపోయాయి. 56 ప్రాంతాల్లో నీరు నిలిచింది. అనేక చోట్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. విరిగిపడ్డ చెట్లు.. కూలిన హోర్డింగ్‌లతో ప్రజలు భీతావహుల య్యారు. అర్ధరాత్రి వర్షం కురవడంతో భారీ ప్రమాదాలు తప్పాయి. మొత్తంగా అధికారులు వెంటనే స్పందించడం, వివిధ శాఖల సమన్వ యంతో ఈ పరిస్థితి తొందరగానే చక్కబడింది. బాధితులు ట్వీటర్ ద్వారా తమ సమస్యలను మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకువెళ్లారు. జీహెచ్‌ఎం సీ కమిషనర్ జనార్దన్‌రెడ్డి తెల్లవారున 6 గంటలకే క్షేత్రస్థాయిలోకి వెళ్లి పనులను పర్యవేక్షించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 32 విద్యుత్ స్తంభాలు కూలిపోగా 24 స్తంభాలను పునరుద్ధరించారు.
నెలన్నరపాటు హోర్డింగులపై నిషేధం..
గాలులకు హోర్డింగులు కూలుతుండటంతో నెల నుంచి నెలన్నర పాటు వాటిపై నిషేధం విధించనున్నట్టు జీహెచ్‌ఎంసీ కమిషనర్ తెలిపారు. ఉన్న హోర్డింగ్‌లను తొలగిస్తామని చెప్పారు. గాలులు ఎప్పటివరకు వీస్తాయన్న అంశంలో వాతావరణ శాఖను సంప్రదించి దీనిపై తగు నిర్ణయం తీసుకుంటామన్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రజలు 100, 040–21111111 నంబర్లకు ఫోన్ చేయవచ్చునన్నారు.
1,600 ఎకరాల్లో పంట నష్టం
రాష్ట్రంలో మంగళ, బుధవారాల్లో కురిసిన అకాల వర్షాలకు కోతకు సిద్ధంగా ఉన్న వరి, మొక్కజొన్న పంటలకు తీవ్ర నష్టం వాటిల్లింది. అనేకచోట్ల వడగళ్లు పడడం, తీవ్రమైన గాలి వానలకు 1601 ఎకరాల్లో వరి, మొక్కజొన్నకు నష్టం వాటిల్లిందని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి పార్థసారథి తెలి పారు. 40 ఎకరాలు మొక్కజొన్న కాగా మిగిలినదంతా వరి పంటేనని వెల్లడించారు. భూపాలపల్లి జిల్లాలో 1250, మహబూబ్‌నగర్ 180, వికారాబాద్‌లో 90 ఎకరాల్లో పంట నష్టం జరిగిందన్నారు.
మరో నాలుగు రోజులు వర్షాలు
రాష్ట్రవ్యాప్తంగా మరో నాలుగు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. ఉరుములు, మెరుపులతో కూడి వర్షాలు పడతాయని, వడగళ్లు కురిసే అవకాశముందని తెలిపింది. ఉత్తర కర్ణాటక నుండి దక్షిణ తమిళనాడు మీదుగా అల్పపీడనద్రోణి కొనసాగుతోందని.. దాంతో దక్షిణ కోస్తాంధ్ర జిల్లాల్లో ఉపరితల ఆవర్తనం వ్యాపించి ఉండడం, క్యుములోనింబస్ మేఘాలు ఆవరించడంతో వానలు పడుతున్నాయని వెల్లడించింది. గత 24 గంటల్లో రాష్ట్రంలో దాదాపు అన్నిచోట్ల భారీ వర్షాలు కురిశాయి. అత్యధికంగా ఖమ్మం, చేవెళ్ల, మహబూబాబాద్‌లలో 7 సెంటీమీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. పినపాక, ఏన్కూరు, తిమ్మాజీపేటలలో 6 సెంటీమీటర్లు.. జూలూరుపాడు, మంచాలలో 5, అశ్వాపురంలో 4, కొందుర్గు, హకీంపేట, గోల్కొండ, కల్వకుర్తి, షాద్‌నగర్, శామీర్‌పేటల్లో 3, ఇల్లెందు, కొణిజర్ల, కూసుమంచి, అచ్చంపేట, శేరిలింగంపల్లి, యాచారం, చంద్రుగొండ, డోర్నకల్‌లలో 2 సెంటీమీటర్ల చొప్పున వర్షం కురిసింది. మొత్తంగా దాదాపు రాష్ట్రమంతటా వర్షపాతం నమోదుకావడంతో.. వాతావరణం కాస్తంత చల్లబడింది. బుధవారం ఆదిలాబాద్‌లో 43.5 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదైంది. మెదక్, నిజామాబాద్‌లలో 42, రామగుండంలో 41, మహబూబ్‌నగర్‌లో 39, ఖమ్మం, భద్రాచలం, హన్మకొండలలో 38, హైదరాబాద్‌లో 36 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.