మాదాపూర్: కొండాపూర్ డివిజన్ పరిధిలోని దుర్గం చెరువు వద్ద 7.0 ఎంఎల్‌డీ సామర్థ్యంతో రూ.15 కోట్ల వ్యయంతో నూతనంగా నిర్మించిన మురుగునీటి శుద్దికేంద్రం(ఎస్టీపీ)ను సోమవారం మేయర్ విజయలక్ష్మి, ఎమ్మెల్సీ సురభి వాణీదేవిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్‌టీపీతో దుర్గంచెరువు ప్రాంత ప్రజలకు ఎంతో ఊరట లభిస్తుందన్నారు. అలాగే మురుగు నీటి నుంచి చెరువులకు విముక్తి లభిస్తుందన్నారు. హైదరాబాద్‌ను విశ్వనగరంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తున్నామని చెప్పారు. మురుగునీటి శుద్ధిలో హైదరాబాద్ నగరం దేశంలోనే ప్రత్యేకంగా నిలుస్తుందన్నారు.
జీహెచ్‌ఎంసీ పరిధిలో ఉన్న 772 ఎల్‌ఎండీ సీవరేజ్ ప్లాంట్ల ఏర్పాటుకు కేబినెట్ అనుమతి ఇచ్చిందన్నారు. దీనికోసం రూ. 3866.21 కోట్లు ప్రభుత్వం కేటాయించిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో జీహెచ్‌ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్, హెచ్‌ఎండీఏ స్పెషల్ చీఫ్ సెక్రటరీ అర్వింద్ కుమార్, జలమండలి ఎండీ దానకిషోర్, జోనల్ కమిషనర్ శ్రీనివాస్‌రెడ్డి, ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ, కార్పొరేటర్లు హమీద్ పటేల్, నార్నే శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సింధు ఆదర్శ్‌రెడ్డి, మంజుల రఘునాథ్‌రెడ్డి, మాజీ కార్పొరేటర్లు సాయిబాబా, మాధవరం రంగారావు పాల్గొన్నారు.
దుర్గం చెరువులో వాటర్ ఫౌంటెన్లు ప్రారంభం
సందర్శకులను ఆకట్టుకునేందుకు దుర్గం చెరువులో ఏర్పాటు చేసిన మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్లను స్థానిక ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ ప్రారంభించారు. దాదాపు 60 మీటర్లు పొడవులో..మ్యూజిక్‌కి అనుగుణంగా రంగులు వెదజల్లుతున్న ఫౌంటెన్లు సందర్శకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ప్రతి రోజు సాయంత్రం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ మ్యూజికల్ వాటర్ ఫౌంటెన్ పనిచేస్తుందని అధికారులు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment