హైదరాబాద్: గ్రేటర్ నగరంలో ఎప్పుడు గాలి వీస్తే ఏ హోర్డింగు కూలిపోతుందో తెలియని పరిస్థితి నెలకొంది. సీజన్లతో సంబంధం లేకుండా వర్షాలతో పాటు ఈదురుగాలులు సైతం వీస్తున్నాయి. శిథిల భవనాలపై, సామర్థ్యం లేని పిల్లర్లపై సైతం హోర్డింగులున్నాయి. జీహెచ్‌ఎంసీ యంత్రాంగం యాడ్ ఏజెన్సీల ఒత్తిళ్ల వల్లనో, దిగువస్థాయి సిబ్బంది ఆమ్యామ్యాల వల్లనో కానీ చూసీ చూడనట్లు వదిలేసింది. ఏదైనా ప్రమాదం జరిగితే మాత్రం ఎక్కడ లేని హడావుడి చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చిరించి, అనంతరం ఆ విషయం మరచిపోతోంది.
దాదాపు ఏడేళ్ల క్రితం జూబ్లీహిల్స్‌లో యూనిపోల్ కూలి పలు కార్లు ధ్వంసమయ్యాయి. అనుమతి లేని హోర్డింగులు, యూనిపోల్స్‌ను తొలగించడంతో పాటు.. అనుమతి పొందినవైనా సరే కూలితే వాటిని ఏర్పాటు చేసిన ఏజెన్సీలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రకటనలు జారీ చేసింది. నగరంలో గంటకు 100–150 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీచిన ఘటనలు కూడా ఉన్నాయి. ఈదురు గాలులకు పెద్ద చెట్లే నేలకూలుతున్నాయి. ఇటీవలే హిమాయత్‌నగర్‌లో చెట్టు కూలి ఆటోపై పడటంతో డ్రైవర్ ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. అంతకంటే ప్రమాదకరంగా ఉన్న, అక్రమంగా వెలసిన హోర్డింగులు మాత్రం నగరంలో కుప్పలు తెప్పలుగా ఉన్నాయి.
చర్యలకు సిద్ధం
గ్రేటర్ నగరంలో అక్రమంగా వెలసిన హోర్డింగులతో పాటు ప్రకటనల ద్వారా వచ్చే ఆదాయం కోసం అక్రమంగా ఏర్పాటు చేసిన యూనిపోల్స్, బస్‌షెల్టర్లు, గ్లో సైన్‌బోర్డులు, లాలీపాప్స్, ఆర్చీలు తదితర ప్రాంతాల్లో ప్రకటనలున్న నిర్మాణాలన్నింటినీ కూడా కూల్చి వేయనున్నట్లు అధికారులు తెలిపారు. ఈమేరకు టెండర్లు కూడా ఆహ్వానించినట్లు పేర్కొన్నారు. అక్రమంగా ఏర్పాటైన వాటినన్నింటినీ త్వరలోనే తొలగించనున్నట్లు పేర్కొన్నారు.
జీహెచ్‌ఎంసీ జోన్ల వారీగా ఈ పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఇందుకుగాను జీహెచ్‌ఎంసీ కాంట్రాక్టర్లకు చెల్లించేదేమీ ఉండదు. వాటిని తొలగించే కాంట్రాక్టర్లే సదరు ఇనుప సామగ్రిని తీసుకుంటాయని, జీహెచ్‌ఎంసీకే అవి నిర్ణీత ధరను చెల్లించాల్సి ఉంటుందని, ఎవరు ఎక్కువ ధర చెల్లిస్తే వారికి కాంట్రాక్టు పనులు అప్పగించనున్నట్లు తెలిపారు. కాంట్రాక్టర్లు వాటిని స్క్రాప్‌గా విక్రయించుకోవడం ద్వారా వారికి లాభముంటుందన్నారు.
Comments
Please login to add a commentAdd a comment