హైదరాబాద్: మృత్యువు ఎప్పుడు.. ఏ రూపంలో వచ్చి కబళిస్తుందో చెప్పలేమనడానికి ఈ దుర్ఘటనే నిదర్శనం. హైదర్‌గూడ ఎమ్మెల్యే క్వార్టర్స్ సమీపంలో రెడ్ సిగ్నల్ పడటంతో వాహనాలు ఆగి ఉన్నాయి. ఇంతలోనే రోడ్డు పక్కనే ఉన్న ఓ భారీ వృక్షం 3 ఆటోలపై కుప్పకూలింది. ఇందులో ఉన్న ఓ ఆటో డ్రైవర్.. తనను కాపాడంటూ వేడుకుంటూనే అసువులు బాసిన విషాద ఘటన శనివారం మధ్యాహ్నం చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసులు చెప్పిన వివరాల ప్రకారం.. ఖైరతాబాద్‌కు చెందిన మహ్మద్ గౌస్ (36) నారాయణగూడ నుంచి హిమాయత్‌నగర్ తెలుగు అకాడమీ మీదుగా బషీర్‌బాగ్ వెళ్తున్నాడు.
సిగ్నల్ వద్ద రెడ్ సిగ్నల్ పడటంతో సరిగ్గా చెట్టు కింద ఆగాడు. మరో 18 సెకన్లలో గ్రీన్ లైట్ పడేలోపే మృత్యువు చెట్టు రూపంలో అతడిని కబళించింది. నాలుగు సెకన్ల వ్యవధిలో చెట్టు కుప్పకూలి దాని కొమ్మ ఆటోపై పడింది. ఆటోలోనే గౌస్ ఒరిగిపోయాడు. కనీసం కదలడానికి కూడా వీలు లేకుండా ఉండటంతో ‘మా.. ముజే బచావో’ అంటూ ప్రాణాలు విడిచాడు. అతడి మూ లుగు విన్న తోటి వాహనదారులు రక్షించేందుకు ప్రయత్నించడానికి సైతం వీల్లేకుండా పోయింది.
చేయీ.. చేయీ.. కొమ్మను జరిపి..
మృతుడు గౌస్ ఉన్న ఆటో ముందూ వెనకా ఆటోలు ఉన్నాయి. మరో రెండు ఆటోలపై చెట్టు కొమ్మలు పడుతున్న సమయంలో ఆ ఇద్దరు డ్రైవర్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. వెనక ఉన్న ఆటో పూర్తిగా ధ్వంసమైంది. ముందున్న మరో ఆటో పాక్షికంగా దెబ్బతిన్నది. స్థానికులు, వాహనదారులు కలిసి చెట్టుకొమ్మను ఆటోల మీదనుంచి పక్కకు జరపడంతో గౌస్ మృతదేహాన్ని బయటకి తీసి 108లో ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. చెట్టు కూలడంతో నారాయణగూడ ట్రాఫిక్ పోలీసులు తెలుగు అకాడమీ రోడ్డును బ్లాక్ చేశారు. దీంతో హిమాయత్‌నగర్ లిబర్టీ, బషీర్‌బాగ్, నారాయణగూడ, కింగ్‌కోఠి, నల్లకుంట, చే నంబర్ వరకు వేలాది వాహనాలతో ట్రాఫిక్ స్తంభించిపోయింది.
హిమాయత్‌నగర్ ప్రాంతంలో సుమారు 19 భారీ వృక్షాలు కూలిపోయే స్థితిలో ఉన్నాయని జనవరిలో హార్టికల్చర్ డిపార్ట్‌మెంట్‌కు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని కార్పొరేటర్ మహాలక్ష్మి గౌడ్ ఆరోపించారు. వారు పట్టించుకున్నట్లైతే శనివారం నాటి ప్రమాదం జరిగేది ఉండేది కాదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment